1 థెస్సలోనికయులకు 5
5
ప్రభువు దినం
1సహోదరీ సహోదరులారా, యేసు క్రీస్తు రాకడ ఎప్పుడు సంభవిస్తుందో ఆ కాలాలు, సమయాల గురించి మేము మీకు వ్రాయాల్సిన అవసరం లేదు, 2ప్రభువు దినం రాత్రి దొంగలా వస్తుందని మీకు బాగా తెలుసు. 3ప్రజలు, మేము, “నెమ్మది కలిగి సురక్షితంగా ఉన్నాం” అని అనుకుంటున్నప్పుడు, ఒక గర్భిణి స్త్రీకి పురుటినొప్పులు వచ్చునట్లు వారి పైకి నాశనం అకస్మాత్తుగా వస్తుంది, కాబట్టి వారు దాని నుండి తప్పించుకోలేరు.
4అయితే సహోదరీ సహోదరులారా, ఆ దినం దొంగలా మిమ్మల్ని ఆశ్చర్యపరచడానికి మీరు చీకటిలో లేరు. 5మీరంతా వెలుగు సంతానం పగటి సంతానము. మనం చీకటికి లేదా రాత్రికి చెందినవారం కాదు. 6కాబట్టి మనం నిద్రపోతున్న ఇతరుల్లా ఉండకుండా, మెలకువ కలిగి తెలివిగా ఉందాము. 7నిద్రపోయేవారు రాత్రివేళ నిద్రపోతారు, మత్తులుగా ఉండేవారా రాత్రివేళ మత్తులై ఉంటారు. 8అయితే మనం పగటికి చెందినవారం కాబట్టి తెలివి కలిగి, విశ్వాసం ప్రేమ అనే కవచాన్ని, రక్షణ పొందాలనే ఆ ఆశాభావాన్ని శిరస్త్రాణంగా ధరించుకొంటాము. 9ఎందుకంటే దేవుడు మనల్ని ఉగ్రతను అనుభవించడానికి నియమించలేదు కాని, మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా రక్షణ పొందడానికే నియమించారు. 10ఆయన తిరిగి వచ్చినప్పుడు మనం లోకంలో జీవించి ఉన్నా లేదా మరణించినా ఆయనతో పాటు మనం జీవించాలని క్రీస్తు మన కోసం చనిపోయారు. 11కాబట్టి మీరిప్పుడు చేస్తున్నట్లుగానే ఒకరిని ఒకరు ప్రోత్సహించుకొంటూ ఒకరిని ఒకరు బలపరచుకోండి.
తుది నియమాలు
12సహోదరీ సహోదరులారా, మీ మధ్యలో ప్రయాసపడుతున్నవారిని, ప్రభువులో మీ కోసం శ్రద్ధ చూపించేవారిని, మిమ్మల్ని హెచ్చరించేవారిని గౌరవించాలని మేము మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాము. 13వారి పనిని బట్టి వారిని ప్రేమతో అధికంగా గౌరవించండి. ఒకరితో ఒకరు సమాధానం కలిగి ఉండండి. 14సహోదరీ సహోదరులారా, సోమరులను హెచ్చరించమని, క్రుంగిపోయినవారిని ప్రోత్సహించమని, బలహీనులకు సహాయం చేయమని, అందరితో సహనం కలిగి ఉండమని మేము మిమ్మల్ని వేడుకుంటున్నాము. 15మీలో ఎవరూ కీడుకు ప్రతిగా కీడు చేయకుండ చూసుకోండి, అలాగే అందరికి మంచి చేయడానికే ఎల్లప్పుడూ ప్రయత్నించండి.
16ఎల్లప్పుడు ఆనందించండి; 17విడువక ప్రార్థించండి, 18మీరు ప్రతి విషయం కోసం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని క్రీస్తు యేసులో మీ పట్ల దేవుని ఉద్దేశము.
19ఆత్మ ప్రేరణను ఆర్పకండి. 20ప్రవచనాలను తిరస్కరించకండి. 21అన్నిటిని పరీక్షిస్తూ మంచి వాటిని గట్టిగా పట్టుకోండి, 22ప్రతీ కీడును తిరస్కరించండి.
23సమాధానకర్తయైన దేవుడు తానే స్వయంగా మిమ్మల్ని సంపూర్ణంగా పరిశుద్ధపరచును గాక. మీ పూర్ణాత్మను, మనస్సును దేహాన్ని మన ప్రభువైన యేసు క్రీస్తు రాకడలో నిందారహితంగా కాపాడును గాక. 24మిమ్మల్ని పిలిచేవాడు నమ్మకమైనవాడు, కాబట్టి ఆయన ఖచ్చితంగా చేస్తారు.
25సహోదరీ సహోదరులారా, మాకోసం ప్రార్థించండి.
26దేవుని ప్రజలందరికి పవిత్ర ముద్దుతో వందనాలు.
27సహోదరీ సహోదరులందరికి ఈ పత్రికను చదివి వినిపించాలని ప్రభువు పేరట మిమ్మల్ని ఆదేశిస్తున్నాను.
28మన ప్రభువైన యేసు క్రీస్తు కృప మీతో ఉండును గాక.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
1 థెస్సలోనికయులకు 5: TSA
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
Telugu Contemporary Version, Holy Bible
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Used with permission. All rights reserved worldwide.