అపొస్తలుల కార్యములు 28

28
మాల్తే ద్వీపంలో పౌలు
1మేము క్షేమంగా ఒడ్డు చేరుకొన్న తర్వాత, ఆ ద్వీపం పేరు మాల్తే అని తెలుసుకొన్నాం. 2ఆ ద్వీపవాసులు మా పట్ల ఎంతో దయ చూపించారు. అప్పుడు వర్షం పడుతూ చలిగా ఉండడంతో వారు మంట వెలిగించి మా అందరిని చేర్చుకున్నారు. 3పౌలు కొన్ని కట్టెలు ఏరి మంటలో పెడుతున్నప్పుడు, ఆ మంట వేడికి ఒక పాము బయటకు వచ్చి, అతని చేతిని పట్టుకొంది. 4పాము అతని చేతికి వేలాడడం చూసిన ఆ ద్వీపవాసులు తమలో తాము, “ఈ వ్యక్తి ఖచ్చితంగా హంతకుడు, ఇతడు సముద్రం నుండి తప్పించుకొన్నా, న్యాయదేవత ఇతన్ని బ్రతకనివ్వడం లేదు” అని చెప్పుకొన్నారు. 5అయితే పౌలు తన చేతిని విదిలించి ఆ పామును మంటలో వేశాడు దానివల్ల అతనికి ఎలాంటి హాని కలుగలేదు. 6ప్రజలు అతని శరీరం వాపు వస్తుందని లేదా అకస్మాత్తుగా మరణిస్తాడని అనుకున్నారు; కానీ చాలాసేపు చూసిన తర్వాత కూడా అతనికి ఏ ప్రమాదం జరుగకపోవడం చూసి, తమ మనస్సులను మార్చుకొని, ఇతడు ఒక దేవుణ్ని చెప్పసాగారు.
7పొప్లి అనేవాడు ఆ ద్వీపానికి ముఖ్యుడు, ఆ ప్రాంతంలో అతనికి భూములు ఉన్నాయి. అతడు మమ్మల్ని తన ఇంటికి ఆహ్వానించి మూడు రోజులు మంచి ఆతిథ్యం ఇచ్చాడు. 8ఆ సమయంలో పొప్లి తండ్రి జ్వరం, రక్త విరేచనాలతో బాధపడుతూ అనారోగ్యంతో మంచం పట్టి ఉన్నాడు. పౌలు అతన్ని చూడడానికి వెళ్లి, ప్రార్థన చేసిన తర్వాత తన చేతులను అతని మీద ఉంచి స్వస్థపరిచాడు. 9ఇది జరిగినప్పుడు, ఆ ద్వీపంలోని మిగిలిన రోగులు కూడా వచ్చి స్వస్థత పొందుకొన్నారు. 10వారు అనేక సత్కారాలతో మాకు మర్యాద చేశారు; మేము ఓడలో ప్రయాణించడానికి సిద్ధంగా ఉన్నప్పుడు, మాకు కావలసిన వస్తువులన్నిటిని తెచ్చి ఓడలో ఉంచారు.
రోమాను చేరుకొన్న పౌలు
11మేము మూడు నెలలు ద్వీపంలో శీతాకాలం గడిపిన తర్వాత కాస్టర్, పోలుక్స్ అనే కవల దేవతల చిహ్నం కలిగిన అలెక్సంద్రియ పట్టణానికి వెళ్లే ఓడ ఎక్కి బయలుదేరాం. 12మేము సురకూసై నగరానికి వచ్చి అక్కడ మూడు రోజులు ఉన్నాం. 13అక్కడి నుండి ఓడలో బయలుదేరి రేగియు అనే పట్టణానికి వచ్చాము, మరుసటిరోజు దక్షిణపు గాలి విసరడంతో పొతియొలీ పట్టణానికి చేరుకొన్నాం. 14అక్కడ కలిసిన కొందరు సహోదర సహోదరీలు తమతో ఒక వారం రోజులు ఉండుమని మమ్మల్ని వేడుకొన్నారు. ఆ విధంగా మేము రోమా పట్టణానికి చేరుకొన్నాం. 15మేము వస్తున్నామని విన్న సహోదర సహోదరీలు అప్పియా సంతపేట మరియు మూడు సత్రాలపేట వరకు మమ్మల్ని కలుసుకోడానికి బయలుదేరి వచ్చారు. పౌలు వారందరిని చూసి దేవునికి కృతజ్ఞతలు చెల్లించి ధైర్యం తెచ్చుకొన్నాడు. 16మేము రోమా పట్టణానికి వచ్చినప్పుడు, పౌలు తనకు కాపలాగా ఉన్న ఒక సైనికునితో పాటు తనంతట తాను జీవించడానికి అనుమతి పొందాడు.
కాపలావారి మధ్యలో రోమా పట్టణంలో బోధించిన పౌలు
17మూడు రోజుల తర్వాత పౌలు అక్కడి యూదా నాయకులను పిలిచి, వారు ఒక్కచోట చేరినప్పుడు వారితో, “నా సహోదరులారా, నేను మన ప్రజలకు, మన పూర్వీకుల ఆచారాలకు వ్యతిరేకంగా ఏమి చేయకపోయినా, నన్ను యెరూషలేములో బంధించి రోమీయులకు అప్పగించారు. 18వారు నన్ను విచారణ చేసి మరణశిక్ష విధించవలసినంత తప్పు నేను చేయలేదని నన్ను విడిచిపెట్టాలని అనుకున్నారు. 19కానీ యూదులు అడ్డుచెప్పడంతో నేను కైసరుకు విజ్ఞప్తి చేసుకుంటానని మనవి చేశాను. నా సొంత ప్రజలకు వ్యతిరేకంగా నేను ఏ ఫిర్యాదు చేయదలచుకోలేదు. 20ఈ కారణంగానే నేను మిమ్మల్ని చూసి మీతో మాట్లాడాలని మిమ్మల్ని పిలిపించాను. ఇశ్రాయేలీయుల యొక్క నిరీక్షణను బట్టి నేను ఈ గొలుసుతో బంధించబడి ఉన్నాను” అని వారితో చెప్పాడు.
21అందుకు వారు, “నీ గురించి యూదయ నుండి ఎటువంటి ఉత్తరాలు మాకు రాలేదు. అక్కడి నుండి వచ్చిన మన ప్రజలలో ఎవరు నీ గురించి చెడుగా మాతో చెప్పలేదు. 22కానీ ప్రతిచోట ప్రజలు ఈ మతమార్గానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని మాకు తెలుసు, కనుక దీని గురించి నీ అభిప్రాయం మేము వినాలనుకొంటున్నాం” అన్నారు.
23ఒక రోజును ఏర్పాటు చేసుకొని, పౌలు ఉన్న చోటికి చాలామంది వచ్చారు. అతడు ఉదయం నుండి సాయంకాలం వరకు దేవుని రాజ్యం గురించి వివరిస్తూ సాక్ష్యమిచ్చి, మోషే ధర్మశాస్త్రం నుండి ప్రవక్తలు వ్రాసిన పుస్తకాల నుండి యేసు గురించి బోధిస్తూ వారిని ఒప్పించడానికి ప్రయత్నించాడు. 24అతడు చెప్పిన సంగతులను కొందరు నమ్మారు, మరికొందరు నమ్మలేదు. 25పౌలు వారితో చివరిగా చెప్పిన మాటలు ఇవి: “యెషయా ప్రవక్త ద్వారా మీ పితరులతో పరిశుద్ధాత్మ మాట్లాడినది నిజమే:
26“ ‘ఈ ప్రజల దగ్గరకు వెళ్లి చెప్పు,
“మీరు ఎప్పుడూ వింటూనే ఉంటారు గాని అర్థం చేసుకోరు;
ఎప్పుడూ చూస్తూనే ఉంటారు గాని గ్రహించరు.”
27ఎందుకంటే ఈ ప్రజల హృదయాలు మొద్దుబారిపోయాయి;
వారు చెవులతో వినరు,
వారు కళ్ళు మూసుకున్నారు.
లేకపోతే వారు తమ కళ్ళతో చూసి,
తమ చెవులతో విని,
తమ హృదయాలతో గ్రహించి నా వైపుకు తిరుగుతారు,
అప్పుడు నేను వారిని స్వస్థపరుస్తాను.’#28:27 యెషయా 6:9-10
28“అందుకే దేవుని రక్షణ యూదేతరుల వద్దకు పంపబడినది, వారు దాన్ని వింటారని మీరు తెలుసుకోవాలి.” [29పౌలు ఈ మాటలను చెప్పిన తర్వాత యూదులు తమలో తాము తీవ్రంగా వాదించుకుంటూ అక్కడి నుండి వెళ్లిపోయారు.]#28:29 కొన్ని వ్రాతప్రతులలో ఈ వాక్యములు ఇక్కడ చేర్చబడలేదు
30పౌలు రెండు సంవత్సరాలు పూర్తిగా తన అద్దె ఇంట్లో ఉంటూ తనను చూడాలని వచ్చిన వారందరిని స్వాగతించాడు. 31అతడు పూర్ణధైర్యంతో ఏ ఆటంకం లేకుండా దేవుని రాజ్యం గురించి ప్రకటిస్తూ, ప్రభువైన యేసు క్రీస్తు గురించి బోధించాడు.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

అపొస్తలుల కార్యములు 28: TCV

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి