1 రాజులు 14
14
యరొబాముకు వ్యతిరేకంగా అహీయా ప్రవచనం
1ఆ కాలంలో యరొబాము కుమారుడైన అబీయాకు జబ్బుచేసింది. 2యరొబాము తన భార్యతో, “నీవు యరొబాము భార్యవని ఎవ్వరూ గుర్తుపట్టకుండా, మారువేషం వేసుకుని షిలోహుకు వెళ్లు. అక్కడ నేను ఈ ప్రజల మీద రాజునవుతానని నాకు చెప్పిన అహీయా ప్రవక్త ఉంటాడు. 3పది రొట్టెలు, కొన్ని అప్పములు, జాడీలో తేనె తీసుకుని అతని దగ్గరకు వెళ్లు. బాలునికి ఏమి జరుగుతుందో అతడు నీకు చెప్తాడు” అన్నాడు. 4యరొబాము భార్య అతడు చెప్పినట్లు చేసింది. ఆమె షిలోహులో ఉన్న అహీయా ఇంటికి వెళ్లింది.
అహీయాకు వృద్ధాప్యం వలన చూపు పోయింది. 5అయితే యెహోవా అహీయాతో, “యరొబాము కుమారునికి జబ్బుచేసింది కాబట్టి అతని భార్య తన కుమారుని గురించి సంప్రదించడానికి నీ దగ్గరకు వస్తుంది. నీవు ఆమెతో నేను చెప్పే విధంగా జవాబివ్వాలి. ఆమె మారువేషం వేసుకుని మరో స్త్రీలా నటిస్తుంది” అని చెప్పారు.
6కాబట్టి ఆమె గుమ్మం దగ్గరకు వచ్చినప్పుడు, అహీయాకు ఆమె అడుగుల శబ్దం వినిపించి ఆమెతో ఇలా అన్నాడు, “యరొబాము భార్యా, లోపలికి రా. ఎందుకు ఈ నటన? దుర్వార్త నీకు చెప్పడానికి నేను ఆదేశించబడ్డాను. 7నీవు వెళ్లి యరొబాముతో ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇలా చెప్తున్నారని చెప్పు: ‘నేను నిన్ను ప్రజల్లో నుండి లేవనెత్తి నా ప్రజలైన ఇశ్రాయేలు మీద పాలకునిగా నియమించాను. 8దావీదు వంశం నుండి రాజ్యాన్ని తీసివేసి నీకిచ్చాను. అయితే నీవు నా సేవకుడైన దావీదులా ప్రవర్తించలేదు, అతడు నా ఆజ్ఞలను పాటిస్తూ, తన హృదయమంతటితో నన్ను అనుసరిస్తూ, నా దృష్టికి ఏవి సరియైనవో అవే చేశాడు. 9నీవు నీకన్నా ముందు జీవించిన వారందరికంటే ఎక్కువ చెడు చేశావు. నీకోసం ఇతర దేవుళ్ళను, పోతపోసిన విగ్రహాలను చేసుకున్నావు; నాకు కోపం రేపుతూ నన్ను తృణీకరించావు.
10“ ‘దీనిని బట్టి నేను యరొబాము వంశం మీదికి కీడు రప్పించబోతున్నాను. నేను ఇశ్రాయేలులో బానిసలు స్వతంత్రులు అని లేకుండా యరొబాము వంశంలోని మగవారినందరిని నిర్మూలం చేస్తాను. ఒకరు పెంటను కాల్చినట్లు యరొబాము వంశాన్ని పూర్తిగా దహించివేస్తాను. 11యరొబాముకు చెందిన వారిలో పట్టణంలో చనిపోయేవారిని కుక్కలు తింటాయి, పొలంలో చనిపోయేవారిని పక్షులు తింటాయి. ఇది యెహోవా వాక్కు!’
12“నీవైతే ఇంటికి తిరిగి వెళ్లు. నీవు పట్టణంలో అడుగు పెట్టగానే నీ కుమారుడు చనిపోతాడు. 13ఇశ్రాయేలీయులందరు అతని కోసం ఏడ్చి అతన్ని పాతిపెడతారు. యరొబాముకు చెందినవారి ఇంట్లో అతడు మాత్రమే సమాధి చేయబడతాడు, ఎందుకంటే యరొబాము ఇంటివారిలో ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఎవరిలోనైనా మంచిని కనుగొన్నారా అంటే అది కేవలం అతనిలో మాత్రమే.
14“యెహోవా తన కోసం ఇశ్రాయేలు మీద రాజును లేవనెత్తుతారు, అతడు యరొబాము వంశాన్ని నిర్మూలం చేస్తాడు. ఇది ఇప్పటికే మొదలయ్యింది. 15నీటిలో రెల్లు ఊగిసలాడినట్లు యెహోవా ఇశ్రాయేలును అల్లాడిస్తారు. ఆయన ఇశ్రాయేలు పూర్వికులకు ఇచ్చిన ఈ మంచి నేల నుండి వారిని తొలగించి యూఫ్రటీసు నది అవతలికి చెదరగొడతారు, ఎందుకంటే వారు అషేరా స్తంభాలను#14:15 అంటే, అషేరా దేవత యొక్క కర్ర చిహ్నాలు; ఇక్కడ ఇంకా 1 రాజులలో ఇతర చోట్లలో నిలబెట్టి యెహోవాకు కోపం రేపారు. 16యరొబాము చేసిన పాపాలను బట్టి, అతడు ఇశ్రాయేలు ప్రజలచేత చేయించిన పాపాన్ని బట్టి ఆయన ఇశ్రాయేలును వదిలేస్తారు.”
17అప్పుడు యరొబాము భార్య లేచి బయలుదేరి తిర్సాకు వెళ్లింది. ఆమె గడపలో అడుగుపెట్టిన వెంటనే ఆ బాలుడు చనిపోయాడు. 18యెహోవా తన సేవకుడైన అహీయా ప్రవక్త ద్వారా చెప్పినట్లే, వారు అతన్ని సమాధి చేశారు, ఇశ్రాయేలు ప్రజలందరు అతని కోసం దుఃఖించారు.
19యరొబాము పరిపాలనకు సంబంధించిన ఇతర విషయాలు, అతని యుద్ధాలు, అతడు ఎలా పరిపాలించాడనేది ఇశ్రాయేలు రాజుల చరిత్ర గ్రంథంలో వ్రాయబడ్డాయి. 20యరొబాము ఇరవై రెండు సంవత్సరాలు పరిపాలన చేశాడు. అతడు చనిపోయి తన పూర్వికుల దగ్గరకు చేరాడు. అతని తర్వాత అతని కుమారుడు నాదాబు రాజయ్యాడు.
యూదా రాజైన రెహబాము
21సొలొమోను కుమారుడైన రెహబాము యూదాలో రాజుగా ఉన్నాడు. అతడు రాజైనప్పుడు అతని వయస్సు నలభై ఒక సంవత్సరాలు. తన నామం ఉంచడానికి యెహోవా ఇశ్రాయేలు గోత్రాల్లో నుండి ఎన్నుకున్న పట్టణమైన యెరూషలేములో అతడు పదిహేడు సంవత్సరాలు పరిపాలించాడు. రెహబాము తల్లి పేరు నయమా; ఆమె అమ్మోనీయురాలు.
22యూదా వారు యెహోవా దృష్టిలో చెడు చేశారు. వారు తమ ముందున్న వారికన్నా ఎక్కువ పాపాలు చేసి ఆయనకు ఎక్కువ రోషం పుట్టించారు. 23వారు తమ కోసం ప్రతి ఎత్తైన కొండమీద, ప్రతి పచ్చని చెట్టు క్రింద, క్షేత్రాలను, పవిత్ర రాళ్లను, అషేరా స్తంభాలను కూడా నిలిపారు. 24అంతేకాక, దేశంలో ఉన్న క్షేత్రాల్లో మగ వ్యభిచారులు కూడా ఉన్నారు; యెహోవా ఇశ్రాయేలు ప్రజల ఎదుట నుండి వెళ్లగొట్టిన జనాంగాలు చేసిన హేయక్రియలు యూదా వారు చేశారు.
25రాజైన రెహబాము పాలనలో అయిదవ సంవత్సరం, ఈజిప్టు రాజైన షీషకు యెరూషలేము మీద దాడి చేశాడు. 26అతడు యెహోవా మందిరంలోని నిధిని, రాజభవనంలో నిధిని దోచుకున్నాడు. అతడు సమస్తాన్ని, సొలొమోను చేయించిన అన్ని బంగారు డాళ్లతో పాటు తీసుకెళ్లాడు. 27కాబట్టి రాజైన రెహబాము ఆ డాళ్లకు బదులు ఇత్తడి డాళ్ళను చేయించి వాటిని రాజభవనాన్ని కాపలా కాసే రక్షకభటుల అధిపతులకు అప్పగించాడు. 28రాజు యెహోవా ఆలయానికి వచ్చినప్పుడెల్లా భటులు ఆ డాళ్లు మోసుకెళ్లేవారు. తర్వాత వాటిని కాపలా ఉన్న గదిలో ఉంచేవారు.
29రెహబాము పరిపాలన గురించిన ఇతర విషయాలు, అతడు చేసినదంతా యూదా రాజుల చరిత్ర గ్రంథంలో వ్రాయబడలేదా? 30రెహబాముకు యరొబాముకు మధ్య యుద్ధం ఎప్పుడూ జరుగుతూ ఉండేది. 31రెహబాము చనిపోయి తన పూర్వికుల దగ్గరకు చేరాడు, దావీదు పట్టణంలో అతన్ని తన పూర్వికుల దగ్గర సమాధి చేశారు. అతని తల్లి పేరు నయమా; ఆమె అమ్మోనీయురాలు. అతని తర్వాత అతని కుమారుడు అబీయా#14:31 కొ.ప్రా.ప్ర.లలో అబీయాము (2 దిన 12:16) రాజయ్యాడు.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
1 రాజులు 14: TSA
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
Telugu Contemporary Version, Holy Bible
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Used with permission. All rights reserved worldwide.