9
సమూయేలు సౌలును అభిషేకించుట
1ధనవంతుడై, పలుకుబడి కలిగిన ఒక బెన్యామీనీయుడు ఉండేవాడు. అతని పేరు కీషు, అతడు అబీయేలు కుమారుడు. అబీయేలు సెరోరు కుమారుడు, సెరోరు బెకోరతు కుమారుడు, బెకోరతు అఫియా కుమారుడు. 2కీషుకు సౌలు అనే ఒక కుమారుడు ఉన్నాడు. అతడు చాలా అందంగా ఉంటాడు. ఇశ్రాయేలీయులలో అతనిలాంటి అందమైన యువకులు లేరు, అతడు భుజాలు పైనుండి ఇతరులకంటే ఎత్తుగా ఉంటాడు.
3ఒక రోజు సౌలు తండ్రియైన కీషు యొక్క గాడిదలు తప్పిపోయినప్పుడు, కీషు సౌలును పిలిచి, “మన సేవకులలో ఒకరిని తీసుకెళ్లి గాడిదలను వెదకు” అని చెప్పాడు. 4అతడు వెళ్లి ఎఫ్రాయిం కొండ ప్రాంతమంతా తిరిగి షాలిషా దేశమంతా వెదికాడు కాని అవి కనబడలేదు. తర్వాత వారు షయలీము దేశం దాటి వెదికినా ఆ గాడిదలు దొరకలేదు. బెన్యామీనీయుల ప్రాంతంలో తిరిగి చూశారు కాని అవి దొరకలేదు.
5వారు సూఫు ప్రాంతానికి వచ్చినప్పుడు, “మనం వెనుకకు వెళ్దాం, లేకపోతే నా తండ్రి గాడిదల గురించి ఆలోచించడం మాని మన కోసం కంగారుపడతాడు” అని సౌలు తనతో వచ్చిన సేవకునితో అన్నాడు.
6అందుకు ఆ సేవకుడు, “చూడండి, ఈ పట్టణంలో ఒక దైవజనుడున్నాడు. అతడు ఎంతో గొప్పవాడు, అతడు చెప్పిన ప్రతి మాట నెరవేరుతుంది. మనం అక్కడికి వెళ్దాము. మనం ఎక్కడికి వెళ్లాలో బహుశ అతడు మనకు చెప్పవచ్చు” అన్నాడు.
7అందుకు సౌలు, “ఒకవేళ మనం అతని దగ్గరకు వెళ్తే అతనికి మనం ఏమివ్వగలం? మన సంచుల్లో ఉన్న ఆహారమంతా అయిపోయింది. ఆ దైవజనునికి కానుకగా ఇవ్వడానికి మన దగ్గర ఏమీ లేవు. మరెలా?” అని సేవకుడిని అడిగాడు.
8ఆ సేవకుడు మళ్ళీ సౌలుతో, “చూడండి, నా దగ్గర పావు షెకెల్#9:8 అంటే సుమారు 3 గ్రాములు వెండి ఉంది. మనం వెళ్లవలసిన దారిని మనకు చెప్పడానికి దాన్ని ఆ దైవజనునికి ఇస్తాను” అన్నాడు. 9(గతంలో ఇశ్రాయేలీయులలో ఎవరైనా దేవుని దగ్గర ఏదైనా విషయం తెలుసుకోవాలనుకుంటే వారు, “మనం దీర్ఘదర్శి దగ్గరకు వెళ్దాం రండి” అని అనేవారు. ఇప్పుడు ప్రవక్తలని పిలిచేవారిని, ఒకప్పుడు దీర్ఘదర్శి అని పిలిచేవారు.)
10సౌలు తన సేవకునితో, “సరే, పద వెళ్దాం” అన్నాడు. వారు బయలుదేరి దైవజనుడున్న పట్టణానికి వెళ్లారు.
11వారు కొండ ఎక్కి ఆ పట్టణానికి వెళ్తుండగా, నీళ్లు తోడుకోడానికి వస్తున్న యువతులు ఎదురయ్యారు, అప్పుడు వారు, “ఇక్కడ దీర్ఘదర్శి ఉన్నాడా?” అని వారిని అడిగారు.
12అందుకు వారు, “అతడు మీకు దగ్గరలోనే ఉన్నాడు. త్వరగా వెళ్లి కలవండి; ఎందుకంటే ఈ రోజు క్షేత్రంలో ప్రజల కోసం బలి అర్పించబడుతుంది, అందుకు ఈ రోజే మా ఊరికి వచ్చాడు. 13అతడు భోజనం చేయడానికి ఉన్నత స్థలానికి వెళ్లకముందే మీరు పట్టణంలోకి వెళ్లండి. అతడు వచ్చేవరకు ప్రజలు తినరు. అతడు బలిని దీవించిన తర్వాత ఆహ్వానించబడిన వారు తింటారు. మీరు ఇప్పుడే పైకి వెళ్లండి; ఈపాటికి మీరు అతన్ని కలుసుకోవల్సింది” అన్నారు.
14అప్పుడు వారు ఆ పట్టణం వరకు వెళ్లారు. వారు పట్టణంలోనికి వెళ్లబోతుండగా ఉన్నత స్థలానికి వెళ్తున్న సమూయేలు వారికి ఎదురు వచ్చాడు.
15సౌలు రావడానికి ఒక రోజు ముందే యెహోవా సమూయేలుకు, 16“రేపు ఈ సమయానికి బెన్యామీను ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తిని నీ దగ్గరకు పంపిస్తాను. అతన్ని నా ప్రజలైన ఇశ్రాయేలీయుల మీద పాలకునిగా అభిషేకించు; నా ప్రజల మొర నాకు విని వారివైపు చూశాను. అతడే వారిని ఫిలిష్తీయుల చేతిలో నుండి విడిపిస్తాడు” అని చెప్పారు.
17సౌలు సమూయేలుకు కనబడగానే యెహోవా అతనితో, “ఇతడే నేను నీతో చెప్పిన వ్యక్తి; ఇతడే నా ప్రజలను పరిపాలిస్తాడు” అని చెప్పారు.
18సౌలు గుమ్మం దగ్గర సమూయేలును కలుసుకొని, “దీర్ఘదర్శి ఇల్లు ఎక్కడో దయచేసి నాకు చెప్పరా?” అని అడిగాడు.
19అందుకు సమూయేలు సౌలుతో, “నేనే దీర్ఘదర్శిని, ఉన్నత స్థలానికి నా కంటే ముందు వెళ్లండి, ఈ రోజు మీరు నాతో భోజనం చేయాలి. ఉదయాన నీ హృదయంలో ఉన్నదంతా నీకు చెప్పి నిన్ను పంపిస్తాను. 20మూడు రోజుల క్రితం తప్పిపోయిన నీ గాడిదల గురించి బాధపడకు, అవి దొరికాయి. ఇశ్రాయేలీయులు కోరుకుంటుంది నిన్ను నీ కుటుంబమంతటిని గాక, ఇంకెవరిని?” అన్నాడు.
21అందుకు సౌలు, “నేను బెన్యామీనీయుడను కానా? నా గోత్రం ఇశ్రాయేలీయుల్లోని చిన్న గోత్రం కాదా? నా ఇంటివారు బెన్యామీను గోత్రపు వంశాలన్నిటిలో నా వంశం చిన్నది కాదా? నాతో ఇలా ఎందుకు అంటున్నారు?” అన్నాడు.
22అప్పుడు సమూయేలు సౌలును అతని సేవకుడిని భోజనశాలలోనికి తీసుకెళ్లి, ప్రత్యేకంగా పిలువబడ్డ సుమారు ముప్పైమంది ఉన్న ప్రధాన స్థలంలో వారిని కూర్చోబెట్టాడు. 23సమూయేలు వంటమనిషితో, “నేను నీ దగ్గర ఉంచమని చెప్పి నీ చేతికి ఇచ్చిన మాంసపు భాగాన్ని తీసుకురా” అని చెప్పాడు.
24వంటమనిషి మాంసంతో ఉన్న తొడను తెచ్చి సౌలు ముందు పెట్టాడు. అప్పుడు సమూయేలు సౌలుతో, “ఇదిగో నీకోసం దాచిపెట్టింది, ఇది తిను ఎందుకంటే ‘నేను అతిథులను ఆహ్వానించాను’ అని వంటమనిషితో చెప్పి దీన్ని నీ కోసం తీసి ఉంచమన్నాను” అన్నాడు. ఆ రోజు సౌలు సమూయేలుతో కలిసి భోజనం చేశాడు.
25వారు ఉన్నత స్థలం నుండి పట్టణంలోకి దిగి వచ్చినప్పుడు సమూయేలు తన ఇంటిపైన సౌలుతో మాట్లాడాడు. 26తర్వాతి రోజు ఉదయమే వారు లేచిన తర్వాత సమూయేలు సౌలును పిలిచి, “నేను నీ దారిన నిన్ను పంపిస్తాను, సిద్ధపడు” అని చెప్పాడు. సౌలు సిద్ధమవగానే, అతడు సమూయేలు కలిసి బయలుదేరారు. 27వారు పట్టణ శివారుకు వెళ్తుండగా సమూయేలు సౌలుతో, “దాసుని మనకంటే ముందు వెళ్లమను” అని చెప్పగానే ఆ దాసుడు వెళ్లిపోయాడు. అప్పుడతడు సౌలుతో, “నీవిక్కడే ఉండు, దేవుడు నీతో చెప్పమని నాకు చెప్పింది నీకు చెప్తాను” అన్నాడు.