1 సమూయేలు 7

7
1అప్పుడు కిర్యత్-యారీము ప్రజలు వచ్చి యెహోవా మందసాన్ని తీసుకెళ్లారు. వారు దానిని కొండమీద ఉన్న అబీనాదాబు ఇంటికి తీసుకువచ్చి యెహోవా మందసానికి కాపాడడానికి అతని కుమారుడైన ఎలియాజరును ప్రతిష్ఠించారు. 2యెహోవా మందసం కిర్యత్-యారీములో ఇరవై సంవత్సరాలు ఉంది.
మిస్పా దగ్గర ఫిలిష్తీయులను అణచివేసిన సమూయేలు
ఇశ్రాయేలు ప్రజలంతా మళ్ళీ యెహోవా వైపు తిరిగారు. 3కాబట్టి సమూయేలు ఇశ్రాయేలీయులతో, “మీ పూర్ణహృదయంతో యెహోవా దగ్గరకు మీరు తిరిగి వస్తే, ఇతర దేవుళ్ళను, అష్తారోతు విగ్రహాలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదలతో యెహోవా వైపు మీ హృదయాలను త్రిప్పి ఆయనను మాత్రమే సేవించండి. అప్పుడు ఫిలిష్తీయుల చేతిలో నుండి ఆయన మిమ్మల్ని విడిపిస్తారు” అన్నాడు. 4అప్పుడు ఇశ్రాయేలీయులు బయలు ప్రతిమలను, అష్తారోతు విగ్రహాలను తీసివేసి కేవలం యెహోవాను మాత్రమే సేవించారు.
5అప్పుడు సమూయేలు, “ఇశ్రాయేలీయులందరిని మిస్పా దగ్గర సమకూర్చండి, నేను మీ అందరి పక్షంగా యెహోవాకు విజ్ఞాపన చేస్తాను” అన్నాడు. 6వారు మిస్పాకు చేరుకుని వారు నీళ్లు తీసుకువచ్చి యెహోవా సన్నిధిలో కుమ్మరించారు. ఆ రోజున వారు ఉపవాసం ఉండి, “యెహోవాకు వ్యతిరేకంగా మేము పాపం చేశాము” అని ఒప్పుకున్నారు. సమూయేలు మిస్పాలో ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతిగా సేవ చేస్తున్నాడు.
7ఇశ్రాయేలీయులు మిస్పాకు చేరుకున్నారని ఫిలిష్తీయులు విన్నప్పుడు, ఫిలిష్తీయుల పాలకులు వారి మీద దాడి చేయడానికి వచ్చారు. ఇది విన్న ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయులకు భయపడ్డారు. 8వారు సమూయేలుతో, “మన దేవుడైన యెహోవా ఫిలిష్తీయుల చేతిలో నుండి మనలను రక్షించేలా మాకోసం ఆయనకు ప్రార్థన చేయడం మానవద్దు” అని మనవి చేశారు. 9అప్పుడు సమూయేలు పాలు త్రాగడం మానని ఒక గొర్రెపిల్లను తెచ్చి యెహోవాకు సంపూర్ణమైన దహనబలిగా అర్పించి ఇశ్రాయేలీయుల పక్షంగా యెహోవాకు ప్రార్థన చేయగా యెహోవా అతనికి జవాబిచ్చారు.
10సమూయేలు దహనబలి అర్పిస్తుండగా ఫిలిష్తీయులు యుద్ధం చేయడానికి ఇశ్రాయేలీయుల మీదికి వచ్చారు. అయితే ఆ రోజు యెహోవా ఫిలిష్తీయుల మీద గొప్ప ఉరుములు ఉరిమించి వారిని చెదరగొట్టడంతో వారు ఇశ్రాయేలీయుల చేతిలో ఓడిపోయారు. 11ఇశ్రాయేలీయులు మిస్పా నుండి బయలుదేరి ఫిలిష్తీయులను తరుముతూ బేత్-కారు వరకు వెంటాడి వారిని చంపారు.
12అప్పుడు సమూయేలు ఒక రాయిని తీసుకుని మిస్పాకు షేనుకు మధ్య దానిని నిలబెట్టి, “ఇంతవరకు యెహోవా మనకు సహాయం చేశారు” అని చెప్తూ దానికి ఎబెనెజెరు#7:12 అంటే సహాయక రాయి అని అర్థం అని పేరు పెట్టాడు.
13ఈ విధంగా ఫిలిష్తీయులు అణచివేయబడి ఇశ్రాయేలీయుల సరిహద్దులోనికి మళ్ళీ రావడం మానివేశారు. సమూయేలు బ్రతికిన కాలమంతా యెహోవా హస్తం ఫిలిష్తీయులకు విరోధంగా ఉంది. 14ఇశ్రాయేలీయులు నుండి ఫిలిష్తీయులు ఆక్రమించుకున్న పట్టణాలు అనగా ఎక్రోను నుండి గాతు వరకు ఉన్న అన్ని పట్టణాలు ఇశ్రాయేలుకు తిరిగి వచ్చాయి. పొరుగున ఉన్న గ్రామాలను ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల చేతిలో నుండి విడిపించారు. అమోరీయులకు ఇశ్రాయేలీయులకు మధ్య సమాధానం ఏర్పడింది.
15సమూయేలు తాను బ్రతికిన రోజులన్నీ ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతిగా ఉన్నాడు. 16ప్రతి సంవత్సరం అతడు బేతేలు నుండి గిల్గాలుకు అక్కడినుండి మిస్పాకు ప్రయాణిస్తూ ఆ స్థలాల్లో ఇశ్రాయేలీయులకు న్యాయం తీరుస్తూ వచ్చాడు. 17అయితే అతని ఇల్లు రామాలో ఉంది కాబట్టి అక్కడికి తిరిగివచ్చి అక్కడ కూడా ఇశ్రాయేలీయులకు న్యాయం తీరుస్తూ వచ్చాడు. అతడు అక్కడ యెహోవాకు ఒక బలిపీఠం కట్టాడు.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

1 సమూయేలు 7: TSA

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి