1 తిమోతి పత్రిక 5
5
విధవరాండ్రు, పెద్దలు, దాసులు
1వృద్ధుని కఠినంగా గద్దించకుండా, అతన్ని నీ తండ్రిగా భావించి ప్రోత్సహించు. నీ కన్నా చిన్నవారిని నీ సోదరులుగా, 2సంపూర్ణమైన పవిత్రతతో నీ కన్నా పెద్దవారైన స్త్రీలను తల్లులుగా, నీ కన్నా చిన్నవారైన స్త్రీలను చెల్లెళ్ళుగా చూడు.
3నిజంగా అవసరంలో ఉన్న విధవరాండ్రకు సరియైన గుర్తింపు ఇవ్వు. 4కాని ఏ విధవరాలికైన పిల్లలు గాని మనుమలు గాని ఉంటే, ఆ పిల్లలు ముందుగా తమ కుటుంబంపట్ల శ్రద్ధ వహించడం, తమ తల్లిదండ్రులను వారి తల్లిదండ్రులను గౌరవించడం ద్వారా తాము పాటించే ధర్మాన్ని ఆచరణలో పెట్టడం నేర్చుకోవాలి, ఇది దేవుని సంతోషపరుస్తుంది. 5నిజంగా ఒంటరియైన, అవసరంలో ఉన్న విధవరాలు దేవునిపై ఆధారపడి రాత్రింబగళ్ళు ప్రార్థన చేస్తూ సహాయం కోసం దేవున్ని అడుగుతూ ఉంటుంది. 6తన సొంతసుఖాల కోసం జీవించే విధవరాలు జీవించి ఉన్నా మరణించినట్లే. 7ఎవరు కూడా నిందించబడకుండా ఉండడానికి ప్రజలకు ఈ సూచనలన్నింటిని చెప్పు. 8ఎవరైనా తమ బంధువులకు, మరి ముఖ్యంగా తన సొంత కుటుంబీకుల అవసరాలను తీర్చలేకపోతే అలాంటివారు విశ్వాసాన్ని విడిచిపెట్టినట్లే, వారు అవిశ్వాసుల కంటే చెడ్డవారు.
9ఏ విధవరాలినైనా విధవరాండ్రల జాబితాలో చేర్చాలంటే, ఆమె అరవై సంవత్సరాలుకు పైబడి, తన భర్తకు నమ్మకంగా ఉండి, 10తన మంచిపనుల బట్టి సంఘంలో గుర్తింపు కలిగి ఉండాలి, అనగా పిల్లలను పెంచడం, ఆతిథ్యం ఇవ్వడం, పరిశుద్ధుల పాదాలు కడగడం, కష్టంలో ఉన్నవారికి సహాయం చేయడం అన్ని రకాల మంచి పనులు చేయడంలో ముందు ఉండాలి.
11అయితే యవ్వన విధవరాండ్రను ఆ జాబితాలో చేర్చకూడదు. ఎందుకంటే, వారు మేము క్రీస్తు కొరకే జీవిస్తామని నిర్ణయాన్ని తీసుకున్న తర్వాత, తమ శారీరక వాంఛలకు లొంగిపోయి పెళ్ళి చేసుకోవాలనుకుంటారు. 12ఈ విధంగా వారు దేవునితో చేసుకున్న తమ మొదటి ఒప్పందాన్ని నిలుపుకోలేక తమపైకి తామే తీర్పును తెచ్చుకుంటారు. 13అంతేకాక వారు సోమరులుగా ఇంటింటికి తిరుగుతూ అనవసరమైన ముచ్చట్లతో, మాట్లాడకూడనివి మాట్లాడుతూ, ఇతరుల పనులలో జోక్యం చేసుకోవడం అలవాటు చేసుకుంటారు. 14కాబట్టి యవ్వన విధవరాండ్రకు నేను చెప్పేది ఏంటంటే, వారు పెళ్ళి చేసుకుని పిల్లలను కని, తమ గృహాలను శ్రద్ధగా చూసుకొంటూ, తమను నిందించడానికి విరోధికి అవకాశమివ్వకుండా చూసుకోవాలి. 15అయితే ఇప్పటికే కొందరు దారితప్పి సాతానును అనుసరిస్తున్నారు.
16విశ్వాసురాలైన ఏ స్త్రీయైనా తన కుటుంబంలో ఉన్న విధవరాలి భారాన్ని సంఘంపై పెట్టకుండా, తానే అలాంటి వారికి సహాయపడుతూ ఉండాలి. అప్పుడు నిజంగా అవసరంలో ఉన్న విధవరాండ్రకు సంఘం సహాయం చేయ కలుగుతుంది.
17సంఘాన్ని నడిపించే సంఘపెద్దలు, మరి ముఖ్యంగా వాక్యాన్ని ప్రకటించేవారు వాక్యాన్ని బోధించేవారు రెండింతల గౌరవానికి పాత్రులు. 18దీని గురించి లేఖనాల్లో, “ఎద్దు ధాన్యాన్ని త్రొక్కుతున్నప్పుడు మూతికి చిక్కం కట్టవద్దు,#5:18 ద్వితీ 25:4 పనివాడు జీతానికి పాత్రుడు”#5:18 లూకా 10:7 అని వ్రాయబడి ఉన్నది. 19సంఘపెద్దపై వచ్చిన నిందను ఇద్దరు లేదా ముగ్గురు సాక్షులు లేకుండా అంగీకరించకూడదు. 20అయితే సంఘపెద్దలు ఎవరైనా పాపం చేస్తే, ఇతరులకు హెచ్చరికగా ఉండడానికి వారిని అందరి ముందు గద్దించు. 21ఎటువంటి పక్షపాతాన్ని చూపించకుండ, ఎవరి పట్ల భేదం చూపకుండ నీవు ఈ సూచనలు పాటించాలని, దేవుని ఎదుట క్రీస్తు యేసు సన్నిధిలో ఎన్నుకోబడిన దేవదూతల ఎదుట నేను నిన్ను హెచ్చరిస్తున్నాను.
22ఎవరిపైనా చేతులను ఉంచడానికి తొందరపడకు, ఇతరుల పాపంలో భాగం పంచుకోవద్దు. నిన్ను నీవు పవిత్రంగా ఉంచుకో.
23నీకున్న కడుపునొప్పి, నీకు తరచుగా వచ్చే బలహీనతల కారణంగా కేవలం నీటిని మాత్రమే త్రాగకుండా కొంచెం ద్రాక్షారసాన్ని కూడా త్రాగు.
24కొందరి పాపాలు ప్రజల ఎదుట స్పష్టంగా కనబడి, తీర్పు తీర్చబడే చోటికి వారి కన్నా ముందుగా చేరుకుంటున్నాయి; మరి కొందరి పాపాలు వారి వెనుక అనుసరిస్తున్నాయి. 25అదే విధంగా, ఇప్పుడు కొందరు చేసిన మంచి పనులు స్పష్టంగా కనబడుతున్నాయి, అయితే ఇంకొందరు చేసిన మంచి పనులు ఇప్పుడు కనబడకపోయినా, అవి చాలా కాలం దాచబడి ఉండవు.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
1 తిమోతి పత్రిక 5: TSA
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
Telugu Contemporary Version, Holy Bible
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Used with permission. All rights reserved worldwide.