5
అష్డోదు, ఎక్రోనులో మందసం
1ఫిలిష్తీయులు దేవుని మందసాన్ని స్వాధీనం చేసుకున్న తర్వాత వారు దానిని ఎబెనెజెరు నుండి అష్డోదుకు తీసుకువచ్చారు. 2వారు దేవుని మందసాన్ని దాగోను గుడిలోనికి తీసుకువచ్చి దానిని దాగోను ప్రక్కన ఉంచారు. 3అయితే మరుసటిరోజు ప్రొద్దుటే అష్డోదు ప్రజలు లేచి చూడగా, యెహోవా మందసం ఎదుట దాగోను నేలపై బోర్లా పడి ఉంది. కాబట్టి వారు దాగోనును లేపి తిరిగి దాని స్థానంలో నిలబెట్టారు. 4ఆ మరుసటి ఉదయం అష్డోదు ప్రజలు లేచి చూడగా దాగోను యెహోవా మందసం ఎదుట నేలపై బోర్లా పడి ఉంది. దాగోను తల రెండు చేతులు నరికివేయబడి గుమ్మం దగ్గర పడి ఉన్నాయి. దాని మొండెం మాత్రమే మిగిలి ఉంది. 5కాబట్టి ఆ రోజు నుండి నేటి వరకు దాగోను యాజకులు గాని దాగోను గుడికి వచ్చేవారు గాని అష్డోదులోని దాగోను గుడిలో అడుగుపెట్టరు.
6యెహోవా హస్తం అష్డోదు ప్రజల మీద దాని చుట్టుప్రక్కల ప్రాంతాల మీద భారంగా ఉంది; ఆయన వారి పైకి వినాశనం తెచ్చి గడ్డలతో వారిని బాధించారు. 7అష్డోదు ప్రజలు జరిగిన దానిని చూసి, “ఇశ్రాయేలీయుల దేవుని మందసం మన మధ్య ఉండకూడదు, ఎందుకంటే దానిని బట్టి ఆయన హస్తం మనమీద, మన దేవుడైన దాగోను మీద భారంగా ఉంది” అన్నారు. 8కాబట్టి వారు ఫిలిష్తీయుల పాలకులందరినీ పిలిచి, “ఇశ్రాయేలీయుల దేవుని మందసాన్ని మనం ఏమి చేద్దాం?” అని వారిని అడిగారు.
అందుకు వారు, “ఇశ్రాయేలీయుల దేవుని మందసాన్ని ఇక్కడినుండి గాతు పట్టణానికి పంపించండి” అని చెప్పారు. కాబట్టి ఇశ్రాయేలీయుల దేవుని మందసాన్ని అక్కడినుండి తీసుకెళ్లారు.
9కానీ వారు దానిని తరలించిన తర్వాత, యెహోవా హస్తం ఆ పట్టణానికి వ్యతిరేకంగా ఉండి, వారిని చాలా భయాందోళనలకు గురిచేసింది. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా పట్టణంలోని ప్రజలకు ఆయన గడ్డలు పుట్టించి బాధించారు. 10కాబట్టి వారు దేవుని మందసాన్ని ఎక్రోనుకు పంపించారు.
దేవుని మందసం ఎక్రోనులోనికి వచ్చినప్పుడు ఎక్రోను ప్రజలు, “మనలను మన ప్రజలను నాశనం చేయడానికి వీరు ఇశ్రాయేలీయుల దేవుని మందసాన్ని మన దగ్గరకు తీసుకువచ్చారు” అని కేకలు వేశారు. 11కాబట్టి వారు ఫిలిష్తీయుల పాలకులందరినీ పిలిచి, “ఇశ్రాయేలీయుల దేవుని మందసాన్ని ఇక్కడినుండి పంపివేయండి; దాని చోటికి దానిని పంపివేయండి” అన్నారు. ఎందుకంటే, ఆ పట్టణమంతా భయంతో నిండిపోయింది; దేవుని హస్తం దానిపైన చాలా భారంగా ఉంది. 12చనిపోకుండా ఉన్నవారు గడ్డల చేత బాధించబడ్డారు. ఆ పట్టణ ప్రజల కేకలు ఆకాశం వరకు వినబడ్డాయి.