1 కొరింథీ 2:1-16

1 కొరింథీ 2:1-16 TCV

సహోదరీ సహోదరులారా నేను మీ దగ్గరకు వచ్చినప్పుడు, మాటల నేర్పరితనంతో లేక మానవ తెలివితేటలతో దేవుని మర్మాన్ని మీకు ప్రకటించలేదు. నేను మీతో ఉన్నప్పుడు సిలువ వేయబడిన యేసు క్రీస్తు తప్ప మరి దేని గురించి తెలియచేయకూడదని నిశ్చయించుకున్నాను. నేనైతే బలహీనతలో, అధిక భయంతో వణుకుతో మీ దగ్గరకు వచ్చాను. మీ విశ్వాసం మనుష్యల జ్ఞానం మీద కాకుండా దేవుని శక్తి మీదే ఆధారపడాలని, నా మాటలు నా బోధలు జ్ఞానంతో లేక వాక్చాతుర్యంతో కాకుండా పరిశుద్ధాత్మ శక్తితో నిండి ఉన్నాయి. అయితే పరిపూర్ణులైనవారి మధ్యలో మేము జ్ఞానాన్ని బోధిస్తున్నాం. అది ఈ యుగసంబంధమైన జ్ఞానం కాదు, వ్యర్థమైపోయే ఈ లోక అధికారుల జ్ఞానం కాదు. అయితే, మేము దేవుని జ్ఞానాన్ని ప్రకటిస్తున్నాము, అది, ఈ లోకం ఉనికిలోనికి రాకముందే, దేవుడు రహస్యంగా మన ఘనత కొరకు దాచియుంచిన మర్మం. దీని గురించి ఈ యుగానికి చెందిన లోకాధికారులలో ఎవరికి తెలియలేదు. అది వారికి తెలిసివుంటే వారు మహిమా స్వరూపియైన ప్రభువును సిలువ వేసి ఉండేవారు కారు. అయితే దీని గురించి: “ఏ కంటికి కనబడనివి, ఏ చెవికి వినబడనివి, ఏ మానవ మనస్సు ఊహించలేని వాటిని దేవుడు తనను ప్రేమించేవారి కొరకు సిద్ధపరచారు,” అని వ్రాయబడి ఉంది. ఈ విషయాలను దేవుడు తన ఆత్మ ద్వారా మనకు తెలియజేసారు. ఆత్మ అన్నిటిని, దేవుని లోతైన సంగతులను కూడ పరిశోధిస్తుంది. ఎందుకంటే ఒకరి మనస్సులోని ఆలోచనలు వారికి తప్ప మరి ఎవరికి తెలుస్తాయి? అలాగే దేవుని మనస్సులో ఉన్న ఆలోచనలు దేవుని ఆత్మకే గాని మరి ఎవరికి తెలియవు. దేవుడు మనకు అనుగ్రహించిన వాటిని తెలుసుకోడానికి, మనం ఈ లోక ఆత్మను కాకుండా దేవుని నుండి వచ్చిన ఆత్మనే పొందుకున్నాం. మానవ జ్ఞానం మాకు నేర్పే మాటలతో కాకుండా, ఆత్మ నేర్పించిన మాటలతోనే మేము మాట్లాడుతున్నాం, ఆ మాటలతోనే ఆత్మీయ సత్యాలను వివరిస్తున్నాం. అయితే, ఆత్మ లేనివారు దేవుని ఆత్మ నుండి వచ్చిన వాటిని అంగీకరించలేరు, వాటిని కేవలం ఆత్మ ద్వారానే గ్రహించగలం కనుక, అవి వారికి వెర్రితనంగా అనిపిస్తాయి; వారు వాటిని గ్రహించలేరు, ఆత్మను అనుసరించి నడుచుకొనేవారు అన్నిటి గురించి విమర్శిస్తారు, అయితే వారు ఎవరిచేత విమర్శించబడరు. ఎందుకంటే, “ప్రభువు మనస్సును తెలుసుకొని ఆయనకు బోధింపగలవారు ఎవరు?” మనమైతే క్రీస్తు మనస్సును కలిగి ఉన్నాము.

Free Reading Plans and Devotionals related to 1 కొరింథీ 2:1-16