1 సమూయేలు 11
11
యాబేషు పట్టణాన్ని విడిపించిన సౌలు
1అమ్మోనీయుడైన నాహాషు బయలుదేరి యాబేష్-గిలాదును ముట్టడించినప్పుడు యాబేషు వారందరు అతనితో, “మాతో ఒప్పందం చేసుకో, మేము నీకు సేవకులమై ఉంటాము” అన్నారు.
2అయితే, “ఇశ్రాయేలీయులందరికి అవమానం కలిగేలా మీ అందరి కుడి కళ్లు పెరికివేస్తాననే ఒకే ఒక షరతు మీద మీతో ఒప్పందం చేసుకుంటాను” అని అమ్మోనీయుడైన నాహాషు జవాబిచ్చాడు.
3అందుకు యాబేషు పెద్దలు అతనితో, “మేము ఇశ్రాయేలు అంతటా రాయబారులను పంపడానికి మాకు ఏడు రోజుల సమయం ఇవ్వు; మమ్మల్ని రక్షించడానికి ఎవరూ రాకపోతే మేము నీకు లొంగిపోతాము” అన్నారు.
4రాయబారులు సౌలు ఉంటున్న గిబియాకు వచ్చి ఆ షరతు గురించి ప్రజలకు తెలియజేసినప్పుడు వారందరు గట్టిగా ఏడ్చారు. 5సౌలు పొలం నుండి పశువులను తోలుకొని వస్తూ, “ప్రజలందరికి ఏం జరిగింది ఎందుకలా ఏడుస్తున్నారు?” అని అడిగినప్పుడు, వారు యాబేషు నుండి వచ్చిన వ్యక్తి తెచ్చిన వార్తను అతనికి చెప్పారు.
6సౌలు ఆ వార్త వినగానే దేవుని ఆత్మ అతని మీదికి బలంగా వచ్చింది. అతడు కోపంతో మండిపడ్డాడు. 7ఒక జత ఎడ్లను తీసుకుని వాటిని ముక్కలుగా చేసి ఇశ్రాయేలు దేశమంతటికి రాయబారులచేత వాటిని పంపి, “సౌలుతోను సమూయేలుతోను చేరకుండ ఉండే ప్రతిఒక్కరి ఎడ్లు ఇలాగే చేయబడతాయి” అని ప్రకటించాడు. అప్పుడు ప్రజలందరిలో యెహోవా భయం కలిగింది కాబట్టి అందరు ఒక్కటిగా కలసివచ్చారు. 8సౌలు బెజెకులో వారిని లెక్కపెట్టినప్పుడు మూడు లక్షలమంది ఇశ్రాయేలీయులు, ముప్పైవేలమంది యూదా వారు ఉన్నారు.
9అప్పుడు వారు, “రేపు సూర్యుడు వేడెక్కే సమయానికి మీరు రక్షించబడతారు” అని వచ్చిన రాయబారులతో చెప్పారు. ఆ రాయబారులు వెళ్లి యాబేషు గిలాదు వారికి ఈ వార్త తెలియజేసినప్పుడు వారు సంతోషించారు. 10కాబట్టి యాబేషు వారు అమ్మోనీయులతో, “రేపు మేము నీకు లొంగిపోతాము, నీవు ఏమి చేయాలనుకుంటున్నావో అది మాకు చేయవచ్చు” అన్నారు.
11తర్వాత రోజు సౌలు తన ప్రజలను మూడు గుంపులుగా చేసిన తర్వాత వారు తెల్లవారే సమయాన అమ్మోనీయుల శిబిరంలోనికి చొచ్చుకొని వెళ్లారు. ఆ రోజు సూర్యుడు వేడెక్కే సమయానికి వారందరిని హతం చేశాడు. ప్రాణాలతో బయటపడిన వారు చెల్లాచెదురుగా ఉన్నారు, తద్వారా వారిలో ఇద్దరు కలిసి మిగిలిపోలేదు.
సౌలును రాజుగా ధృవీకరించుట
12అప్పుడు ప్రజలు సమూయేలుతో, “సౌలు మనలను పరిపాలిస్తాడా అని అడిగిన వారేరి? మేము వారిని చంపడానికి వారిని తీసుకురండి” అన్నారు.
13అయితే సౌలు, “ఈ రోజు యెహోవా ఇశ్రాయేలీయులను రక్షించారు కాబట్టి ఈ రోజు ఎవరిని చంపవద్దు” అన్నాడు.
14అప్పుడు సమూయేలు ప్రజలతో, “మనం గిల్గాలుకు వెళ్లి రాజ్య పరిపాలన పద్ధతిని మరలా ఏర్పరచుకుందాము” అన్నాడు. 15కాబట్టి ప్రజలందరు గిల్గాలుకు వచ్చి యెహోవా సన్నిధిలో సౌలును రాజుగా చేసి అక్కడ యెహోవా ఎదుట వారు సమాధానబలులు అర్పించారు. సౌలు ఇశ్రాయేలీయులందరు ఎంతో సంతోషించారు.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
1 సమూయేలు 11: TSA
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
Telugu Contemporary Version, Holy Bible
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Used with permission. All rights reserved worldwide.