1 సమూయేలు 10

10
1అప్పుడు సమూయేలు ఒలీవనూనె బుడ్డి తీసుకుని సౌలు తలమీద పోసి అతన్ని ముద్దు పెట్టుకొని ఇలా అన్నాడు, “యెహోవా తన వారసత్వమైన ప్రజల మీద పాలకునిగా నిన్ను అభిషేకించారు. 2ఈ రోజు నీవు నా దగ్గరి నుండి వెళ్లిన తర్వాత, బెన్యామీను సరిహద్దులో సెల్సహులో ఉన్న రాహేలు సమాధి దగ్గర ఇద్దరు వ్యక్తులు నీకు కనబడతారు. వారు నీతో, ‘నీవు వెదకుతున్న గాడిదలు దొరికాయి. నీ తండ్రి వాటి గురించి ఆలోచించడం మాని నీకోసం కంగారు పడుతూ, “నా కుమారుని గురించి నేనేమి చేయాలి?” అని అడుగుతున్నాడు’ అని చెప్తారు.
3“తర్వాత నీవు అక్కడినుండి తాబోరు సింధూర వృక్షం వరకు వెళ్తావు. అక్కడ బేతేలులో దేవుని ఆరాధించడానికి వెళ్తున్న ముగ్గురు మనుష్యులు నీకు ఎదురవుతారు. వారిలో ఒకడు మూడు మేక పిల్లలను, మరొకడు మూడు రొట్టెలను, ఇంకొకడు ఒక్క ద్రాక్షరసపు తిత్తిని మోస్తుంటారు. 4వారు నీ క్షేమసమాచారాన్ని తెలుసుకుని రెండు రొట్టెలు ఇస్తారు, నీవు వాటిని తీసుకోవాలి.
5“ఆ తర్వాత నీవు దేవుని గిబియాకు వెళ్తావు, అక్కడ ఫిలిష్తీయుల సైనిక స్థావరం ఉంది. నీవు పట్టణం దగ్గరకు చేరుకుంటుండగా, వీణలు, కంజరలు, పిల్లనగ్రోవులు, సితారాలు వాయిస్తున్నవారి వెనుక, ఉన్నత స్థలం నుండి దిగి వస్తున్న ప్రవక్తల ఊరేగింపు నీకు కనబడుతుంది. వారు ప్రవచిస్తూ వస్తారు. 6యెహోవా ఆత్మ నీ మీదికి బలంగా దిగి వచ్చినప్పడు, నీవు కూడా వారితో కలిసి ప్రవచిస్తావు; నీవు క్రొత్త వ్యక్తిగా మారతావు. 7ఈ సూచనలు నెరవేరిన తర్వాత నీకు ఏది మంచిదనిపిస్తే అది చేయి, దేవుడు నీకు తోడుగా ఉంటారు.
8“నాకంటే ముందు నీవు గిల్గాలుకు వెళ్లు. దహనబలులు సమాధానబలులు అర్పించడానికి నేను తప్పక నీ దగ్గరకు వస్తాను. అయితే నేను వచ్చి నీవు ఏం చేయాలో నీకు చెప్పే వరకు, నీవు ఏడు రోజులు అక్కడే వేచి ఉండాలి.”
రాజుగా నియమించబడిన సౌలు
9సౌలు సమూయేలు దగ్గరి నుండి వెళ్లడానికి వెనుకకు తిరగ్గానే దేవుడు సౌలు హృదయాన్ని మార్చారు, ఆ రోజే ఈ సూచనలన్నీ నెరవేరాయి. 10అతడు, అతని సేవకుడు గిబియా దగ్గరకు చేరుకున్నప్పుడు, ప్రవక్తల ఊరేగింపు అతనికి ఎదురైంది; దేవుని ఆత్మ బలంగా అతని మీదికి వచ్చి, అతడు వారితో కలిసి ప్రవచించాడు. 11గతంలో అతన్ని తెలిసిన వారందరు అతడు ప్రవక్తలతో కలిసి ప్రవచించడం చూసి, “కీషు కుమారునికి ఏమైంది? సౌలు కూడా ప్రవక్తల్లో ఒకడా?” అని ఒకరితో ఒకరు అనుకున్నారు.
12అక్కడ నివసించే ఒక వ్యక్తి, “వారి నాయకుడు ఎవరు?” అన్నాడు. అందువల్ల, “సౌలు కూడా ప్రవక్తల్లో ఒకడా?” అనే సామెత పుట్టింది. 13సౌలు ప్రవచించడం ఆపిన తర్వాత అతడు ఉన్నత స్థలానికి వెళ్లాడు.
14సౌలు చిన్నాన్న అతన్ని అతని సేవకుడిని చూసి, “మీరు ఎక్కడికి వెళ్లారు?” అని అడిగాడు.
అందుకతడు, “గాడిదలను వెదకడానికి వెళ్లాం, అవి కనబడలేదని సమూయేలు ప్రవక్త దగ్గరకు వెళ్లాం” అని చెప్పాడు.
15అందుకు సౌలు చిన్నాన్న, “సమూయేలు నీతో ఏమి చెప్పాడో నాతో చెప్పు” అని అన్నాడు.
16సౌలు, “గాడిదలు దొరికాయని అతడు మాకు హామీ ఇచ్చాడు” అని తన చిన్నాన్నకు చెప్పాడు. అయితే రాజ్యాధికారం గురించి సమూయేలు చెప్పిన విషయాన్ని అతడు తన మామకు చెప్పలేదు.
17తర్వాత సమూయేలు మిస్పాలో యెహోవా దగ్గరకు ఇశ్రాయేలు ప్రజలను పిలిపించి, 18వారితో ఇలా చెప్పాడు, “ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా తెలియజేసింది ఇదే: ‘నేను ఇశ్రాయేలీయులైన మిమ్మల్ని ఈజిప్టు నుండి బయటకు తీసుకువచ్చి ఈజిప్టువారి అధికారం నుండి, మిమ్మల్ని బాధపెట్టిన అన్ని దేశాల నుండి విడిపించాను.’ 19అయితే మీ కష్టాలన్నిటి నుండి ఆపదలన్నిటి నుండి మిమ్మల్ని రక్షించిన మీ దేవుడిని మీరు ఇప్పుడు తిరస్కరించారు. ‘మామీద రాజుగా ఒకరిని నియమించు’ అని ఆయనను అడిగారు. కాబట్టి ఇప్పుడు మీ గోత్రాలు మీ కుటుంబాల ప్రకారం మీరు యెహోవా సన్నిధికి రావాలి.”
20సమూయేలు ఇశ్రాయేలీయుల గోత్రాలన్నిటిని సమకూర్చినప్పుడు చీటిలో బెన్యామీను గోత్రం ఎంపిక చేయబడింది. 21బెన్యామీను గోత్రం వారిని వారి కుటుంబాల ప్రకారం సమకూర్చినప్పుడు చీటిలో మత్రీ కుటుంబం ఎంపిక చేయబడింది. తర్వాత కీషు కుమారుడైన సౌలు ఎంపిక చేయబడ్డాడు. అయితే వారు అతని కోసం వెదికినప్పుడు అతడు కనబడలేదు. 22కాబట్టి వారు, “అతడు ఇక్కడ ఉన్నాడా?” అని యెహోవా దగ్గర విచారణ చేశారు.
అందుకు యెహోవా, “అవును, అతడు సామాన్లలో దాక్కున్నాడు” అని చెప్పారు.
23వారు పరుగెత్తుకు వెళ్లి అతన్ని బయటకు తీసుకువచ్చారు; అతడు ప్రజల మధ్యలో నిలబడినప్పుడు అతని తల భుజాలు అందరికంటే ఎత్తుగా ఉన్నాయి. 24అప్పుడు సమూయేలు ప్రజలందరితో, “యెహోవా ఏర్పరచిన వానిని మీరు చూశారా? ఇశ్రాయేలీయులందరిలో అతనివంటివాడు మరొకడు లేడు” అని చెప్పాడు.
అప్పుడు ప్రజలు, “రాజు దీర్ఘకాలం జీవించు గాక” అని కేకలు వేశారు.
25తర్వాత సమూయేలు రాజ్యపాలన హక్కులను పద్ధతిని ప్రజలకు వివరించి, వాటిని ఒక గ్రంథంలో వ్రాసి యెహోవా సన్నిధిలో ఉంచాడు. తర్వాత సమూయేలు ప్రజలందరినీ వారి వారి ఇళ్ళకు పంపివేశాడు.
26సౌలు కూడా గిబియాలో ఉన్న తన ఇంటికి వెళ్లిపోయాడు. దేవుని చేత హృదయంలో ప్రేరేపణ పొందిన వీరులు అతని వెంట వెళ్లారు. 27అయితే పనికిమాలినవారు కొందరు, “ఈ వ్యక్తి మనలను ఎలా రక్షించగలడు?” అని అంటూ అతన్ని తృణీకరించి అతనికి కానుకలు తీసుకురాలేదు. అయినా సౌలు మౌనంగా ఉన్నాడు.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

1 సమూయేలు 10: TSA

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి