1 కొరింథీయులకు 2:1-16

1 కొరింథీయులకు 2:1-16 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

సహోదరులారా, నేను మీయొద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యముతో గాని జ్ఞానాతిశయముతో గాని దేవుని మర్మమును మీకు ప్రకటించుచు వచ్చినవాడను కాను. నేను, యేసుక్రీస్తును అనగా, సిలువవేయబడిన యేసు క్రీస్తును తప్ప, మరిదేనిని మీమధ్య నెరుగకుందునని నిశ్చయించుకొంటిని. మరియు బలహీనతతోను భయముతోను ఎంతో వణకుతోను మీయొద్ద నుంటిని. మీ విశ్వాసము మనుష్యుల జ్ఞానమును ఆధారము చేసికొనక, దేవుని శక్తిని ఆధారము చేసికొని యుండవలెనని, నేను మాటలాడినను సువార్త ప్రకటించినను, జ్ఞానయుక్తమైన తియ్యని మాటలను వినియోగింపక, పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనుపరచు దృష్టాంతములనే వినియోగించితిని. పరిపూర్ణులైనవారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాము, అది యీ లోక జ్ఞానము కాదు, నిరర్థకులై పోవుచున్న యీ లోకాధికారుల జ్ఞానమును కాదుగాని దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము; ఈ జ్ఞానము మరుగైయుండెను. జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను. అది లోకాధికారులలో ఎవనికిని తెలియదు; అది వారికి తెలిసి యుండినయెడల మహిమాస్వరూపియగు ప్రభువును సిలువ వేయక పోయియుందురు. ఇందునుగూర్చి దేవుడు తన్ను ప్రేమించువారికొరకు ఏవి సిద్ధపర చెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరముకాలేదు అని వ్రాయబడియున్నది. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరచియున్నాడు; ఆ ఆత్మ అన్నిటిని, దేవుని మర్మములను కూడ పరిశోధించుచున్నాడు. ఒక మనుష్యుని సంగతులు అతనిలోనున్న మనుష్యాత్మకే గాని మనుష్యులలో మరి ఎవనికి తెలియును? ఆలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మ కే గాని మరి ఎవనికిని తెలియవు. దేవునివలన మనకు దయచేయబడినవాటిని తెలిసికొనుటకై మనము లౌకికాత్మను కాక దేవుని యొద్దనుండి వచ్చు ఆత్మను పొందియున్నాము. మనుష్యజ్ఞానము నేర్పు మాటలతో గాక ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు, ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చియే మేము బోధించుచున్నాము. ప్రకృతి సంబంధియైన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెఱ్ఱితనముగా ఉన్నవి, అవి ఆత్మానుభవముచేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. ఆత్మసంబంధియైనవాడు అన్నిటిని వివేచించును గాని అతడెవనిచేతనైనను వివేచింప బడడు. ప్రభువు మనస్సును ఎరిగి ఆయనకు బోధింప గలవాడెవడు? మనమైతే క్రీస్తు మనస్సు కలిగినవారము.

1 కొరింథీయులకు 2:1-16 తెలుగు సమకాలీన అనువాదము (TCV)

సహోదరీ సహోదరులారా నేను మీ దగ్గరకు వచ్చినప్పుడు, మాటల నేర్పరితనంతో లేక మానవ తెలివితేటలతో దేవుని మర్మాన్ని మీకు ప్రకటించలేదు. నేను మీతో ఉన్నప్పుడు సిలువ వేయబడిన యేసు క్రీస్తు తప్ప మరి దేని గురించి తెలియచేయకూడదని నిశ్చయించుకున్నాను. నేనైతే బలహీనతలో, అధిక భయంతో వణుకుతో మీ దగ్గరకు వచ్చాను. మీ విశ్వాసం మనుష్యల జ్ఞానం మీద కాకుండా దేవుని శక్తి మీదే ఆధారపడాలని, నా మాటలు నా బోధలు జ్ఞానంతో లేక వాక్చాతుర్యంతో కాకుండా పరిశుద్ధాత్మ శక్తితో నిండి ఉన్నాయి. అయితే పరిపూర్ణులైనవారి మధ్యలో మేము జ్ఞానాన్ని బోధిస్తున్నాం. అది ఈ యుగసంబంధమైన జ్ఞానం కాదు, వ్యర్థమైపోయే ఈ లోక అధికారుల జ్ఞానం కాదు. అయితే, మేము దేవుని జ్ఞానాన్ని ప్రకటిస్తున్నాము, అది, ఈ లోకం ఉనికిలోనికి రాకముందే, దేవుడు రహస్యంగా మన ఘనత కొరకు దాచియుంచిన మర్మం. దీని గురించి ఈ యుగానికి చెందిన లోకాధికారులలో ఎవరికి తెలియలేదు. అది వారికి తెలిసివుంటే వారు మహిమా స్వరూపియైన ప్రభువును సిలువ వేసి ఉండేవారు కారు. అయితే దీని గురించి: “ఏ కంటికి కనబడనివి, ఏ చెవికి వినబడనివి, ఏ మానవ మనస్సు ఊహించలేని వాటిని దేవుడు తనను ప్రేమించేవారి కొరకు సిద్ధపరచారు,” అని వ్రాయబడి ఉంది. ఈ విషయాలను దేవుడు తన ఆత్మ ద్వారా మనకు తెలియజేసారు. ఆత్మ అన్నిటిని, దేవుని లోతైన సంగతులను కూడ పరిశోధిస్తుంది. ఎందుకంటే ఒకరి మనస్సులోని ఆలోచనలు వారికి తప్ప మరి ఎవరికి తెలుస్తాయి? అలాగే దేవుని మనస్సులో ఉన్న ఆలోచనలు దేవుని ఆత్మకే గాని మరి ఎవరికి తెలియవు. దేవుడు మనకు అనుగ్రహించిన వాటిని తెలుసుకోడానికి, మనం ఈ లోక ఆత్మను కాకుండా దేవుని నుండి వచ్చిన ఆత్మనే పొందుకున్నాం. మానవ జ్ఞానం మాకు నేర్పే మాటలతో కాకుండా, ఆత్మ నేర్పించిన మాటలతోనే మేము మాట్లాడుతున్నాం, ఆ మాటలతోనే ఆత్మీయ సత్యాలను వివరిస్తున్నాం. అయితే, ఆత్మ లేనివారు దేవుని ఆత్మ నుండి వచ్చిన వాటిని అంగీకరించలేరు, వాటిని కేవలం ఆత్మ ద్వారానే గ్రహించగలం కనుక, అవి వారికి వెర్రితనంగా అనిపిస్తాయి; వారు వాటిని గ్రహించలేరు, ఆత్మను అనుసరించి నడుచుకొనేవారు అన్నిటి గురించి విమర్శిస్తారు, అయితే వారు ఎవరిచేత విమర్శించబడరు. ఎందుకంటే, “ప్రభువు మనస్సును తెలుసుకొని ఆయనకు బోధింపగలవారు ఎవరు?” మనమైతే క్రీస్తు మనస్సును కలిగి ఉన్నాము.

1 కొరింథీయులకు 2:1-16 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

సోదరీ సోదరులారా, నేను మీ దగ్గరికి వచ్చి దేవుని మర్మం గూర్చి బోధించినప్పుడు మాటకారితనాన్నీ లేక గొప్ప తెలివినీ ఉపయోగించలేదు. మీతో ఉన్న సమయంలో నేను యేసు క్రీస్తును తప్ప, అంటే సిలువను అనుభవించిన యేసు క్రీస్తును తప్ప, మరేదీ తెలియనివాణ్ణయి ఉండాలని తీర్మానించుకున్నాను. బలహీనుడుగా, భయంతో, వణకుతూ మీ దగ్గర గడిపాను. మీ విశ్వాసం మానవ జ్ఞానంపై కాక, దేవుని శక్తిపై ఆధారపడి ఉండాలని నా ఆశ. అందుకే నేను మాట్లాడినా, సువార్త ప్రకటించినా, జ్ఞానంతో నిండిన తియ్యని మాటలు వాడక, పరిశుద్ధాత్మ శక్తినే ప్రదర్శించాను. ఆధ్యాత్మిక పరిణతి గలిగిన వారికి జ్ఞానాన్ని బోధిస్తున్నాం. అది ఈ లోకానికి చెందిన జ్ఞానమూ కాదు, వ్యర్ధమైపోయే ఈ లోకాధికారుల జ్ఞానమూ కాదు. అది దేవుని రహస్య జ్ఞానం. ఈ రహస్య జ్ఞానాన్ని దేవుడు ఈ లోకం ఉనికిలోకి రాక మునుపే మన ఘనత కోసం నియమించాడు. దాని గురించి ఈ యుగానికి చెందిన లోకాధికారుల్లో ఎవరికీ తెలియదు. అది వారికి తెలిసి ఉంటే మహిమాస్వరూపి అయిన ప్రభువును సిలువ వేసేవారు కాదు. దీన్ని గూర్చి ‘దేవుడు తనను ప్రేమించే వారికోసం ఏం సిద్ధపరిచాడో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మానవ హృదయం ఊహకు అందలేదు’ అని రాసి ఉంది. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ ద్వారా వెల్లడి చేశాడు. ఆ ఆత్మ అన్నిటినీ, చివరికి దేవుని లోతైన రహస్యాలను కూడ పరిశోధిస్తాడు. ఒక వ్యక్తి విషయాలు ఆ వ్యక్తిలోని ఆత్మకే తెలుస్తాయి గానీ వేరొక వ్యక్తికెలా తెలుస్తాయి? ఆలాగే దేవుని విషయాలు దేవుని ఆత్మకు తప్ప మరెవరికీ తెలియవు. దేవుడు మనకు ఉచితంగా దయచేసిన వాటిని తెలుసుకోవడం కోసం మనం లౌకికాత్మను కాక దేవుని నుండి వచ్చిన ఆత్మను పొందాము. వాటిని మేము మానవ జ్ఞానం నేర్పగలిగే మాటలతో గాక ఆత్మసంబంధమైన విషయాలను ఆత్మసంబంధమైన వాటితో సరి చూసుకుంటూ, ఆత్మ నేర్పే మాటలతోనే బోధిస్తున్నాం. సహజ సిద్ధమైన మనిషి దేవుని ఆత్మ విషయాలను అంగీకరించడు. ఎందుకంటే అవి అతనికి తెలివితక్కువగా కనిపిస్తాయి. వాటిని ఆధ్యాత్మికంగానే వివేచించగలం. కాబట్టి అతడు వాటిని గ్రహించలేడు. ఆత్మ సంబంధి అన్నిటినీ సరిగా అంచనా వేయగలడు గాని అతణ్ణి ఎవరూ సరిగా అంచనా వేయలేరు. ప్రభువు మనసు గ్రహించి ఆయనకు ఎవరు ఉపదేశించ గలరు? మనకైతే క్రీస్తు మనసు ఉంది.

1 కొరింథీయులకు 2:1-16 పవిత్ర బైబిల్ (TERV)

సోదరులారా! నేను మీ దగ్గరకు వచ్చి దేవుని రహస్యాన్ని ప్రకటించినప్పుడు మాటల చాతుర్యంతో గాని లేక ఉత్కృష్టమైన విజ్ఞానంతో గాని ప్రకటించలేదు ఎందుకంటే నేను మీతో ఉన్నప్పుడు యేసు క్రీస్తునూ, ఆయన సిలువ మరణాన్ని తప్ప మిగతా వాటిని గురించి మరచిపోవాలని నిర్ణయించుకొన్నాను. నేను మీదగ్గరకు వచ్చినప్పుడు నా శక్తిపై నమ్మకం పెట్టుకొని రాలేదు. భయంతో వణుకుతూ వచ్చాను. మిమ్నల్ని సమ్మతింప చెయ్యాలని నేను జ్ఞానంతో నిండిన పదాలుపయోగించి నా సందేశం బోధించలేదు. దేవుని ఆత్మ యిచ్చిన శక్తినుపయోగించి నా సందేశంలో ఉన్న సత్యాన్ని ఋజువు చేసాను. మీ విశ్వాసానికి మానవుల పాండిత్యం కాకుండా దేవుని శక్తి పునాదిగా ఉండాలని నా ఉద్దేశ్యం. కాని ఆత్మీయ పరిపూర్ణత పొందినవాళ్ళకు మేము జ్ఞానంతో నిండిన సందేశం చెపుతాము. ఆ సందేశం ఈ ప్రపంచానికి సంబంధించిన జ్ఞానం కాదు. అది ప్రపంచాన్ని పాలించే పాలకులకు సంబంధించిన జ్ఞానమూ కాదు. చివరికి ఆ పాలకులు లేకుండా పోతారు. నేను చెపుతున్నది దేవుడు చెప్పిన రహస్య జ్ఞానం. “ఇది” ఇంతదాకా మానవులనుండి రహస్యంగా దాచబడిన జ్ఞానం. ఆ జ్ఞానం ద్వారా మనకు మహిమ కలగాలని కాలానికి ముందే దేవుడు నిర్ణయించాడు. ఈనాటి పాలకులు దాన్ని అర్థం చేసుకోలేదు. దాన్ని అర్థం చేసుకొనివుంటే మహిమా స్వరూపి అయిన మన ప్రభువును సిలువకు వేసి చంపేవాళ్ళు కాదు. దీన్ని గురించి ప్రవచనాల్లో ఈ విధంగా వ్రాయబడి ఉంది: “దేవుడు తనను ప్రేమించిన వాళ్ళకోసం సిద్ధంగా ఉంచిన వాటిని ఎవరి కళ్ళూ చూడలేదు. ఎవరి చెవులు వినలేదు. ఎవరూ వాటిని ఊహించలేదు.” కాని దేవుడు ఈ రహస్యాన్ని మనకు తన ఆత్మ ద్వారా తెలియచేసాడు. ఆత్మ అన్నిటినీ పరిశోధిస్తాడు. దేవునిలో దాగి ఉన్నవాటిని కూడా పరిశోధిస్తాడు. మానవునిలో ఉన్న ఆలోచనలు అతనిలో ఉన్న ఆత్మకు తప్ప ఇతరులకు తెలియదు. అదే విధంగా దేవునిలో ఉన్న ఆలోచనలు ఆయన ఆత్మకు తప్ప ఇతరులకు తెలియదు. మనం ఈ ప్రపంచానికి సంబంధించిన ఆత్మను పొందలేదు. దేవుడు పంపిన ఆత్మను మనం పొందాము. తాను ఉచితంగా యిచ్చినవాటిని గురించి మనం తెలుసుకోవాలని ఆయన ఉద్ధేశ్యం. మానవులు తమ జ్ఞానంతో బోధించిన పదాలను వాడకుండా ఆత్మ బోధించిన పదాలను వాడి, ఆత్మీయ సత్యాలను ఆత్మీయ భాషలో చెపుతూ ఉంటాము. తనలో దేవుని ఆత్మ లేని మానవుడు, దేవుని ఆత్మ ఇచ్చే వరాలను అంగీకరించడు. అతనికవి మూర్ఖంగా కనిపిస్తాయి. వాటిని ఆత్మీయంగా మాత్రమే అర్థం చేసుకోగలము కనుక అతడు వాటిని అర్థం చేసుకోలేడు. ఆత్మీయంగా ఉన్నవాడు అందరిపై తీర్పు చెప్పకలడు. కాని అతనిపై ఎవడూ తీర్పు చెప్పలేడు. దీన్ని గురించి ప్రవచనాల్లో ఈ విధంగా వ్రాయబడి ఉంది

1 కొరింథీయులకు 2:1-16 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)

సహోదరీ సహోదరులారా నేను మీ దగ్గరకు వచ్చినప్పుడు వాక్చాతుర్యంతో గాని మానవ తెలివితేటలతో గాని దేవుని మర్మాన్ని మీకు ప్రకటించలేదు. నేను మీతో ఉన్నప్పుడు సిలువవేయబడిన యేసు క్రీస్తు తప్ప మరి దేని గురించి తెలియజేయకూడదని నిర్ణయించుకున్నాను. నేనైతే బలహీనతలో, అధిక భయంతో వణుకుతో మీ దగ్గరకు వచ్చాను. మీ విశ్వాసం మనుష్యల జ్ఞానం మీద కాకుండా దేవుని శక్తి మీదే ఆధారపడాలని, నా మాటలు నా బోధలు జ్ఞానంతో వాక్చాతుర్యంతో కాకుండా పరిశుద్ధాత్మ శక్తితో నిండి ఉన్నాయి. అయితే పరిపూర్ణులైనవారి మధ్యలో మేము జ్ఞానాన్ని బోధిస్తున్నాము. అది ఈ యుగసంబంధమైన జ్ఞానం కాదు, వ్యర్థమైపోయే ఈ లోక అధికారుల జ్ఞానం కాదు. అయితే, మేము దేవుని జ్ఞానాన్ని ప్రకటిస్తున్నాము. అది ఈ లోకం ఉనికిలోనికి రాకముందే, దేవుడు రహస్యంగా మన ఘనత కోసం దాచియుంచిన మర్మం. దీని గురించి ఈ యుగానికి చెందిన లోకాధికారులలో ఎవరికి తెలియలేదు. అది వారికి తెలిసి ఉంటే వారు మహిమా స్వరూపియైన ప్రభువును సిలువ వేసి ఉండేవారు కారు. అయితే దీని గురించి: “ఎవరూ చూడని ఎవరూ వినని ఏ మనుష్యుని మనస్సు ఊహించనివాటిని దేవుడు తనను ప్రేమించేవారి కోసం సిద్ధపరచారు” అని వ్రాయబడి ఉంది. ఈ విషయాలను దేవుడు తన ఆత్మ ద్వారా మనకు తెలియజేశారు. ఆత్మ అన్నిటిని, దేవుని లోతైన సంగతులను కూడ పరిశోధిస్తుంది. ఎందుకంటే ఒకరి మనస్సులోని ఆలోచనలు వారికి తప్ప మరి ఎవరికి తెలుస్తాయి? అలాగే దేవుని మనస్సులో ఉన్న ఆలోచనలు దేవుని ఆత్మకే గాని మరి ఎవరికి తెలియవు. దేవుడు మనకు అనుగ్రహించిన వాటిని తెలుసుకోవడానికి, మనం ఈ లోక ఆత్మను కాకుండా దేవుని నుండి వచ్చిన ఆత్మనే పొందుకున్నాము. మానవ జ్ఞానం మాకు నేర్పే మాటలతో కాకుండా, ఆత్మ నేర్పించిన మాటలతోనే మేము మాట్లాడుతున్నాం, ఆ మాటలతోనే ఆత్మీయ సత్యాలను వివరిస్తున్నాము. అయితే ప్రకృతి సంబంధులైన వారు దేవుని ఆత్మ నుండి వచ్చిన వాటిని అంగీకరించలేరు, వాటిని కేవలం ఆత్మ ద్వారానే గ్రహించగలం కాబట్టి, అవి వారికి వెర్రితనంగా అనిపిస్తాయి; వారు వాటిని గ్రహించలేరు. ఆత్మను అనుసరించి నడుచుకొనేవారు అన్నిటి గురించి వివేచిస్తారు కాని వారు ఎవరిచేత వివేచించబడరు. ఎందుకంటే, “ప్రభువు మనస్సును తెలుసుకున్న వారెవరు? ఆయనకు బోధింప గలవారెవరు?” మనమైతే క్రీస్తు మనస్సును కలిగి ఉన్నాము.