8
రాజు కావాలని అడిగిన ఇశ్రాయేలీయులు
1సమూయేలు ముసలివాడైనప్పుడు తన కుమారులను ఇశ్రాయేలీయుల మీద న్యాయాధిపతులుగా నియమించాడు. 2అతని మొదటి కుమారుని పేరు యోవేలు, రెండవ వాని పేరు అబీయా; వారు బెయేర్షేబలో న్యాయాధిపతులుగా ఉన్నారు. 3అయితే అతని కుమారులు అతని మార్గాన్ని అనుసరించలేదు. వారు అక్రమ సంపాదన కోసం లంచాలు తీసుకుని న్యాయాన్ని తారుమరు చేసేవారు.
4కాబట్టి ఇశ్రాయేలీయుల పెద్దలందరు ఒక్కటిగా కలిసి రామాలో ఉన్న సమూయేలు దగ్గరకు వచ్చారు. 5వారతనితో, “నీవు ముసలివాడవు, నీ కుమారులు నీ మార్గాన్ని అనుసరించుట లేదు; కాబట్టి ఇతర దేశాలకు రాజు ఉన్నట్లే మాకు న్యాయం చేయడానికి ఒక రాజును నియమించు” అని అడిగారు.
6అయితే వారు, “మమ్మల్ని నడిపించడానికి మాకు ఒక రాజు కావాలి” అని అడగడం సమూయేలుకు నచ్చలేదు; కాబట్టి అతడు యెహోవాకు ప్రార్థన చేశాడు. 7అందుకు యెహోవా సమూయేలుతో, “ప్రజలు నీతో చెప్పేదంతా విను; వారు తిరస్కరించింది నిన్ను కాదు, వారికి రాజుగా ఉండకుండా నన్ను తిరస్కరించారు. 8వారు నన్ను విడిచిపెట్టి ఇతర దేవతలను సేవిస్తూ, ఈజిప్టులో నుండి నేను వారిని బయటకు రప్పించిన రోజు నుండి ఇప్పటివరకు అలాగే చేశారు. నీ పట్ల కూడా అలాగే చేస్తున్నారు. 9వారు చెప్పేది విను; అయితే వారిని పరిపాలించబోయే రాజు హక్కులు ఎలాంటివో వారికి స్పష్టంగా వివరించి హెచ్చరించు” అని చెప్పారు.
10తమకు రాజు కావాలని అడిగిన ప్రజలందరికి సమూయేలు యెహోవా మాటలన్నిటిని చెప్పాడు. 11అతడు వారితో, “మిమ్మల్ని పరిపాలించబోయే రాజు హక్కులు ఇవే: అతడు మీ కుమారులను తీసుకెళ్లి తన రథాలను గుర్రాలను చూసుకోవడానికి వారిని నియమిస్తాడు. వారు అతని రథాల ముందు పరుగెత్తుతారు. 12కొందరిని తన సైన్యంలో వేయిమందిపై సహస్రాధిపతులుగా, యాభైమందిపై పంచదశాధిపతులుగా నియమిస్తాడు. మరికొందరిని తన భూమిని దున్నడానికి, తన పంటలు కోయడానికి, యుద్ధానికి ఆయుధాలను, తన రథాలకు పరికరాలను తయారుచేయడానికి నియమిస్తాడు. 13మీ ఆడపిల్లలను పరిమళద్రవ్యాలు తయారుచేయడానికి వంటచేయడానికి రొట్టెలు కాల్చడానికి నియమిస్తాడు. 14అతడు మీ ద్రాక్షతోటల నుండి ఒలీవతోటల నుండి శ్రేష్ఠమైన వాటిని తీసుకుని తన సహాయకులకు ఇస్తాడు. 15మీ ధాన్యంలో ద్రాక్షపండ్లలో పదవ భాగాన్ని తీసుకుని తన అధికారులకు సహాయకులకు ఇస్తాడు. 16మీ సేవకులను సేవకురాళ్లను మీ పశువుల్లో గాడిదలలో శ్రేష్ఠమైన వాటిని తన కోసం వాడుకుంటాడు. 17మీ గొర్రెల మందలలో పదవ భాగాన్ని తీసుకుంటాడు, అంతేకాదు స్వయంగా మీరే అతనికి బానిసలవుతారు. 18అలాంటి రోజు వచ్చినప్పుడు, మీరు కావాలని కోరుకున్న రాజు నుండి విడిపించమని మీరే మొరపెడతారు. కాని ఆ రోజు యెహోవా మీకు జవాబివ్వరు” అని వివరించాడు.
19అయితే ప్రజలు సమూయేలు మాటలు పట్టించుకోకుండా, “అలా ఏం కాదు! మాకు రాజు కావల్సిందే. 20ఇతర దేశాలకు ఉన్నట్లే మాకు రాజు ఉండాలి, అతడు మాకు న్యాయం చేస్తూ మాకు ముందు నడుస్తూ మా యుద్ధాలన్నిటిలో పోరాడతాడు” అన్నారు.
21సమూయేలు ప్రజలు చెప్పిన మాటలన్నిటిని విని వాటిని యెహోవాకు వినిపించాడు. 22అప్పుడు యెహోవా, “నీవు వారి మాటలు విని వారికి ఒక రాజును నియమించు” అన్నారు.
అప్పుడు సమూయేలు ఇశ్రాయేలీయులతో, “మీరందరూ మీ సొంత పట్టణాలకు వెళ్లండి” అని చెప్పాడు.