దానియేలు 4
4
నెబుకద్నెజరుకు చెట్టు గురించి వచ్చిన కల
1రాజైన నెబుకద్నెజరు,
లోకంలో జీవించే వివిధ భాషలు గల దేశాలకు, ప్రజలకు ఇలా తెలియజేస్తున్నాడు:
మీకు గొప్పగా అభివృద్ధి కలుగును గాక!
2సర్వోన్నతుడైన దేవుడు నా పట్ల చేసిన అద్భుతమైన సూచకక్రియలు, ఆశ్చర్యకార్యాలు మీకు చెప్పడం నాకు ఎంతో ఆనందము.
3ఆయన సూచకక్రియలు ఎంతో గొప్పవి,
ఆయన అద్భుతాలు ఎంతో ఘనమైనవి!
ఆయన రాజ్యం శాశ్వతమైన రాజ్యం;
ఆయన అధికారం తరతరాలకు నిలిచి ఉంటుంది.
4నెబుకద్నెజరు అనే నేను, నా రాజభవనంలో హాయిగా, క్షేమంగా ఉన్నాను. 5నాకు ఒక కల వచ్చింది, అది నన్ను భయపెట్టింది. నేను మంచం మీద పడుకుని ఉన్నప్పుడు, నా మనస్సులోనికి వచ్చిన దృశ్యాలు, దర్శనాలు నన్ను భయపెట్టాయి. 6కాబట్టి ఆ కల భావం చెప్పడానికి బబులోనులో ఉన్న జ్ఞానులందరినీ నా ఎదుటకు తీసుకురమ్మని ఆజ్ఞాపించాను. 7మాంత్రికులు, శకునగాళ్లు, కల్దీయ జ్యోతిష్యులు, సోదె చెప్పేవారు వచ్చినప్పుడు నా కల వారికి చెప్పాను. కాని వారు దాని భావం చెప్పలేకపోయారు. 8చివరికి, దానియేలు నా దగ్గరకు వచ్చాడు (నా దేవుని పేరైన బెల్తెషాజరు అని అతనికి పేరు పెట్టాను, ఎందుకంటే అతనిలో పవిత్ర దేవుళ్ళ ఆత్మ ఉంది) అతనికి నా కల చెప్పాను.
9నేను అతనితో, “శకునగాండ్రకు అధిపతివైన బెల్తెషాజరూ, పవిత్ర దేవుళ్ళ ఆత్మ నీలో ఉందని, మర్మం ఏదైనా నీకు కష్టం కాదని నాకు తెలుసు. ఇదిగో నా కల; దాని భావం నాకు చెప్పు. 10నా పడకలో నేను పడుకుని ఉన్నప్పుడు నేను చూసిన దర్శనాలు ఇవి: నేను చూడగా, భూమి మధ్యలో ఒక చెట్టు కనిపించింది, దాని ఎత్తు చాలా ఎక్కువ. 11ఆ చెట్టు ఎత్తుగా, బలంగా పెరిగింది. దాని కొమ్మ ఆకాశాన్ని అంటుకుంది; భూమి అంచుల వరకు అది కనిపించింది. 12దానికి అందమైన ఆకులు సమృద్ధిగా ఫలాలు ఉన్నాయి. అందరికి సరిపడా ఆహారం దాని మీద ఉంది. అడవి జంతువులు దాని నీడలో ఉన్నాయి, పక్షులు దాని కొమ్మల్లో నివసించాయి; ప్రతి జీవి దాని నుండి పోషించబడింది.
13“నేను మంచం మీద పడుకుని ఉన్నప్పుడు నా దర్శనాలలో పరలోకం నుండి ఒక పరిశుద్ధుడు, ఒక దూత#4:13 లేదా కావలివాడు; 17, 23 వచనాల్లో కూడా రావడం చూశాను. 14అతడు ఇలా బిగ్గరగా అన్నాడు: ‘ఈ చెట్టును నరికివేయండి, కొమ్మలను కత్తిరించండి; దాని ఆకులను తీసివేసి దాని పండ్లను చెదరగొట్టండి. దాని క్రిందనుండి జంతువులు, దాని కొమ్మల నుండి పక్షులు పారిపోవాలి. 15అయితే దాని మొద్దును దాని వేర్లను ఇనుముతో ఇత్తడితో కట్టి పొలంలోని గడ్డిలో నేలపై విడిచిపెట్టండి.
“ ‘అతడు ఆకాశ మంచులో తడిసిపోవాలి, అతడు జంతువులతో, భూమిమీది మొక్కలతో నివసించాలి. 16అతనికి ఏడు కాలాలు#4:16 లేదా సంవత్సరాలు; 23, 25, 32 వచనంలో కూడా గడిచేవరకు, అతనికి మానవ మనస్సుకు బదులు జంతువు మనస్సు ఉండాలి.
17“ ‘ఈ నిర్ణయం దేవదూతలు ప్రకటించారు, పరిశుద్ధులు ఈ తీర్పును ప్రకటించారు, తద్వారా సర్వోన్నతుడు, సమస్త మానవ రాజ్యాల మీద ప్రభువని, ఆయన కోరుకున్న వారెవరికైన ఇస్తారని, ఆయన మనుష్యుల్లో అల్పులైనవారికి వాటి మీద అధికారమిస్తారని మనుషులంతా తెలుసుకుంటారు.’
18“బెల్తెషాజరూ, నెబుకద్నెజరు రాజునైన నాకు వచ్చిన కల ఇది. బెల్తెషాజరూ, దాని అర్థమేంటో నాకు చెప్పు, నా రాజ్యంలో ఏ జ్ఞాని దీని భావం చెప్పలేదు. అయితే పవిత్ర దేవుళ్ళ ఆత్మ నీలో ఉంది కాబట్టి నీవు చెప్పగలవు” అని అన్నాడు.
దానియేలు కలను వివరించుట
19అప్పుడు దానియేలు (బెల్తెషాజరు అని కూడా పిలువబడ్డాడు) కొంత సమయం కలవరపడ్డాడు, అతని తలంపులు అతనికి భయం కలిగించాయి. అప్పుడు రాజు అన్నాడు, “బెల్తెషాజరూ, ఈ కలకు గాని దాని భావానికి కలవరపడవద్దు.”
బెల్తెషాజరు జవాబిస్తూ అన్నాడు, “నా ప్రభువా, ఆ కల మీ శత్రువులకు, దాని అర్థం మీ విరోధులకు చెందితే ఎంత బాగుండేది! 20మీరు చూసిన చెట్టు పెద్దగా, బలంగా పెరుగుతూ, ఆకాశాన్ని తాకుతూ, లోకమంతట కనిపిస్తుంది, 21దాని ఆకులు అందంగా, ఫలాలు సమృద్ధిగా ఉంటూ, అందరికి ఆహారాన్ని ఇస్తూ, అడవి జంతువులకు ఆశ్రయాన్ని ఇస్తూ, పక్షులు గూళ్ళు కట్టుకునే స్థలం కలిగి ఉంది 22రాజా! ఆ చెట్టు మీరే! మీరు గొప్పగా, బలవంతునిగా అయ్యారు; మీ గొప్పతనం ఆకాశాన్ని తాకే అంతగా, మీ అధికారం భూదిగంతాల వరకు విస్తరించింది.
23“రాజా! పరలోకం నుండి పరిశుద్ధుడు, ఒక దేవదూత వచ్చి, ‘చెట్టును నరికి దానిని నాశనం చేయాలి, కాని మొద్దును ఇనుముతో, ఇత్తడితో కట్టి పొలం గడ్డి మధ్యలో విడిచిపెట్టాలి, దాని వేర్లు భూమిలో ఉండాలి. అతడు ఆకాశ మంచులో తడిసిపోవాలి; అతడు ఏడు కాలాలు దాటే వరకు అడవి జంతువుల మధ్యలో నివసించాలి’ అని ప్రకటించడం మీరు చూశారు.
24“రాజా! ఆ కల భావం ఇదే, సర్వోన్నతుడైన దేవుడు నా ప్రభువైన రాజుకు జారీ చేసిన ఆదేశం ఇది: 25మీరు ప్రజల నుండి తరిమివేయబడి, అడవి జంతువుల మధ్య నివసిస్తారు; ఎద్దులా గడ్డి మేస్తూ ఆకాశపు మంచుకు తడిసిపోతారు. సర్వోన్నతుడు భూమిపై ఉన్న రాజ్యాలకు ప్రభువని, ఆయన వాటిని ఎవరికి ఇవ్వాలనుకుంటే వారికి ఇస్తారని మీరు గుర్తించేవరకు మీకు ఏడు కాలాల వరకు ఇలా జరుగుతుంది. 26చెట్టు మొద్దు, వేర్లు అలానే విడిచిపెట్టమని ఇచ్చిన ఆజ్ఞకు అర్థం ఏంటంటే, మీరు పరలోకం పరిపాలిస్తుందని గ్రహించినప్పుడు, మీ రాజ్యం తిరిగి మీకు ఇవ్వబడుతుంది. 27కాబట్టి రాజా! నా సలహాను ఇష్టంతో అంగీకరించండి: సరియైనది చేస్తూ మీ పాపాలను విడిచిపెట్టండి, బాధల్లో ఉన్నవారికి దయ చూపిస్తూ మీ చెడుతనాన్ని మానేయండి. అప్పుడు మీ అభివృద్ధి కొనసాగుతుంది.”
కల నెరవేర్చబడుట
28ఇదంతా నెబుకద్నెజరుకు రాజుకు జరిగింది. 29పన్నెండు నెలల తర్వాత, రాజు బబులోను రాజభవనం పైకప్పు మీద నడుస్తూ, 30“నా రాజ నివాసంగా నేను కట్టుకున్న ఈ మహా బబులోను పట్టణం నా బలప్రభావంతో నా వైభవాన్ని కనుపరచడానికి కట్టుకుంది కాదా?” అని తనలో తాను అనుకున్నాడు.
31ఆ మాటలు తన పెదవుల మీద ఉండగానే, ఆకాశం నుండి ఓ స్వరం వినిపించింది, “రాజైన నెబుకద్నెజరూ, నీకోసం ఇలా ప్రకటించబడింది: నీ రాజ్యాధికారం నీ నుండి తీసివేయబడింది. 32నీవు ప్రజల నుండి తొలగించబడతావు, నీవు ప్రజల్లో నుండి తరమబడి అడవి జంతువులతో నివసిస్తావు; ఎద్దులా నీవు గడ్డి మేస్తావు. సర్వోన్నతుడు భూరాజ్యాల మీద అధికారి అని, ఆయన ఎవరికి ఇవ్వాలనుకుంటే వారికి వాటిని ఇస్తారని నీవు గ్రహించే వరకు నీవు ఏడు కాలాలు గడుపుతావు.”
33వెంటనే నెబుకద్నెజరు గురించి చెప్పబడింది నెరవేరింది. అతడు ప్రజల నుండి తరమబడి, ఎద్దులా గడ్డి మేశాడు. అతని తలవెంట్రుకలు గ్రద్ద ఈకల్లా, అతని గోళ్ళు పక్షి గోళ్ళలా పెరిగే వరకు, అతని శరీరం ఆకాశం నుండి పడే మంచుకు తడిసిపోయింది.
34ఆ కాలం గడిచిన తర్వాత నెబుకద్నెజరు అనే నేను ఆకాశం వైపు నా తలెత్తి చూశాను, అప్పుడు నా మానవ బుద్ధి తిరిగి వచ్చింది. అప్పుడు నేను సర్వోన్నతున్ని స్తుతించాను; నిత్యం జీవించే ఆయనను ఘనపరిచాను, మహిమపరిచాను.
ఆయన అధికారం శాశ్వత అధికారం;
ఆయన రాజ్యం తరతరాలకు ఉంటుంది.
35ఆయన దృష్టిలో భూప్రజలు శూన్యులు.
పరలోక శక్తుల పట్ల
భూప్రజల పట్ల
ఆయనకు నచ్చింది చేస్తారు.
ఆయనను ఎవరూ ఆపలేరు.
“మీరు చేసింది ఏంటి?”
అని ఆయనను అడగలేరు.
36నా మానవ బుద్ధి తిరిగి ఇవ్వబడిన ఆ సమయంలోనే, నా రాజ్య మహిమ కోసం నా ఘనత, నా వైభవం నాకు తిరిగి ఇవ్వబడ్డాయి. నా సలహాదారులు, నా ఘనులు నా దగ్గరకు వచ్చారు, నేను నా సింహాసనం మీద మరలా కూర్చున్నాను, మునుపటి కంటే ఇంకా గొప్పవాడిగా అయ్యాను. 37ఇప్పుడు నెబుకద్నెజరు అనే నేను పరలోక రాజును స్తుతిస్తూ, కీర్తిస్తూ, కొనియాడుతున్నాను, ఎందుకంటే ఆయన చేసే ప్రతిదీ సత్యమైనది, ఆయన విధానాలన్నీ న్యాయమైనవి. గర్వంతో జీవించేవారిని ఆయన అణచివేయగలడు.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
దానియేలు 4: TSA
హైలైట్
షేర్ చేయి
కాపీ

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
Telugu Contemporary Version, Holy Bible
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Used with permission. All rights reserved worldwide.