ఎస్తేరు 7
7
హామాను వ్రేలాడదీయబడుట
1కాబట్టి రాజు హామాను ఇద్దరూ కలిసి, ఎస్తేరు రాణి యొక్క విందుకు వెళ్లారు. 2వారు రెండవ రోజు ద్రాక్షరసం త్రాగుతుండగా రాజు మరలా, “ఎస్తేరు రాణి, నీ విన్నపం ఏంటి? అది నీకు ఇస్తాను. నీ మనవి ఏంటి? రాజ్యంలో సగమైనా సరే, నీకు ఇవ్వబడుతుంది” అని అన్నాడు.
3అప్పుడు ఎస్తేరు రాణి, “ఒకవేళ రాజుకు నా మీద దయ కలిగితే మీకు సరే అనిపిస్తే, నా విన్నపాన్ని బట్టి నా ప్రాణాన్ని, నా మనవిని బట్టి నా ప్రజలను వదిలేయండి. 4ఎందుకంటే నేను, నా ప్రజలు నాశనం చేయబడడానికి, చంపబడడానికి, నిర్మూలించబడడానికి అమ్మబడ్డాము. ఒకవేళ మేము కేవలం దాసదాసీలుగా అమ్మబడి ఉంటే, నేను మౌనంగా ఉండేదాన్ని, ఎందుకంటే అలాంటి బాధ కోసం రాజును అభ్యంతర పెట్టడం భావ్యం కాదు” అని అన్నది.
5అందుకు రాజైన అహష్వేరోషు ఎస్తేరు రాణిని, “అలా చేయడానికి తెగించినవాడు ఎవడు? వాడెక్కడ?” అని అడిగాడు.
6అందుకు ఎస్తేరు అన్నది, “ఆ విరోధి, శత్రువు, ఈ దుష్టుడైన హామానే!”
అప్పుడు హామాను, రాజు రాణి ముందు భయంతో వణికిపోయాడు. 7రాజు ఆవేశంతో లేచి, ద్రాక్షరసం వదిలి రాజభవన తోటలోకి వెళ్లాడు. అయితే రాజు తనకు హాని చేయాలని నిర్ణయించాడని గ్రహించిన హామాను తన ప్రాణాల కోసం ఎస్తేరు రాణిని బ్రతిమాలడానికి అక్కడే ఉండిపోయాడు.
8తోటలో నుండి రాజు విందుశాలకు వచ్చాడు, ఆ సమయంలో హామాను ఎస్తేరు రాణి కూర్చున్న మంచం పైన పడి ఉండడం చూశాడు.
రాజు ఆవేశంతో, “ఇంట్లో రాణి నాతో ఉండగానే వీడు రాణి మీద అత్యాచారం చేస్తాడా?” అని అన్నాడు.
రాజు నోటి నుండి ఆ మాట రావడంతోనే సైనికులు హామాను ముఖానికి ముసుగు వేశారు. 9రాజు సేవచేసే నపుంసకులలో హర్బోనా అనే ఒకడు, “నిజానికి, రాజు తరపున మాట్లాడిన మొర్దెకైని చంపించడానికి హామాను తన ఇంటి వద్ద యాభై మూరల#7:9 అంటే, సుమారు 23 మీటర్లు ఒక ఉరికంబాన్ని చేయించాడు” అని చెప్పాడు.
వెంటనే రాజు, “దానిమీదే అతన్ని ఉరితీయండి” అని అన్నాడు. 10మొర్దెకై కోసం హామాను చేయించిన ఉరికంబం మీద హామానును ఉరితీశారు. అప్పుడు రాజు కోపం చల్లారింది.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
ఎస్తేరు 7: TSA
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
Telugu Contemporary Version, Holy Bible
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Used with permission. All rights reserved worldwide.