1 దినవృత్తాంతములు 28

28
దేవాలయాన్ని గురించి దావీదు ఏర్పాట్లు
1దావీదు ఇశ్రాయేలీయుల అధికారులందరిని అనగా, గోత్రాల అధికారులను, రాజు సేవలో ఉన్న సైన్యాల విభాగాల అధిపతులను, సహస్రాధిపతులను, శతాధిపతులను, రాజుకు రాజకుమారులకు ఉన్న ఆస్తి మీద, పశువులన్నిటి మీద ఉన్న అధికారులను, రాజపరివారాన్ని, పరాక్రమశాలులను, యుద్ధ వీరులందరిని యెరూషలేములో సమావేశపరిచాడు.
2రాజైన దావీదు లేచి నిలబడి ఇలా అన్నాడు: “నా తోటి ఇశ్రాయేలీయులారా, నా ప్రజలారా, వినండి. మన దేవునికి పాదపీఠంగా యెహోవా నిబంధన మందసాన్ని ఉంచే మందిరాన్ని నేను నిర్మించాలని నా హృదయంలో అనుకున్నాను, దాన్ని కట్టడానికి సన్నాహాలు చేశాను. 3అయితే దేవుడు నాతో, ‘నీవు యుద్ధాలు చేసి రక్తం చిందించావు కాబట్టి, నీవు నా పేరిట మందిరాన్ని కట్టించకూడదు’ అని చెప్పారు.
4“అయినా, ఇశ్రాయేలీయుల మీద ఎప్పుడు రాజుగా ఉండడానికి ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా నన్ను, నా కుటుంబమంతటి నుండి ఎన్నుకున్నారు. ఆయన యూదా గోత్రాన్ని, యూదా గోత్రంలో నా తండ్రి కుటుంబాన్ని ఎన్నుకుని, నా తండ్రి కుమారులలో నుండి నన్ను ఇశ్రాయేలు అంతటి మీద రాజుగా చేయడానికి ఇష్టపడ్డారు. 5యెహోవా నాకు అనేక కుమారులను ఇచ్చారు. వారందరి నుండి, ఇశ్రాయేలీయులపై యెహోవా రాజ్యసింహాసనం మీద కూర్చోడానికి ఆయన నా కుమారుడైన సొలొమోనును ఎన్నుకున్నారు. 6ఆయన నాతో ఇలా అన్నారు: ‘నేను నీ కుమారుడైన సొలొమోనును నాకు కుమారునిగా ఎన్నుకున్నాను, నేను అతనికి తండ్రిగా ఉంటాను కాబట్టి అతడు నా మందిరాన్ని, ఆవరణాలను కట్టిస్తాడు. 7ఈ రోజుల్లో జరుగుతున్నట్లుగానే, అతడు నా ఆజ్ఞలను న్యాయాన్ని స్థిరంగా అనుసరిస్తే, నేనతని రాజ్యాన్ని శాశ్వతంగా స్థిరపరుస్తాను.’
8“కాబట్టి ఇప్పుడు యెహోవా సమాజంగా చేరిన ఇశ్రాయేలీయులందరు చూస్తుండగా, మన దేవుడు వింటుండగా, నేను మీకు చెప్పేది ఏంటంటే, మీరు ఈ మంచి దేశాన్ని స్వాధీనపరచుకుని, మీ తర్వాత మీ వారసులకు దానిని శాశ్వతమైన వారసత్వంగా అందించేలా మీ దేవుడైన యెహోవా ఇచ్చిన ఆజ్ఞలన్నిటిని జాగ్రత్తగా పాటించండి.
9“సొలొమోనూ, నా కుమారుడా! నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయాలను పరిశోధిస్తారు, ఆలోచనల ఉద్దేశాలన్నిటిని గ్రహిస్తారు కాబట్టి నీవు ఆయనను తెలుసుకుని పూర్ణహృదయంతో చిత్తశుద్ధితో ఆయనను సేవించు. నీవు ఆయనను వెదికితే, ఆయన నీకు దొరుకుతారు; అయితే నీవు ఆయనను విడిచిపెడితే, ఆయన నిన్ను శాశ్వతంగా తిరస్కరిస్తారు. 10పరిశుద్ధాలయంగా ఉండేలా ఒక ఇల్లు కట్టడానికి యెహోవా నిన్ను ఎన్నుకున్నారు అనే సంగతిని గ్రహించి ధైర్యంగా ఉండి పని చేయి.”
11అప్పుడు దావీదు తన కుమారుడైన సొలొమోనుకు, దేవాలయ మంటపము, దాని భవనాలకు, గిడ్డంగులకు, దాని పైభాగానికి, దాని లోపలి గదులకు, ప్రాయశ్చిత్త స్థలానికి సంబంధించిన నమూనాలు ఇచ్చాడు. 12దేవుని ఆత్మ దావీదు హృదయంలో పెట్టిన నమూనాలను అతడు సొలొమోనుకు ఇచ్చాడు. యెహోవా మందిర ఆవరణాలకు, చుట్టూ ఉండే గదులకు, దేవుని ఆలయ ఖజానాలకు, సమర్పించబడిన వస్తువుల ఖజానాలకు నమూనాలు అతడు ఇచ్చాడు. 13యాజకుల లేవీయుల విభాగాల గురించి, యెహోవా మందిరంలో జరగాల్సిన సేవలన్నిటి గురించి, అలాగే దాని సేవలో ఉపయోగించబడే పాత్రల గురించి కూడా దావీదు అతనికి నియమాలు తెలియజేశాడు. 14వివిధ సేవలలో ఉపయోగించబడే బంగారు ఉపకరణాలను చేయడానికి కావలసినంత బంగారాన్ని, వివిధ సేవలలో ఉపయోగించబడే వెండి ఉపకరణాలను చేయడానికి కావలసినంత వెండిని దావీదు అతనికి అప్పగించాడు. 15బంగారు దీపస్తంభాలకు వాటి దీపాలకు ఒక్కొక్క దీపస్తంభానికి దీపాలకు కావలసిన బరువు ప్రకారం బంగారాన్ని, వెండి దీపస్తంభాలకు వాటి దీపాలకు ఒక్కొక్క దీపస్తంభానికి దీపాలకు కావలసిన బరువు ప్రకారం వెండిని; 16దేవుని సన్నిధిలో రొట్టెలుంచే ఒక్కొక్క బంగారు బల్లకు కావలసిన బంగారాన్ని; వెండి బల్లలకు కావలసిన వెండిని; 17కొంకులు, గిన్నెలు, పాత్రలకు కావలసిన మేలిమి బంగారాన్ని; ఒక్కొక్క బంగారు పాత్రకు కావలసిన బరువు ప్రకారం బంగారాన్ని; ఒక్కొక్క వెండి పాత్రకు కావలసిన బరువు ప్రకారం వెండిని; 18ధూపవేదికకు కావలసిన స్వచ్ఛమైన బంగారాన్ని దావీదు అతనికి ఇచ్చాడు. తమ రెక్కలు విప్పి యెహోవా నిబంధన మందసాన్ని కప్పివుంచే బంగారు కెరూబుల రథం యొక్క నమూనాను కూడా దావీదు అతనికిచ్చాడు.
19అప్పుడు దావీదు, “ఇదంతా యెహోవా తన చేతిని నా మీద ఉంచడం వలన నేను వీటన్నిటిని వ్రాశాను, ఈ నమూనా వివరాలన్ని నేను గ్రహించగలిగేలా ఆయన చేశారు” అని చెప్పాడు.
20దావీదు తన కుమారుడైన సొలొమోనుతో ఇంకా మాట్లాడుతూ ఇలా చెప్పాడు, “దృఢంగా, ధైర్యంగా ఉంటూ పని చేయి. నా దేవుడైన యెహోవా నీతో కూడా ఉంటారు కాబట్టి భయపడకు దిగులుపడకు. యెహోవా ఆలయ సేవకు సంబంధించిన పనులన్నీ ముగిసేవరకు ఆయన నిన్ను ఏమాత్రం విడిచిపెట్టరు. 21దేవుని ఆలయ సేవ అంతటి కోసం యాజకులు, లేవీయుల విభాగాల ప్రకారం ఏర్పాటయ్యారు. ఈ పనులన్నీ చేయడానికి రకరకాల పనులలో నైపుణ్యం గలవారు మనస్పూర్తిగా నీకు సహాయం చేస్తారు. అధిపతులు, ప్రజలందరూ నీ ప్రతి ఆజ్ఞకు లోబడతారు.”

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

1 దినవృత్తాంతములు 28: TSA

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి