2 పేతురు 3

3
ప్రభువు దినం
1ప్రియ స్నేహితుల్లారా, ఇది మీకు వ్రాస్తున్న నా రెండవ పత్రిక. మీలో పరిపూర్ణమైన ఆలోచనను ప్రేరేపించడానికి జ్ఞాపకం చేయాలని ఈ రెండు పత్రికలను మీకు వ్రాసాను. 2పూర్వకాలంలో పరిశుద్ధ ప్రవక్తల ద్వారా పలుకబడిన వాక్యాలను, మన ప్రభువైన రక్షకుని వలన అపొస్తలుల ద్వారా మీకు ఇవ్వబడిన ఆజ్ఞలను మీరు జ్ఞాపకం చేసుకోవాలని నేను కోరుతున్నాను.
3అన్నిటికి మించి, అంత్యదినాలలో అపహాసకులు వస్తారని మీరు గ్రహించలి, వారు అపహాస్యం చేస్తూ తమ చెడుకోరికలను అనుసరిస్తారు. 4“ ‘వస్తాను’ అని ఆయన చేసిన వాగ్దానం ఎక్కడవుంది? మన పితరులు ఎప్పుడో చనిపోయారు, సృష్టి ఆరంభం నుండి ఎలా ఉందో, మార్పు లేకుండా అంతా అలాగే జరుగుతుంది.” అని వారు చెప్తారు. 5అయితే, పూర్వకాలంలో దేవుని వాక్యం వలన ఆకాశాలు సృజింపబడ్డాయని, నీళ్ల నుండి నీళ్ల ద్వారా భూమి ఏర్పడిందని వారు ఉద్దేశపూర్వకంగా మరిచిపోతారు. 6ఈ నీళ్ల వల్లనే, అప్పటి లోకం ముంచివేయబడి నాశనం చేయబడింది. 7అదే వాక్యం వల్ల ఇప్పుడున్న భూమి, ఆకాశాలు దహించబడడానికి ఉంచబడ్డాయి, భక్తిహీనులు నాశనం కొరకై తీర్పు దినం వరకు భద్రపరచబడి ఉంటారు.
8కాని ప్రియ స్నేహితుల్లారా, ఈ ఒక్క విషయాన్ని మరువకండి: దేవుని దృష్టిలో ఒక రోజు వెయ్యి సంవత్సరాల్లా, వెయ్యి సంవత్సరాలు ఒక రోజులా ఉన్నాయి. 9కొందరు అనుకుంటున్నట్లు ప్రభువు తన వాగ్దానాన్ని నెరవేర్చడంలో ఆలస్యం చేసేవాడు కాడు. ఎవరు నశించకూడదని, అందరూ మారుమనస్సు పొందాలని మీ కొరకు ఆయన దీర్ఘశాంతం కలిగివున్నాడు.
10కాని ప్రభువు దినం దొంగలా వస్తుంది. ఆకాశాలు మహాశబ్దంతో గతించిపోతాయి; మూలకాలు అగ్ని చేత నశించిపోతాయి, భూమి దానిలో చేయబడివున్న సమస్తం లయమైపోతాయి.
11ఇలా అన్ని నశించిపోతూ ఉంటే, మీరు ఎలాంటి వారై ఉండాలి? మీరు పరిశుద్ధమైన భక్తిగల జీవితాన్ని కలిగివుండాలి. 12దేవుని రాకడ దినం కొరకు అపేక్షతో కనిపెట్టండి. ఆ దినాన ఆకాశాలు అగ్ని చేత నశించిపోతాయి, మూలకాలు వేడికి కరిగిపోతాయి. 13కాని మనం ఆయన చేసిన వాగ్దానంలో నిలిచివుండి, నీతి నివసించే ఒక క్రొత్త ఆకాశం కొరకు ఒక క్రొత్త భూమి కొరకు మనం ఎదురుచూస్తున్నాము.
14కాబట్టి, ప్రియ స్నేహితుల్లారా, మీరు దీని కొరకు ఎదురుచూస్తూ ఉన్నారు కనుక కళంకం లేనివారిగా నిందలేనివారిగా ఆయనలో శాంతం గలవారిగా ఉండడానికి ప్రయత్నించండి. 15మన ప్రభువు యొక్క సహనానికి అర్థం రక్షణ అని మీ మనస్సులలో తలంచుకోండి, అలాగే మన ప్రియ సోదరుడు పౌలు కూడా దేవుడు తనకు అనుగ్రహించిన జ్ఞానం చొప్పున మీకు వ్రాసాడు. 16అంతేగాక, వీటన్నిటిని గురించి అన్ని పత్రికల్లో చెప్పాడు, ఇతని పత్రికలలో కొన్ని విషయాలు అర్థంచేసుకోడానికి కష్టతరంగా ఉంటాయి. వీటిని గ్రహించలేని జ్ఞానహీనులు, అస్థిరులు మిగతా లేఖనాలను అపార్ధం చేసుకొన్నట్లే, తమ స్వనాశనానికి వేరొక రీతిగా అపార్ధం చేసుకుంటారు.
17కాబట్టి, ప్రియ స్నేహితుల్లారా, మీరు ముందుగా హెచ్చరించబడిన రీతిగా, మీ సుస్థిర స్థానం నుండి భ్రష్టులు కాకుండా, అన్యాయస్థుల తప్పిదాల వల్ల పెడత్రోవ పట్టి దుర్మార్గులు కాకుండా ఉండడానికి జాగ్రత్తగా ఉండండి. 18అయితే, మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క అనుగ్రహం జ్ఞానంలో వర్ధిల్లండి.
ఆయనకు ఇప్పుడు ఎల్లప్పుడు మహిమ కలుగును గాక! ఆమేన్.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

2 పేతురు 3: TCV

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి