2 కొరింథీ పత్రిక 12
12
పౌలు దర్శనం, అతని ముల్లు
1నేను గర్వపడవచ్చు కాని, దాని వలన నాకు ప్రయోజనం లేదు. ప్రభువు దర్శనాల గురించి, ప్రత్యక్షతల గురించి చెప్తాను. 2క్రీస్తులో ఉన్న ఒక వ్యక్తి నాకు తెలుసు, అతడు పద్నాలుగు సంవత్సరాల క్రితం మూడవ ఆకాశానికి కొనిపోబడ్డాడు. అతడు శరీరంతో కొనిపోబడ్డాడా లేక శరీరం లేకుండా కొనిపోబడ్డాడా అనేది నాకు తెలియదు; అది దేవునికే తెలుసు. 3అలాంటి వ్యక్తి నాకు తెలుసు. అతడు అది శరీరంతోనా లేదా శరీరం లేకుండా కొనిపోబడ్డాడో నాకు తెలియదు. అది దేవునికే తెలుసు. 4అతడు పరదైసుకు కొనిపోబడ్డాడు, ఎవరూ చెప్పలేని మాటలు విన్నాడు, ఆ మాటలు పలకడానికి ఎవ్వరికి అనుమతి లేదు. 5కాబట్టి అలాంటి వాని గురించి గర్విస్తాను, కాని నా గురించి అయితే నా బలహీనత గురించి తప్ప వేరు విధంగా గర్వించను. 6ఒకవేళ నేను గర్వించాలనుకున్నా సత్యమే చెప్తాను కాబట్టి అవివేకిని కాను. కాని నేను చేసిన దానికి లేదా చెప్పిన దానికి మించి ఎవరూ నా గురించి ఎక్కువగా ఆలోచించకుండా నేను వాటికి దూరంగా ఉన్నాను. 7నాకు కలిగిన విశేషమైన గొప్ప ప్రత్యక్షతలు వల్ల గర్వంతో ఉబ్బిపోకుండ నా శరీరంలో ఒక ముల్లు పెట్టబడింది. అది సాతాను దూతగా పని చేసి నన్ను నలుగగొట్టి గర్వించకుండా చేస్తుంది. 8దీన్ని నా నుండి తీసివేయమని నేను మూడుసార్లు ప్రభువుకు మనవి చేశాను. 9అందుకు, “నా కృప నీకు చాలు, బలహీనతలో నా శక్తి పరిపూర్ణమవుతుంది” అని ఆయన నాతో చెప్పారు. అందువల్ల క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండేలా నా బలహీనతల్లోనే నేను గర్విస్తాను. 10అందుకే క్రీస్తు కోసం నాకు కలిగిన బలహీనతలు, అవమానాలు, కష్టాలు, హింసలు, బాధలు నాకు ఆనందాన్నే కలిగిస్తాయి. నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను.
కొరింథీయుల పట్ల పౌలు శ్రద్ధ
11నన్ను నేనే బుద్ధిహీనునిగా చేసుకున్నాను, కాని మీరే నన్ను బలవంతం చేశారు. నిజానికి మీరు నన్ను మెచ్చుకోవల్సింది, ఎందుకంటే, నేను వ్యర్థుడనే అయినా మీ “శ్రేష్ఠమైన అపొస్తలుల” కంటే ఏ విషయంలో తక్కువ వాడను కాను. 12అపొస్తలుల సూచకక్రియలు, అద్భుతాలు, మహత్కార్యాలు పూర్తి సహనంతో నా వల్ల మీ మధ్య జరిగాయి. 13నేనెప్పుడు మీకు భారంగా లేను అనేది తప్ప ఇతర సంఘాల కంటే మీరు ఎలా తక్కువ అవుతారు? ఈ తప్పును బట్టి నన్ను క్షమించండి!
14నేను మూడవసారి మీ దగ్గరకు రావడానికి సిద్ధంగా ఉన్నాను, అయితే వచ్చినప్పుడు మీకు భారంగా ఉండను, ఎందుకంటే నాకు కావల్సింది మీరే తప్ప మీ ధనం కాదు. పిల్లలు తల్లిదండ్రుల కోసం కాదు తల్లిదండ్రులే పిల్లల కోసం పొదుపు చేసి ఉంచాలి. 15కాబట్టి నాకు కలిగినదంత మీ ఆత్మల కోసం చాలా సంతోషంగా ఖర్చుచేస్తాను, అంతేకాదు నన్ను నేను కూడా మీ కోసం ఖర్చు చేసుకుంటాను; నేను మిమ్మల్ని ఎక్కువగా ప్రేమించినప్పుడు మీరు నన్ను తక్కువగా ప్రేమిస్తారా? 16అదలా ఉండనివ్వండి, నేను మీకు భారంగా ఉండలేదు గాని యుక్తిగా మాయ చేసి మిమ్మల్ని పట్టుకున్నాను అని అంటారేమో! 17నేను మీ దగ్గరకు పంపినవారి ద్వారా మిమ్మల్ని మోసం చేసి ఏమైనా సంపాదించుకున్నానా? 18తీతును మీ దగ్గరకు వెళ్లమని వేడుకున్నాను. అతనితో పాటు మా సహోదరున్ని కూడ పంపాను. తీతు మిమ్మల్ని దోచుకోలేదు కదా? మేము ఒకే ఆత్మను కలిగి ఒకే అడుగుజాడల్లో నడువలేదా?
19ఇంతవరకు మేము మీతో మా పక్షంగా వాదించుకుంటున్నామని మీరు అనుకుంటున్నారా? దేవుని దృష్టికి క్రీస్తులో ఉన్న వారిలా మేము మాట్లాడుతున్నాము; మిత్రులారా! మేము చేసే ప్రతిదీ మిమ్మల్ని బలపరచడానికే. 20ఎందుకంటే నేను వచ్చినపుడు నేను కోరుకున్నట్లుగా మీరు ఉండకపోవచ్చు, అలాగే మీరు కోరుకున్నట్లుగా నేను ఉండకపోవచ్చు. అక్కడ కలహాలు, అసూయలు, క్రోధాలు, కక్షలు, వదంతులు, గుసగుసలు, గర్వం, అల్లర్లు ఉంటాయేమోనని భయపడుతున్నాను. 21మరల నేను వచ్చినప్పుడు దేవుడు మీ ముందు నన్ను చిన్నబుచ్చుకునేలా చేస్తాడేమోనని భయపడుతున్నాను, అంతేగాక గతంలో పాపం చేసి జరిగించిన అపవిత్రత, లైంగిక పాపం, పోకిరి చేష్టల గురించి పశ్చాత్తాపం చెందని వారి గురించి కూడ నేను దుఃఖపడాల్సి వస్తుందేమో అని భయపడుతున్నాను.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
2 కొరింథీ పత్రిక 12: TSA
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
Telugu Contemporary Version, Holy Bible
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Used with permission. All rights reserved worldwide.