ద్వితీయో 4

4
విధేయత చూపాలని ఆజ్ఞ
1ఇప్పుడు, ఇశ్రాయేలూ, నేను మీకు బోధించే శాసనాలు చట్టాలను వినండి. మీరు జీవించి, మీ పూర్వికుల దేవుడైన యెహోవా మీకు ఇస్తున్న దేశంలోకి వెళ్లి స్వాధీనం చేసుకోవడానికి వాటిని అనుసరించండి. 2నేను మీకు ఆజ్ఞాపించిన మాటతో దేన్ని కలుపకూడదు, దాని నుండి దేన్ని తీసివేయకూడదు, కాని నేను మీకు ఇస్తున్న మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను పాటించండి.
3బయల్-పెయోరు విషయంలో యెహోవా చేసిన దానిని మీరు కళ్లారా చూశారు. బయల్-పెయోరును వెంబడించిన వారందరిని మీ దేవుడైన యెహోవా మీ మధ్యలో ఉండకుండా నాశనం చేశారు, 4కాని మీ దేవుడైన యెహోవాను నమ్మకంగా పట్టుకుని ఉన్న మీరందరు ఈ రోజు వరకు బ్రతికి ఉన్నారు.
5చూడండి, నా దేవుడైన యెహోవా నాకు ఆజ్ఞాపించిన ప్రకారం మీరు స్వాధీనం చేసుకోబోయే దేశంలో మీరు పాటించవలసిన శాసనాలను చట్టాలను నేను మీకు బోధించాను. 6వాటిని జాగ్రతగా పాటించండి. ఈ శాసనాలన్నిటి గురించి వినే దేశాలకు అవే మీ జ్ఞానాన్ని మీ వివేకాన్ని తెలియజేస్తాయి; వారు, “ఈ గొప్ప దేశం ఖచ్చితంగా జ్ఞానం వివేకం కలిగిన ప్రజలు” అని చెప్పుకుంటారు. 7మనం ఆయనకు ప్రార్థన చేసినప్పుడు మన దేవుడైన యెహోవా మనకు సమీపంగా ఉన్నట్లు మరి ఏ గొప్పప్రజలకు వారి దేవుళ్ళు సమీపంగా ఉంటారు? 8ఈ రోజు నేను మీ ఎదుట పెట్టిన ఈ ధర్మశాస్త్రమంతటిలో నీతిగల శాసనాలు, చట్టాలు ఏ గొప్ప దేశం కలిగి ఉంది?
9అయితే జాగ్రత్తగా ఉండండి, మీరు మీ కళ్లారా చూసినవాటిని మరచిపోకుండా, మీరు జీవితాంతం మీ హృదయంలోనుండి చెరిగిపోకుండా జాగ్రత్త వహించండి. మీ పిల్లలకు వారి తర్వాత వారి పిల్లలకు వాటిని బోధించండి. 10హోరేబు దగ్గర మీ దేవుడైన యెహోవా ఎదుట మీరు నిలబడినప్పుడు ఆయన నాతో, “వారు ఆ దేశంలో జీవించినంత వరకు నాకు భయపడడం నేర్చుకొని, వాటిని తమ పిల్లలకు నేర్పేలా వారు నా మాటలు వినడానికి ప్రజలందర్ని సమకూర్చు” అని చెప్పిన రోజును జ్ఞాపకం ఉంచుకోండి. 11మీరంతా దగ్గరకు వచ్చి ఆ పర్వతం క్రింద నిలబడ్డారు, అది దట్టమైన మేఘాలు, కటిక చీకటి కమ్మి, ఆకాశం వరకు అగ్నితో మండుతూ ఉంది, 12యెహోవా ఆ అగ్నిలో నుండి మీతో మాట్లాడారు. మీరు మాటల శబ్దం విన్నారు కాని ఏ రూపాన్ని మీరు చూడలేదు; స్వరం మాత్రమే వినిపించింది. 13ఆయన మీకు తన నిబంధనను ప్రకటించారు, అనగా మీరు పాటించాలని పది ఆజ్ఞలు మీకు ఆజ్ఞాపించి, వాటిని రెండు రాతి పలకలమీద వ్రాశారు. 14మీరు యొర్దాను దాటి స్వాధీనం చేసుకోబోయే దేశంలో మీరు అనుసరించాల్సిన శాసనాలను చట్టాలను మీకు నేర్పించమని యెహోవా నాకు ఆదేశించారు.
విగ్రహారాధన నిషేధము
15అయితే చాలా జాగ్రతగా ఉండండి! హోరేబులో యెహోవా అగ్ని మధ్యలో నుండి మీతో మాట్లాడిన రోజున మీరు ఏ రూపాన్ని చూడలేదు. 16మీ కోసం ఎలాంటి విగ్రహాన్ని, ఎలాంటి రూపంలో ఉన్న దానినైన, స్త్రీ లేదా పురుషుని రూపంలో కాని, 17లేదా భూమి మీద ఉండే ఏ జంతువులా కాని, ఆకాశంలో ఎగిరే పక్షిలా కాని, 18లేదా నేల మీద ప్రాకే ఏ ప్రాణిలా కాని, నీటి క్రింద ఉండే ఏ చేపలా కాని విగ్రహం తయారుచేసుకోకండి. 19మీరు ఆకాశం వైపు కళ్ళెత్తి ఆకాశ సైన్యాలైన సూర్యచంద్ర నక్షత్రాలను చూసిన వాటిచే ఆకర్షించబడి, మీ దేవుడైన యెహోవా ఆకాశం క్రింద సమస్త దేశాల కోసం పంచి ఇచ్చిన వాటికి నమస్కరించి వాటికి సేవచేయకుండ మీరు జాగ్రత్తపడండి. 20మీరైతే, యెహోవా మిమ్మల్ని పట్టుకుని నేడు మీరున్నట్లుగా ఆయన వారసత్వ ప్రజలుగా ఉండడానికి ఇనుప కొలిమిలో నుండి, ఈజిప్టు నుండి, మిమ్మల్ని బయటకు తీసుకువచ్చారు.
21మీ కారణంగా యెహోవా నా మీద కోప్పడి నేను ఈ యొర్దాను దాటకూడదని, మీ దేవుడైన యెహోవా మీకు స్వాస్థ్యంగా ఇస్తున్న మంచి దేశంలో ప్రవేశించకూడదని ఆయన ప్రమాణము చేశారు. 22నేను ఈ దేశంలో చనిపోతాను; నేను యొర్దానును దాటను; కాని మీరు నది దాటి వెళ్లి ఆ మంచి దేశాన్ని స్వాధీనం చేసుకోబోతున్నారు. 23మీ దేవుడైన యెహోవా మీతో చేసిన నిబంధనను మరచిపోకుండా జాగ్రత్తపడండి; మీ దేవుడైన యెహోవా నిషేధించిన వాటి యొక్క ఎలాంటి రూపంలోను మీ కోసం విగ్రహాన్ని చేసుకోకండి. 24ఎందుకంటే మీ దేవుడైన యెహోవా దహించు అగ్ని, ఆయన రోషం గల దేవుడు.
25మీకు పిల్లలు మనవళ్లు కలిగి, ఆ దేశంలో చాలా కాలం నివసించిన తర్వాత, మీరు అప్పుడు చెడిపోయి ఏ రూపంలోనైనా విగ్రహాన్ని చేసుకుని మీ దేవుడైన యెహోవా కళ్ళెదుట చెడు చేసి ఆయనకు కోపం పుట్టిస్తే, 26మీరు ఈ యొర్దాను దాటి స్వాధీనం చేసుకోబోయే ఆ దేశంలో ఎక్కువకాలం నివసించకుండా వెంటనే నశిస్తారని ఈ రోజు ఆకాశాలను భూమిని మీమీద సాక్షులుగా ఉంచుతున్నాను. ఆ దేశంలో ఎక్కువకాలం నివసించరు ఖచ్చితంగా నశించిపోతారు. 27యెహోవా జనాంగాల మధ్యలో మిమ్మల్ని చెదరగొడతారు, యెహోవా మిమ్మల్ని తోలివేసే దేశాల మధ్యలో మీలో కొద్దిమంది మాత్రమే మిగులుతారు. 28అక్కడ మీరు మనుష్యులు తయారుచేసిన కర్ర, రాతి దేవుళ్ళను సేవిస్తారు. అవి చూడలేవు, వినలేవు, తినలేవు, వాసన చూడలేవు. 29అయితే అక్కడినుండి మీరు మీ దేవుడైన యెహోవాను వెదికితే, మీ పూర్ణహృదయంతో మీ పూర్ణాత్మతో వెదికినప్పుడు ఆయన మీకు దొరుకుతారు. 30మీరు దుఃఖంలో ఉన్నప్పుడు, ఈ సంగతులన్ని మీకు జరిగిన తర్వాత, అప్పుడు చివరి రోజుల్లో మీరు మీ దేవుడైన యెహోవా వైపు తిరిగి ఆయన మాట వింటారు. 31మీ దేవుడైన యెహోవా జాలిగల దేవుడు; కాబట్టి ఆయన మిమ్మల్ని విడిచిపెట్టడు, మిమ్మల్ని నాశనం చేయడు, ఆయన మీ పూర్వికులతో ప్రమాణం ద్వార నిశ్చయం చేసిన నిబంధనను మరచిపోరు.
యెహోవాయే దేవుడు
32దేవుడు భూమి మీద నరుని సృజించిన రోజు నుండి, మీకంటే ముందు ఉన్న గత కాలం గురించి అడగండి; ఆకాశం యొక్క ఒక చివరి నుండి మరో చివరి వరకు అడగండి. ఇలాంటి గొప్ప కార్యం ఎప్పుడైనా జరిగిందా? లేదా అటువంటి దాని గురించి ఎప్పుడైనా విన్నారా? 33అగ్ని మధ్యలో నుండి మాట్లాడిన దేవుని స్వరాన్ని మీరు విన్నట్లు మరి ఏ ప్రజలైనా విని బ్రతికారా? 34మీ దేవుడైన యెహోవా ఈజిప్టులో మీ కళ్ళెదుట మీ కోసం శోధనలతో, సూచకక్రియలతో, అద్భుతాలతో, యుద్ధంతో, బలమైన హస్తంతో, చాచిన చేతితో మహా భయంకరమైన కార్యాలతో సమస్త కార్యాలను చేసినట్లు ఏ దేవుడైన తన కోసం ఒక దేశం నుండి మరొక దేశాన్ని బయటకు తీసుకువచ్చే ప్రయత్నం చేశాడా?
35యెహోవాయే దేవుడని ఆయన తప్ప మరి ఎవరు లేరని మీరు తెలుసుకునేలా ఇవన్నీ మీకు చూపబడ్డాయి. 36మిమ్మల్ని క్రమపరచడానికి ఆకాశం నుండి తన స్వరాన్ని మీకు వినిపించారు. భూమి మీద మీకు తన గొప్ప అగ్నిని చూపించారు, ఆ అగ్ని మధ్యలో నుండి ఆయన మాటలు మీరు విన్నారు. 37-38ఆయన మీ పూర్వికులను ప్రేమించి వారి సంతతిని ఎంపిక చేసుకున్నారు కాబట్టి, మీకంటే బలమైన గొప్ప దేశాలను మీ ఎదుట నుండి వెళ్లగొట్టి, వారి దేశంలోనికి మిమ్మల్ని తీసుకువచ్చి, ఈ రోజు ఇస్తున్నట్లుగా వారి దేశాన్ని మీకు స్వాస్థ్యంగా ఇవ్వడానికి ఆయన తన సన్నిధితో, తన మహాబలంతో మిమ్మల్ని ఈజిప్టు నుండి బయటకు రప్పించారు.
39కాబట్టి పైనున్న పరలోకంలో గాని, క్రిందున్న భూమిమీద గాని, యెహోవాయే దేవుడని, మరొక దేవుడు లేడని ఈ రోజే మీరు గుర్తించి, మీ హృదయాల్లో జ్ఞాపకం ఉంచుకోండి. 40మీకు, మీ తర్వాత మీ సంతతివారికి క్షేమం కలగడానికి యెహోవా శాశ్వతంగా మీకు ఇస్తున్న దేశంలో మీరు అధిక కాలం జీవించేలా ఈ రోజు నేను మీకు ఇస్తున్న శాసనాలను ఆజ్ఞలను పాటించండి.
ఆశ్రయ పట్టణాలు
41తర్వాత మోషే యొర్దానుకు తూర్పు వైపు ఉన్న మూడు పట్టణాలను ప్రత్యేకంగా ఉంచాడు. 42ఒక వ్యక్తిని చంపిన ఎవరైనా ఏ దురుద్దేశం లేకుండా పొరుగువారిని చంపినట్లయితే పారిపోవచ్చు. వారు ఈ పట్టణాల్లో ఒక దానికి పారిపోయి తమ ప్రాణాలను కాపాడుకోవచ్చు. 43ఆ పట్టణాలు ఇవి: రూబేనీయులకు అరణ్య పీఠభూమిలో ఉన్న బేసెరు; గాదీయులకు గిలాదులో ఉన్న రామోతు; మనష్షీయులకు బాషానులో ఉన్న గోలాను.
ధర్మశాస్త్ర పరిచయము
44మోషే ఇశ్రాయేలీయులకు ఇచ్చిన ధర్మశాస్త్రం ఇది. 45-46ఈ నిబంధనలు శాసనాలు చట్టాలు, ఇశ్రాయేలీయులు ఈజిప్టులో నుండి బయటకు వచ్చినప్పుడు యొర్దాను తూర్పున బేత్-పెయోరుకు ఎదురుగా ఉన్న లోయలో హెష్బోనులో పరిపాలించి, మోషే, ఇశ్రాయేలీయుల చేతిలో ఓడిపోయిన అమోరీయుల రాజైన సీహోను దేశంలో వారికి ఇవ్వబడినవి. 47యొర్దానుకు తూర్పున ఉన్న అతని దేశాన్ని, బాషాను రాజైన ఓగు దేశాన్ని, ఈ ఇద్దరు అమోరీయుల రాజుల దేశాలను వారు స్వాధీనం చేసుకున్నారు. 48ఆ దేశం అర్నోను వాగు లోయ ఒడ్డున ఉన్న అరోయేరు నుండి హెర్మోను అనే సీయోను#4:48 కొ.ప్రా.ప్ర.లో సిరియోను కొండ వరకు, 49యొర్దాను తూర్పున ఉన్న అరాబా ప్రాంతమంతా, పిస్గా కొండచరియల దిగువగా ఉప్పు సముద్రం#4:49 హెబ్రీలో అరాబా సముద్రం, అంటే, మృత సముద్రం వరకు ఉంది.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

ద్వితీయో 4: TSA

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి