1 కొరింథీ 1
1
1దేవుని చిత్తం ద్వారా క్రీస్తు యేసుని అపొస్తలునిగా ఉండడానికి పిలువబడిన పౌలు, మన సహోదరుడైన సొస్తెనేసు,
2క్రీస్తు యేసులో పవిత్ర పరచబడి పరిశుద్ధ ప్రజలుగా ఉండడానికి పిలువబడిన వారితో పాటు, మన ప్రభువైన యేసు క్రీస్తు పేరట ప్రతిచోట ప్రార్థించే కొరింథీలోని దేవుని సంఘస్థులందరికీ శుభమని చెప్పి వ్రాస్తున్నాను:
3మన తండ్రియైన దేవుని నుండి ప్రభువైన యేసు క్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగును గాక.
కృతజ్ఞతలు చెల్లించుట
4క్రీస్తు యేసులో దేవుని కృప మీకు ఇవ్వబడింది కనుక మీ కొరకు నా దేవునికి ఎల్లప్పుడు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. 5దేవుడు క్రీస్తు గురించి మా సాక్ష్యాన్ని మీ మధ్య స్థిరపరస్తున్నారు కనుక, 6మీరు ఆయనలో సమస్త జ్ఞానంతో సమస్త వాక్చాతుర్యంతో ప్రతి దానిలో ఐశ్వర్యవంతులు అయ్యారు. 7కనుక మీరు ఏ కృపావరంలో లోటు లేకుండా మన ప్రభువైన యేసు క్రీస్తు ప్రత్యక్షత కొరకు ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. 8ఆ దేవుడే మన ప్రభువైన యేసు క్రీస్తు ప్రత్యక్షపరచబడే రోజున, మీరు నిరపరాధులుగా ఉండాలని అంతం వరకు మిమ్మల్ని స్థిరపరుస్తారు. 9తన కుమారుడు మన ప్రభువైన యేసు క్రీస్తు సహవాసంలోనికి మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు.
నాయకులను బట్టి సంఘంలో విభజన
10సహోదరీ సహోదరులారా, మీ మధ్య భేదాలు లేకుండ యదార్థమైన ఏక మనస్సుతో, ఒకే ఆలోచనతో ఒకే భావంతో ఉండాలని మన ప్రభువైన యేసు క్రీస్తు పేరట నేను మిమ్మల్ని వేడుకొంటున్నాను. 11నా సహోదరీ సహోదరులారా, మీలో కలహాలు ఉన్నాయని క్లోయె ఇంటివారిలో కొందరు నాకు తెలియజేసారు. 12నేను చెప్పేది ఏంటంటే: మీలో ఒకరు “నేను పౌలును అనుసరిస్తున్నానని” వేరొకరు “నేను అపొల్లోను అనుసరిస్తున్నానని” వేరొకరు “నేను కేఫాను అనుసరిస్తున్నానని”; మరి ఇంకొకరు “నేను క్రీస్తును అనుసరిస్తున్నానని” చెప్పుకుంటున్నారని విన్నాను.
13క్రీస్తు విభజింపబడి ఉన్నాడా? పౌలు మీ కొరకు సిలువ వేయబడ్డాడా? మీరు పౌలు పేరట బాప్తిస్మం పొందారా? 14-15నా పేరట బాప్తిస్మం పొందామని మీరు ఎవరూ చెప్పుకోకూడదని క్రిస్పుకు గాయికు తప్ప మరి ఎవరికీ నేను బాప్తిస్మం ఇవ్వనందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. 16అవును! సైఫను ఇంటివారికి బాప్తిస్మం ఇచ్చాను, దానికి మించి ఎవరికి కూడా బాప్తిస్మం ఇచ్చినట్టు నాకు గుర్తులేదు. 17ఎందుకంటే, క్రీస్తు నన్ను బాప్తిస్మం ఇవ్వడానికి పంపలేదు గానీ, క్రీస్తు సిలువ తన శక్తి కోల్పోకుండా ఉండాలని, జ్ఞానంతో వాక్చాతుర్యంతో కాకుండా, సువార్తను ప్రకటించడానికే ఆయన నన్ను పంపించారు.
సిలువ వేయబడిన క్రీస్తే దేవుని శక్తి మరియు జ్ఞానము
18ఎందుకంటే సిలువను గురించిన సువార్త నశించేవారికి పిచ్చితనంగా ఉంది, కానీ రక్షించబడే మనకు అది దేవుని శక్తి. 19దీని గురించి వాక్యంలో ఇలా వ్రాయబడి ఉంది,
“జ్ఞానుల జ్ఞానాన్ని నాశనం చేస్తాను;
వివేకవంతుల తెలివిని వ్యర్థం చేస్తాను.”#1:19 యెషయా 29:14
20జ్ఞాని ఎక్కడ? ధర్మశాస్త్ర బోధకుడు ఎక్కడ? ఈ కాలపు పండితుడు ఎక్కడ? ఈ లోక జ్ఞానాన్ని దేవుడు వెర్రితనంగా చేశాడు కదా? 21దేవుని జ్ఞానం ప్రకారం, లోకం తన జ్ఞానంతో దేవునిని తెలుసుకోలేదు, సువార్తను ప్రకటించే వెర్రితనం ద్వారా నమ్మినవారిని రక్షించడం దేవునికి ఇష్టమైనది. 22యూదులు సూచనలు అడుగుతారు, గ్రీసు దేశస్థులు జ్ఞానం కొరకు వెదుకుతారు. 23అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తునే ప్రకటిస్తున్నాం: ఆయన యూదులకు ఆటంకంగా యూదేతరులకు వెర్రితనంగా ఉన్నారు. 24అయితే యూదులలో గ్రీసు దేశస్థులలో దేవునిచే పిలువబడిన వారికి క్రీస్తు దేవుని శక్తిగా, దేవుని జ్ఞానంగా ఉన్నారు. 25ఎందుకంటే, దేవుని వెర్రితనం మనుష్యుల జ్ఞానం కంటే జ్ఞానవంతమైనది, దేవుని బలహీనత మనుష్యుల బలం కంటే బలమైనది.
26సహోదరీ సహోదరులారా, మిమ్మల్ని పిలిచినప్పుడు మీరు ఎలా ఉన్నారో ఆలోచించండి. లోకపు దృష్టిలో మీలో చాలామంది జ్ఞానులు కారు, ఘనులు కారు, గొప్ప వంశంలో పుట్టిన వారు కారు. 27అయితే, జ్ఞానులను సిగ్గుపరచడానికి లోకంలోని బుద్ధిహీనులను దేవుడు ఎన్నుకున్నాడు; బలవంతులను సిగ్గుపరచడానికి లోకంలోని బలహీనులను దేవుడు ఎన్నుకున్నాడు. 28-29ఎవరూ దేవుని ముందు తనను తాను హెచ్చించుకోకుండా ఉండడానికి, ఎన్నికచేయబడిన వారిని వ్యర్థం చేయడానికి, ఈ లోకంలో నీచమైన వారిని, నిర్లక్ష్యం చేయబడిన వారిని, తృణీకరించబడిన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. 30దేవుడు చేసిన కార్యాలను బట్టి మీరు క్రీస్తు యేసులో ఉన్నారు. ఇప్పుడు క్రీస్తే దేవుని ద్వారా మనకు జ్ఞానంగా ఉన్నారు అనగా ఆయనే మన నీతిగా, పరిశుద్ధతగా, విమోచనగా ఉన్నారు. 31కనుక, “గర్వించేవారు ప్రభువులోనే గర్వించాలి”#1:31 యిర్మీయా 9:24 అని వ్రాయబడి ఉంది.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
1 కొరింథీ 1: TCV
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
తెలుగు సమకాలీన అనువాదము™, క్రొత్త నిబంధన
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022 Biblica, Inc.
అనుమతితో ఉపయోగించబడినది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
Telugu Contemporary Version™, New Testament
Copyright © 1976,1990, 2022 by Biblica, Inc.
Used with permission. All rights reserved worldwide.