1 రాజులు 9

9
యెహోవా సొలొమోనుకు ప్రత్యక్షమగుట
1సొలొమోను యెహోవా మందిరాన్ని, రాజభవనాన్ని కట్టించి తాను కోరుకున్నదంతా సాధించిన తర్వాత, 2యెహోవా గిబియోనులో సొలొమోనుకు ప్రత్యక్షమైనట్లు రెండవసారి అతనికి ప్రత్యక్షమయ్యారు. 3యెహోవా అతనితో ఇలా అన్నారు:
“నా సమక్షంలో నీవు చేసిన ప్రార్థన విన్నపం విన్నాను; నీవు కట్టించిన ఈ మందిరంలో నా పేరు ఎప్పటికీ ఉండాలని నేను దీనిని ప్రతిష్ఠించాను. నా కనుదృష్టి, నా హృదయం ఎల్లప్పుడు దీనిపై ఉంటాయి.
4“నీ మట్టుకైతే, నీ తండ్రి దావీదులా నమ్మకంగా యథార్థత నిజాయితీగల హృదయంతో జీవిస్తూ, నేను ఆజ్ఞాపించినదంతా చేసి, నా శాసనాలను నియమాలను పాటిస్తే, 5నీ తండ్రి దావీదుకు, ‘ఇశ్రాయేలు సింహాసనం మీద నీ సంతతివారు ఎప్పటికీ కూర్చుంటారు’ అని వాగ్దానం చేసినట్లు నీ రాజ్యసింహాసనాన్ని ఎల్లకాలం ఇశ్రాయేలు మీద స్థాపిస్తాను.
6“అయితే ఒకవేళ మీరు గాని మీ సంతానం గాని నాకు విరుద్ధంగా తిరిగి, నేను మీకు ఇచ్చిన శాసనాలు, ఆజ్ఞలు పాటించకుండా ఇతర దేవుళ్ళను సేవిస్తూ పూజిస్తే, 7అప్పుడు నేను ఇశ్రాయేలుకు ఇచ్చిన ఈ దేశంలో వారిని లేకుండా చేస్తాను. నా నామం కోసం ప్రతిష్ఠించుకున్న ఈ మందిరాన్ని తిరస్కరిస్తాను. అప్పుడు ఇశ్రాయేలీయులు సర్వజనాంగాల మధ్య ఒక సామెతగా హేళనకు కారణంగా మారతారు. 8ఈ మందిరం శిథిలాల కుప్పగా మారుతుంది. దాటి వెళ్లేవారంతా ఆశ్చర్యపడి, అపహాస్యం చేస్తూ, ‘యెహోవా ఈ దేశానికి, ఈ ఆలయానికి ఇలా ఎందుకు చేశారో?’ అని అడుగుతారు. 9అప్పుడు ప్రజలు, ‘వారు తమ పూర్వికులను ఈజిప్టు దేశం నుండి తీసుకువచ్చిన తమ దేవుడైన యెహోవాను విడిచిపెట్టి వేరే దేవుళ్ళను హత్తుకుని పూజిస్తూ వాటికి సేవ చేశారు, అందుకే యెహోవా వారిపై ఈ విపత్తును తెచ్చారు’ అని జవాబిస్తారు.”
సొలొమోను చేసిన ఇతర పనులు
10సొలొమోను యెహోవా మందిరాన్ని, రాజభవనాన్ని కట్టించడానికి తీసుకున్న ఇరవై సంవత్సరాలు ముగిసిన తర్వాత, 11సొలొమోనుకు కావలసిన అన్ని దేవదారు దూలాలు, సరళవృక్షపు చెట్లు, బంగారం, తూరు రాజైన హీరాము సరఫరాచేశాడు కాబట్టి సొలొమోను గలిలయ ప్రదేశంలోని ఇరవై పట్టణాలను హీరాముకు ఇచ్చాడు. 12సొలొమోను తనకు ఇచ్చిన ఆ పట్టణాలను చూడడానికి హీరాము తూరు నుండి వెళ్లాడు, కాని అవి అతనికి నచ్చలేదు. 13అతడు, “నా సోదరుడా, నీవు నాకిచ్చిన ఈ పట్టణాలు ఎలాంటివి?” అని అడిగాడు. అతడు వాటికి కాబూల్ ప్రాంతం అని పేరు పెట్టాడు, ఈనాటికీ దానికి అదే పేరు. 14హీరాము రాజుకు సుమారు 120 తలాంతుల#9:14 అంటే, సుమారు 4 1/2 టన్నులు బంగారం పంపాడు.
15రాజైన సొలొమోను యెహోవా మందిరాన్ని, తన రాజభవనాన్ని, మేడలను, యెరూషలేము ప్రాకారాన్ని, హాసోరు, మెగిద్దో, గెజెరు పట్టణాలు కట్టడానికి నియమించిన వెట్టి పని చేసిన వారి వివరాలు. 16(ఈజిప్టు రాజైన ఫరో దాడి చేసి గెజెరును పట్టుకుని తగుల బెట్టాడు. ఆ పట్టణంలో నివసించే కనానీయులను చంపి, తన కుమార్తెయైన సొలొమోను భార్యకు పెళ్ళి కానుకగా ఇచ్చాడు. 17సొలొమోను గెజెరును మళ్ళీ కట్టించాడు.) అతడు దిగువ బేత్-హోరోనును, 18బయలతు, తన దేశంలోని ఎడారిలో ఉన్న తద్మోరును,#9:18 హెబ్రీలో తద్మోరు 19తన ధాన్యాగారాలను, తన రథాలకు గుర్రాలకు పట్టణాలను, యెరూషలేములో లెబానోనులో తాను పరిపాలించే ప్రదేశమంతటిలో తాను కట్టించాలనుకున్న వాటన్నిటిని సొలొమోను కట్టించాడు.
20అమోరీయులు, హిత్తీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, యెబూసీయులు (ఈ ప్రజలు ఇశ్రాయేలీయులు కాదు) ఇంకా అక్కడ మిగిలి ఉన్నారు. 21ఇశ్రాయేలీయులు నాశనం చేయకుండ వదిలిన ఈ ప్రజలందరి వారసులను సొలొమోను బానిసలుగా పని చేయడానికి నిర్బంధించాడు. నేటికీ వారు అలాగే ఉన్నారు. 22అయితే సొలొమోను ఇశ్రాయేలు ప్రజల్లో ఎవరిని బానిసలుగా చేయలేదు; వారు అతని సైనికులు, ప్రభుత్వ అధికారులు, అధికారులు, దళాధిపతులు, రథాలకు, రథసారధులకు అధిపతులు. 23అంతేకాక, సొలొమోను చేయించే పనిమీద 550 మంది ముఖ్య అధికారులు కూడా ఉన్నారు, వారు పనివారి మీది అధికారులు.
24ఫరో కుమార్తె దావీదు పట్టణం నుండి సొలొమోను తన కోసం కట్టించిన భవనానికి వచ్చిన తర్వాత సొలొమోను మేడలను కట్టించాడు.
25సొలొమోను తాను యెహోవాకు కట్టించిన బలిపీఠం మీద సంవత్సరానికి మూడుసార్లు దహనబలులు, సమాధానబలులు అర్పిస్తూ, వాటితో యెహోవా సముఖంలో ధూపం వేస్తూ మందిర నియమాలను నెరవేర్చాడు.
26రాజైన సొలొమోను ఎదోములోని ఎర్ర సముద్రతీరాన ఏలతు దగ్గర ఉన్న ఎసోన్-గెబెరు దగ్గర ఓడలను కూడా కట్టించాడు. 27హీరాము సముద్రం గురించి తెలిసిన తన నావికులను సొలొమోను మనుష్యులతో పాటు పని చేయడానికి పంపించాడు. 28వారు ఓఫీరుకు ప్రయాణం చేసి వెళ్లి 420 తలాంతుల#9:28 అంటే, సుమారు 16 టన్నులు బంగారాన్ని తెచ్చి రాజైన సొలొమోనుకు అందజేశారు.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

1 రాజులు 9: TSA

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి