6
ఇశ్రాయేలుకు తిరిగివచ్చిన మందసం
1యెహోవా మందసం ఏడు నెలలు ఫిలిష్తీయుల స్థావరంలో ఉన్న తర్వాత, 2ఫిలిష్తీయులు యాజకులను#6:2 లేదా పూజారులను, సోదె చెప్పేవారిని పిలిపించి, “మనం యెహోవా మందసం గురించి ఏం చేద్దాం? దాని చోటికి తిరిగి దానిని ఎలా పంపించాలో మాకు చెప్పండి?” అని అడిగారు.
3అందుకు వారు, “మీరు ఇశ్రాయేలు దేవుని మందసాన్ని తిరిగి ఇవ్వాలనుకుంటే, బహుమతి లేకుండా ఆయనకు తిరిగి పంపవద్దు; ఆయనకు అపరాధపరిహార అర్పణ పంపాలి. అప్పుడు మీరు స్వస్థత పొందుతారు, ఆయన చేయి మీమీద నుండి ఎందుకు తీసివేయబడలేదో మీకు తెలుస్తుంది” అన్నారు.
4అప్పుడు ఫిలిష్తీయులు, “మనం ఆయనకు అపరాధ పరిహారార్పణగా ఏమి పంపుదాం?” అని అడిగారు.
అందుకు వారు అన్నారు, “మీరు, మీ నాయకులందరు ఒకే రకమైన తెగులుతో బాధించబడ్డారు కాబట్టి, ఫిలిష్తీయుల పాలకుల లెక్క ప్రకారం అయిదు బంగారపు గడ్డల రూపాలు, అయిదు బంగారపు ఎలుకల రూపాలు అర్పించాలి. 5మీకు వచ్చిన గడ్డలకు దేశాన్ని పాడు చేస్తున్న ఎలుకలకు సూచనగా ఈ గడ్డలు, ఎలుకల రూపాలు తయారుచేసి పంపించి ఇశ్రాయేలు దేవున్ని మహిమపరచాలి. అప్పుడు మీమీద నుండి, మీ దేవుళ్ళ మీద నుండి, మీ దేశం మీద నుండి ఆయన తన హస్తాన్ని తీసివేయవచ్చు. 6ఈజిప్టువారు, ఫరో తమ హృదయాలను కఠినం చేసుకున్నట్లు మీరెందుకు కఠినం చేసుకుంటున్నారు? ఇశ్రాయేలీయుల దేవుడు వారితో కఠినంగా వ్యహరించినప్పుడు, వారు ఇశ్రాయేలీయులను వెళ్లనిచ్చారు; అప్పుడు ఇశ్రాయేలీయులు తమ దారిని తాము వెళ్లిపోలేదా?
7“కాబట్టి, మీరు క్రొత్త బండి ఒకటి తయారుచేయించి, ఇంతవరకు కాడి మోయని రెండు పాడి ఆవులను తెచ్చి బండికి కట్టాలి. కాని వాటి దూడలను వాటి దగ్గర నుండి దొడ్డికి తోలివేయాలి. 8యెహోవా మందసాన్ని బండిపైన ఉంచి, దాని ప్రక్కన అపరాధ పరిహారార్థబలిగా మీరు పంపుతున్న బంగారు వస్తువులు ఉన్న పెట్టెను పెట్టండి. దాని మార్గాన దాన్ని పంపండి, 9కాని దానిని జాగ్రత్తగా కనిపెడుతూ ఉండాలి. అది తన సొంత ప్రాంతమైన బేత్-షెమెషు వైపుకు వెళ్తే యెహోవా మన మీదికి ఈ గొప్ప విపత్తు తెచ్చారని, అలా జరుగకపోతే మన మీదికి వచ్చిన విపత్తు ఆయన హస్తం వలన కాదని ఇది అనుకోకుండ మనకు జరిగిందని మనకు తెలుస్తుంది.”
10కాబట్టి వారు అలాగే చేశారు. రెండు పాడి ఆవులను తోలుకొచ్చి బండికి కట్టి వాటి దూడలను దొడ్డికి పంపి, 11యెహోవా మందసాన్ని దానితో పాటు బంగారు ఎలుకలు, గడ్డల రూపాలు ఉన్న పెట్టెను వారు బండిపైన పెట్టారు. 12అప్పుడు ఆ ఆవులు దారిలో తిన్నగా వెళ్తూ, అరుస్తూ తిన్నగా బేత్-షెమెషు దారిలో నడిచాయి; అవి కుడికి గాని ఎడమకు గాని తిరగలేదు. ఫిలిష్తీయుల పాలకులు బేత్-షెమెషు సరిహద్దు వరకు వాటిని వెంబడిస్తూ వెళ్లారు.
13బేత్-షెమెషు ప్రజలు లోయలో తమ గోధుమపంటను కోస్తున్నారు. వారు కళ్ళెత్తి చూసినప్పుడు మందసం కనబడింది, వారు దాన్ని చూసి సంతోషించారు. 14ఆ బండి బేత్-షెమెషుకు చెందిన యెహోషువ పొలంలోనికి వచ్చి, అక్కడ ఉన్న ఒక పెద్ద బండ ప్రక్కన ఆగింది. ప్రజలు ఆ బండి కర్రలను నరికి ఆవులను యెహోవాకు దహనబలిగా అర్పించారు. 15లేవీయులు యెహోవా మందసాన్ని, బంగారపు వస్తువులు ఉన్న ఆ చిన్న పెట్టెను దించి వాటిని ఆ పెద్ద బండ మీద పెట్టారు. ఆ రోజే బేత్-షెమెషు ప్రజలు యెహోవాకు దహనబలులు అర్పించి, బలులు వధించారు. 16అయిదుగురు ఫిలిష్తీయుల పాలకులు అదంతా చూసి ఆ రోజే ఎక్రోనుకు తిరిగి వెళ్లిపోయారు.
17ఫిలిష్తీయులు యెహోవాకు అపరాధపరిహార అర్పణగా పంపిన బంగారు గడ్డలు అష్డోదు, గాజా, అష్కెలోను, గాతు, ఎక్రోనులకు ఒక్కొక్కటి. 18బంగారు ఎలుకల సంఖ్య అయిదుగురు ఫిలిష్తీయుల పాలకులకు చెందిన కోటగోడలు గల పట్టణాలు చుట్టుప్రక్కల గ్రామాల లెక్క ప్రకారం ఉంది. బేత్-షెమెషులోని యెహోషువ పొలంలో లేవీయులు యెహోవా మందసాన్ని పెట్టిన పెద్ద బండ నేటికీ సాక్షిగా ఉంది.
19బేత్-షెమెషు ప్రజలు యెహోవా మందసాన్ని తెరిచి చూసిన కారణంగా దేవుడు వారిలో డెబ్బై#6:19 కొ.ప్రా.ప్ర.లలో 50,070 మందిని హతం చేశారు. యెహోవా వారిని బలంగా దెబ్బ కొట్టడం వలన ప్రజలు ఎంతో దుఃఖించారు. 20అప్పుడు బేత్-షెమెషు ప్రజలు, “ఈ పరిశుద్ధ దేవుడైన యెహోవా సన్నిధిలో ఎవరు నిలబడగలరు? ఇక్కడినుండి మందసం ఎవరి దగ్గరకు వెళ్లాలి?” అని అడిగారు.
21తర్వాత వారు కిర్యత్-యారీము ప్రజల దగ్గరకు దూతలను పంపించి, “ఫిలిష్తీయులు యెహోవా మందసాన్ని తిరిగి ఇచ్చారు. వచ్చి దానిని మీ పట్టణానికి తీసుకెళ్లండి” అని కబురు పంపారు.