ఎఫెసీ పత్రిక 5

5
1కాబట్టి మీరు దేవుని ప్రియ పిల్లల్లా ఆయనను పోలి నడుచుకోండి. 2క్రీస్తు మనల్ని ప్రేమించి, పరిమళ సువాసనగా మన కోసం తనను తాను దేవునికి అర్పణగా బలిగా అర్పించుకొన్నట్లే మీరు కూడా ప్రేమ కలిగి నడుచుకోండి.
3లైంగిక అపవిత్రత గాని లేదా ఇతర అపవిత్రత గాని అత్యాశ గాని మీ మధ్యలో ఎంత మాత్రం ఉండకూడదు, ఎందుకంటే ఇవి దేవుని పరిశుద్ధ ప్రజలకు తగినవి కావు. 4దేవుని పట్ల కృతజ్ఞతగల మాటలనే మాట్లాడండి, మీలో బూతు మాటలకు, మూర్ఖపు లేదా పోకిరి మాటలకు చోటు ఉండకూడదు. 5వ్యభిచారులు, అపవిత్రులు, అత్యాశపడేవారు అందరు విగ్రహారాధికులే; దేవునికి క్రీస్తుకు చెందిన రాజ్యంలో వారికి వారసత్వం లేదని మీకు ఖచ్చితంగా తెలుసు. 6వ్యర్థమైన మాటలతో ఎవరు మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోండి, ఎందుకంటే వీటిని బట్టి అవిధేయులైనవారి మీదికి దేవుని ఉగ్రత వస్తుంది. 7కాబట్టి అలాంటి వారితో మీరు భాగస్వాములుగా ఉండకండి.
8ఒకప్పుడు మీరు చీకటియై ఉన్నారు, కానీ ఇప్పుడు ప్రభువులో మీరు వెలుగై ఉన్నారు. కాబట్టి వెలుగు బిడ్డలుగా జీవించండి, 9ఎందుకంటే వెలుగు ఫలం సమస్త మంచితనాన్ని, నీతిని, సత్యాన్ని కలిగి ఉంటుంది. 10కాబట్టి ప్రభువుకు ఇష్టమైనది ఏదో తెలుసుకోండి. 11నిష్ఫలమైన చీకటి క్రియలలో పాల్గొనకుండా వాటిని బట్టబయలు చేయండి. 12అవిధేయులు రహస్యంగా చేసిన వాటిని గురించి మాట్లాడడం కూడా అవమానమే. 13కాని వెలుగుచేత చూపించబడే ప్రతిదీ స్పష్టంగా ఉంటుంది, ప్రకాశించే ప్రతిదీ వెలుగు అవుతుంది. 14అందుకే వాక్యంలో,
“నిద్రిస్తున్నవాడా, మేల్కో,
మృతులలో నుండి లే,
క్రీస్తు నీ మీద ప్రకాశిస్తారు”
అని వ్రాయబడింది.
15చాలా జాగ్రత్తగా ఉండండి, అజ్ఞానుల్లా కాకుండా జ్ఞానుల్లా జీవించండి. 16దినాలు చెడ్డవి కాబట్టి ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. 17కాబట్టి మీరు అవివేకులుగా ఉండకండి, అయితే ప్రభువు చిత్తమేమిటో గ్రహించుకోండి. 18మద్యంతో మత్తులు కాకండి, అది మిమ్మల్ని దుష్టత్వంలోనికి నడిపిస్తుంది. అయితే ఆత్మ పూర్ణులై ఉండండి, 19సంగీతములతో, కీర్తనలతో ఆత్మ సంబంధమైన పాటలతో, ఒకరితో ఒకరు మాట్లాడుకోండి. మీ హృదయాలతో పాటలు పాడుతూ సంగీతంతో ప్రభువును గురించి కీర్తిస్తూ, 20ఎల్లప్పుడు మన ప్రభువైన యేసు క్రీస్తు పేరట మన తండ్రియైన దేవునికి అన్నిటి కోసం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉండండి.
క్రైస్తవ కుటుంబాలకు సూచనలు
21క్రీస్తుపట్ల గల భయభక్తులతో ఒకరికి ఒకరు లోబడి ఉండండి.
22భార్యలారా, ప్రభువుకు లోబడి ఉన్నట్లే మీ సొంత భర్తలకు లోబడి ఉండండి. 23క్రీస్తు సంఘానికి శిరస్సై ఉన్నట్లుగా భర్త భార్యకు శిరస్సై ఉన్నాడు. ఆయన శిరస్సుగా తన శరీరానికి రక్షకుడై ఉన్నారు. 24సంఘం క్రీస్తుకు లోబడినట్లుగా భార్యలు కూడా ప్రతి విషయంలో తమ భర్తలకు లోబడాలి.
25క్రీస్తు కూడా సంఘాన్ని ప్రేమించి దాని కోసం తనను తాను అప్పగించుకున్నట్లుగా, భర్తలారా మీ భార్యలను ప్రేమించండి. 26క్రీస్తు ప్రేమ తన సంఘాన్ని వాక్యమనే నీళ్ల స్నానంతో శుద్ధి చేసి, పవిత్రపరచడానికి, 27దాన్ని కళంకంగానీ, మడతలుగానీ అలాంటిది మరేది లేకుండా పరిశుద్ధంగా, నిర్దోషంగా మహిమ కలదిగా తన ముందు నిలబెట్టుకోవాలని, దాని కోసం తనను తాను సమర్పించుకున్నారు. 28అదే విధంగా భర్తలు తమ సొంత శరీరాన్ని ప్రేమించినట్లే తమ భార్యలను ప్రేమించాలి. తన భార్యను ప్రేమించేవాడు తనను తాను ప్రేమించుకుంటున్నాడు. 29ఎవరూ కూడా తన సొంత శరీరాన్ని ద్వేషించరు, ప్రతివారు దానిని పోషించి, కాపాడుకుంటారు, అదే విధంగా క్రీస్తు సంఘాన్ని పోషించి కాపాడుతున్నారు. 30ఎందుకంటే మనం ఆయన శరీరం యొక్క అవయవాలమై ఉన్నాము. 31“ఈ కారణంచేత పురుషుడు తన తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకుంటాడు. వారిద్దరు ఏకశరీరం అవుతారు.”#5:31 ఆది 2:24 32ఇది లోతైన మర్మం; అయితే నేను క్రీస్తు సంఘం గురించి చెప్తున్నాను. 33చివరిగా నేను చెప్పేది ఏంటంటే, మీలో ప్రతీ పురుషుడు తనను తాను ప్రేమించుకొన్నట్లు తన భార్యను ప్రేమించాలి, అలాగే భార్య తన భర్తను గౌరవించాలి.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

ఎఫెసీ పత్రిక 5: TSA

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి