1 రాజులు 3

3
జ్ఞానం కావాలని అడిగిన సొలొమోను
1సొలొమోను ఈజిప్టు రాజైన ఫరోతో పొత్తు పెట్టుకుని అతని కుమార్తెను పెళ్ళి చేసుకున్నాడు. అతడు తన సొంత రాజభవనాన్ని, యెహోవాకు దేవాలయాన్ని, యెరూషలేము చుట్టూ ప్రాకారం నిర్మించే వరకు ఆమెను దావీదు పట్టణానికి తీసుకువచ్చాడు. 2యెహోవా నామం కోసం అప్పటికి దేవాలయం నిర్మించబడలేదు కాబట్టి ప్రజలు ఇంకా క్షేత్రాల దగ్గర బలులు అర్పించేవారు. 3సొలొమోను తన తండ్రియైన దావీదు హెచ్చరికల ప్రకారం జీవిస్తూ, యెహోవా పట్ల తన ప్రేమను కనుపరిచాడు. అయితే అతడు క్షేత్రాల మీద మాత్రం బలులు అర్పిస్తూ, ధూపం వేసేవాడు.
4కొండల్లో గిబియోను చాలా ప్రాముఖ్యమైన ఉన్నత స్థలం కాబట్టి రాజైన సొలొమోను బలులు అర్పించడానికి అక్కడికి వెళ్లి ఆ బలిపీఠం మీద వెయ్యి దహనబలులు అర్పించాడు. 5గిబియోనులో రాత్రివేళ కలలో యెహోవా సొలొమోనుకు ప్రత్యక్షమై, “నేను నీకు ఏమివ్వాలో అడుగు” అన్నారు.
6సొలొమోను జవాబిస్తూ ఇలా అన్నాడు, “మీ దాసుడు, నా తండ్రియైన దావీదు మీ పట్ల నమ్మకంగా, నీతి నిజాయితీ కలిగి ఉండేవాడు కాబట్టి మీరు అతనిపై ఎంతో దయను చూపించారు. మీరు అదే గొప్ప కనికరాన్ని తన పట్ల కొనసాగిస్తూ, ఈ రోజు అతని సింహాసనం మీద అతనికి కుమారుని కూర్చోబెట్టారు.
7“ఇప్పుడు యెహోవా, నా దేవా! నా తండ్రియైన దావీదుకు బదులుగా మీరు మీ దాసుడనైన నన్ను రాజుగా నియమించారు. అయితే నేను చిన్న బాలున్ని, నా విధులు ఎలా నిర్వర్తించాలో నాకు తెలియదు. 8మీ దాసుడనైన నేను మీరు ఎన్నుకున్న మీ ప్రజలమధ్య ఉన్నాను, వారు గొప్ప ప్రజలు, లెక్కించలేనంత ఎక్కువగా ఉన్నారు. 9కాబట్టి మీ ప్రజలను పాలించడానికి, మంచి చెడ్డల భేదం తెలుసుకోవడానికి వివేచన హృదయం మీ దాసునికి ఇవ్వండి. ఎందుకంటే, మీ గొప్ప ప్రజలైన వీరిని ఎవరు పరిపాలించగలరు?”
10సొలొమోను యొక్క ఈ మనవి ప్రభువుకు నచ్చింది. 11కాబట్టి దేవుడు అతనితో ఇలా అన్నారు, “నీవు నీకోసం దీర్ఘాయువును గాని, ధనాన్ని గాని, నీ శత్రువుల చావును గాని అడగకుండా న్యాయంగా పరిపాలించడానికి వివేచనను అడిగావు కాబట్టి, 12నీవు అడిగింది నేను ఇస్తాను. నేను నీకు జ్ఞానం కలిగిన వివేచన హృదయాన్ని ఇస్తాను. నీలాంటి వారు నీకంటే ముందు ఎవరూ లేరు, నీ తర్వాత ఎవరూ ఉండరు. 13అంతేకాక నీవు అడగని ఐశ్వర్యాన్ని ఘనతను నీకిస్తాను. తద్వారా నీ జీవితకాలమంతా రాజులలో నీకు ఎవరూ సాటి ఉండరు. 14నీ తండ్రియైన దావీదులా నీవు నా మార్గాన్ని అనుసరిస్తూ, నా శాసనాలను, ఆజ్ఞలను పాటిస్తే, నేను నీకు దీర్ఘాయువు ఇస్తాను.” 15తర్వాత సొలొమోను మేల్కొని, అది కల అని గ్రహించాడు.
అతడు యెరూషలేముకు తిరిగివెళ్లి, యెహోవా నిబంధన మందసం ఎదుట నిలబడి, దహనబలులు, సమాధానబలులు అర్పించాడు. తర్వాత తన సేవకులందరికి విందు చేశాడు.
తెలివైన పాలన
16కొంతకాలం తర్వాత ఇద్దరు వేశ్యలు రాజు దగ్గరకు వచ్చి అతని ముందు నిలబడ్డారు. 17వారిలో ఒక స్త్రీ అన్నది, “నా ప్రభువా, దయచేసి వినండి. ఈ స్త్రీ, నేను ఒకే ఇంట్లో ఉంటాము. ఈమె నాతో ఉన్నప్పుడు నేను శిశువును కన్నాను. 18నాకు శిశువు పుట్టిన మూడవ రోజు ఈమెకు కూడ శిశువు పుట్టాడు. మేము ఒంటరిగా ఉన్నాము; మేము తప్ప ఇంట్లో మరొకరు లేరు.
19“రాత్రివేళ ఈమె తన కుమారుని మీదికి దొర్లింది, వాడు చనిపోయాడు. 20కాబట్టి మధ్యరాత్రి ఈమె లేచి, మీ దాసురాలైన నేను పడుకోని ఉన్నప్పుడు, నా ప్రక్కన ఉన్న నా కుమారుని తీసుకుని తన ప్రక్కన పెట్టుకొని, చనిపోయిన తన కుమారుని నా ప్రక్కన పెట్టింది. 21ప్రొద్దున నా కుమారునికి పాలు ఇవ్వడానికి చూస్తే వాడు చనిపోయి ఉన్నాడు! అయితే నేను ఉదయకాలపు వెలుగులో గమనించి చూస్తే, వాడు నేను జన్మనిచ్చిన వాడు కాదు.”
22ఇంకొక స్త్రీ అన్నది, “లేదు! బ్రతికి ఉన్నవాడు నా కుమారుడు; చనిపోయినవాడు నీ వాడు.”
మొదటి స్త్రీ అన్నది, “లేదు! చనిపోయినవాడు నీ వాడు; బ్రతికి ఉన్నవాడు నావాడు.” ఇంకా రాజు ముందు వారు వాదించుకున్నారు.
23రాజు అన్నాడు, “ఈమె అంటుంది, ‘నా కుమారుడు బ్రతికి ఉన్నాడు, నీ కుమారుడు చనిపోయాడు’ ఆమె అంటుంది, ‘లేదు! నీ కుమారుడు చనిపోయాడు, నావాడు బ్రతికి ఉన్నాడు.’ ”
24అప్పుడు రాజు అన్నాడు, “నాకొక ఖడ్గం తీసుకురండి.” కాబట్టి వారు ఖడ్గం రాజు దగ్గరకు తెచ్చారు. 25అప్పుడు రాజు వారికి ఇలా ఆదేశించాడు: “బ్రతికి ఉన్న బిడ్డను రెండు ముక్కలు చేసి, ఈమెకు సగం ఆమెకు సగం ఇవ్వండి.”
26అందుకు బ్రతికి ఉన్న శిశువు యొక్క తల్లి తన కుమారుని పట్ల జాలితో కరిగిపోయి రాజుతో అన్నది, “దయచేసి, నా ప్రభువా, ఆమెకు బ్రతికి ఉన్న శిశువును ఇచ్చేయండి! అతన్ని చంపకండి!”
అయితే ఇంకొక స్త్రీ అన్నది, “అతడు నీకు గాని, నాకు గాని దక్కకూడదు. అతన్ని రెండు ముక్కలు చేయండి!”
27అప్పుడు రాజు తన తీర్పు ఇచ్చాడు: “బ్రతికి ఉన్న శిశువును మొదటి స్త్రీకి ఇవ్వండి. అతన్ని చంపకండి; ఆమె అతని తల్లి.”
28రాజు ఇచ్చిన తీర్పు గురించి ఇశ్రాయేలీయులందరు విన్నప్పుడు, రాజును ఎంతో గౌరవించారు, ఎందుకంటే తీర్పు తీర్చడానికి దేవుని దగ్గరనుండి అతడు జ్ఞానం పొందుకున్నాడని వారు గ్రహించారు.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

1 రాజులు 3: TSA

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి