ద్వితీయో 7

7
ఇతర జనాంగాలను వెళ్లగొట్టుట
1మీరు స్వాధీనం చేసుకోబోయే దేశంలోనికి మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని తీసుకువచ్చి, మీ ఎదుట నుండి అనేక జనాంగాలను అనగా మీకన్నా విస్తారమైన, బలమైన ఏడు జనాంగాలను హిత్తీయులు, గిర్గాషీయులు, అమోరీయులు, కనానీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, యెబూసీయులను వెళ్లగొట్టి, 2మీ దేవుడైన యెహోవా వారిని మీకు అప్పగించగా, మీరు వారిని ఓడించినప్పుడు, వారిని పూర్తిగా నాశనం చేయాలి. వారితో సంధి చేసుకోకూడదు వారిని కరుణించకూడదు. 3వారితో పెళ్ళి సంబంధాలు పెట్టుకోవద్దు. వారి కుమారులకు మీ కుమార్తెలను ఇవ్వకూడదు, మీ కుమారులకు వారి కుమార్తెలను పుచ్చుకోకూడదు, 4ఎందుకంటే వారు నన్ను అనుసరించకుండా ఇతర దేవుళ్ళను సేవించేలా మీ పిల్లలను త్రిప్పివేస్తారు, అప్పుడు యెహోవా కోపం మీమీద రగులుకొని మిమ్మల్ని త్వరగా నాశనం చేస్తుంది. 5మీరు వారికి ఇలా చేయాలి: వారి బలిపీఠాలను పడగొట్టండి, వారి పవిత్ర రాళ్లను పగులగొట్టండి, వారి అషేరా స్తంభాలను#7:5 అంటే, అషేరా దేవత యొక్క కర్ర చిహ్నాలు ముక్కలు చేయండి, వారి విగ్రహాలను అగ్నితో కాల్చివేయండి. 6ఎందుకంటే, మీరు మీ దేవుడైన యెహోవాకు పరిశుద్ధ ప్రజలు. ఈ భూమి మీద ప్రజలందరిలో నుండి మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని తన సొంత ప్రజలుగా, విలువైన ఆస్తిగా ఎన్నుకున్నారు.
7మీరు ఇతర జనాంగాల కంటే ఎక్కువగా ఉన్నారని కాదు జనాంగాలన్నిటిలో మీరే తక్కువగా ఉన్నారని యెహోవా మిమ్మల్ని ప్రేమించి ఏర్పరచుకున్నారు. 8అయితే యెహోవా మిమ్మల్ని ప్రేమించారు కాబట్టి, మీ పూర్వికులతో చేసిన ప్రమాణం నెరవేర్చారు కాబట్టి, తన బలమైన హస్తంతో మిమ్మల్ని బయటకు తీసుకువచ్చి బానిస దేశం నుండి, ఈజిప్టు రాజైన ఫరో శక్తి నుండి మిమ్మల్ని విడిపించారు. 9కాబట్టి మీ దేవుడైన యెహోవాయే దేవుడని తెలుసుకోండి; ఆయన నమ్మదగిన దేవుడు, తనను ప్రేమిస్తూ, తన ఆజ్ఞలను పాటించే వారికి, ఆయన వెయ్యి తరాల వరకు తన నిబంధన స్థిరపరిచేవారు. 10అయితే,
తనను ద్వేషించేవారిని నేరుగా నాశనం చేస్తారు;
ఆలస్యం చేయకుండా నేరుగా వారికి ప్రతిఫలం చెల్లిస్తారు.
11కాబట్టి ఈ రోజు నేను మీకు ఆజ్ఞాపిస్తున్న ఆజ్ఞలు, శాసనాలు, చట్టాలను జాగ్రత్తగా అనుసరించండి.
12మీరు ఈ చట్టాలను శ్రద్ధగా విని వాటిని జాగ్రత్తగా అనుసరిస్తే, మీ దేవుడైన యెహోవా మీ పూర్వికులకు ప్రమాణం చేసినట్లుగా, మీతో తన ప్రేమ నిబంధనను కొనసాగిస్తారు. 13ఆయన మిమ్మల్ని ప్రేమించి దీవించి అభివృద్ధి కలుగజేస్తారు. మీకు ఇస్తానని మీ పూర్వికులకు ప్రమాణం చేసిన దేశంలో, మీ గర్భఫలాన్ని, మీ భూఫలమైన మీ ధాన్యం, క్రొత్త ద్రాక్షరసం, ఒలీవనూనె, పశువుల దూడలను, మందల గొర్రెపిల్లలను దీవిస్తారు. 14ఇతర ప్రజలకన్నా అధికంగా మీరు ఆశీర్వదించబడతారు; మీలో పురుషులలో కాని స్త్రీలలో కాని సంతానలేమి ఉండదు, మీ పశువుల్లో కూడా ఉండదు. 15యెహోవా మిమ్మల్ని ప్రతీ వ్యాధి నుండి కాపాడతారు. ఈజిప్టులో మీకు తెలిసిన భయంకరమైన రోగాల మీ మీదికి రాకుండా చేస్తారు, కాని మిమ్మల్ని ద్వేషించే వారందరి మీదికి వాటిని రప్పిస్తారు. 16మీ దేవుడైన యెహోవా మీకు అప్పగించే ప్రజలందరినీ పూర్తిగా నాశనం చేయాలి. వారి మీద దయ చూపించకూడదు, వారి దేవుళ్ళను సేవించకూడదు, ఎందుకంటే అది మీకు ఉరిగా బిగుసుకుంటుంది.
17“ఈ జనాంగాలు మా కన్నా బలవంతులు. మేము వారినెలా వెళ్లగొట్టగలము?” అని మీలో మీరు అనుకోవచ్చు. 18అయితే వారికి భయపడకండి; మీ దేవుడైన యెహోవా ఫరోకు, ఈజిప్టు దేశమంతటికి చేసింది జాగ్రతగా జ్ఞాపకం చేసుకోండి. 19గొప్ప శోధనలు, సూచకక్రియలు, అద్భుతాలు, బలమైన హస్తం చాచిన చేతితో మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని బయటకు తీసుకురావడం మీ కళ్లతో మీరే చూశారు. మీరు భయపడుతున్న ప్రజలందరికి మీ దేవుడైన యెహోవా అలాగే చేస్తారు. 20అంతేకాక, మీకు కనబడకుండా దాక్కున్న మిగిలినవారంతా నశించే వరకు, మీ దేవుడైన యెహోవా వారి మీదికి పెద్ద కందిరీగలను పంపుతారు. 21మీరు వారికి భయపడకండి, ఎందుకంటే మీ మధ్య ఉన్న మీ దేవుడైన యెహోవా గొప్పవాడు, అద్భుత దేవుడు 22మీ దేవుడైన యెహోవా ఆ జనాంగాలను మీ ఎదుట నుండి కొద్దికొద్దిగా తొలగిస్తారు. అడవి జంతువులు ఎక్కువయ్యే ప్రమాదం ఉంది కాబట్టి మీరు ఒకేసారి వారందరిని నాశనం చేయడానికి అనుమతి లేదు. 23అయితే మీ దేవుడైన యెహోవా వారిని మీ చేతికి అప్పగించి, వారు నాశనం చేయబడేవరకు, వారికి గొప్ప కలవరాన్ని పుట్టిస్తారు. 24ఆయన వారి రాజులను మీ చేతికి అప్పగిస్తారు. మీరు వారి పేర్లను ఆకాశం క్రిందనుండి తుడిచివేస్తారు. మీకు విరోధంగా ఎవరు నిలువలేరు; మీరు వారిని నాశనం చేస్తారు. 25మీరు వారి దేవుళ్ళ విగ్రహాలను అగ్నిలో కాల్చివేయాలి. వాటి మీది వెండి బంగారాలను ఆశించి, మీ కోసం తీసుకోకూడదు, లేకపోతే దాని వలన మీరు చిక్కులో పడతారు. మీ దేవుడైన యెహోవాకు అది అసహ్యము. 26అసహ్యమైన వాటిని మీరు ఇంటికి తీసుకురాకూడదు, లేదా మీరు, దానివలె నాశనానికి మీరు వేరు చేయబడతారు. అది నాశనం కోసం వేరు చేయబడుతుంది కాబట్టి దానిని నీచమైనదిగా చూసి పూర్తిగా అసహ్యించుకోవాలి.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

ద్వితీయో 7: TSA

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి