నిర్గమ 18

18
యెత్రో మోషేను దర్శించడం
1కొంతకాలం గడిచిన తర్వాత మిద్యాను యాజకుడు, మోషేకు మామయైన యెత్రో, దేవుడు మోషేకు అతని ప్రజలైన ఇశ్రాయేలీయులకు చేసినదంతటిని గురించి, యెహోవా ఇశ్రాయేలీయులను ఈజిప్టు నుండి బయటకు రప్పించిన సంగతి విన్నాడు.
2మోషే తన భార్య సిప్పోరాను పంపిన తర్వాత, అతని మామ యెత్రో ఆమెను చేర్చుకున్నాడు. 3మోషే, “నేను పరాయి దేశంలో విదేశీయునిగా ఉన్నాను” అని చెప్పి ఒక కుమారునికి గెర్షోము అని పేరు పెట్టాడు; 4మరొకనికి, “నా తండ్రి దేవుడు నాకు సహాయకుడు; ఫరో ఖడ్గం నుండి ఆయన నన్ను రక్షించారు” అని చెప్పి ఎలీయెజెరు#18:4 ఎలీయెజెరు అంటే నా దేవుడు సహాయకుడు. అని పేరు పెట్టాడు.
5మోషే మామయైన యెత్రో మోషే కుమారులను అతని భార్యను తీసుకుని అరణ్యంలో దేవుని పర్వతం దగ్గర బస చేస్తున్న మోషే దగ్గరకు వచ్చాడు. 6“నీ మామనైన యెత్రో అనే నేను, నీ భార్యను నీ ఇద్దరు కుమారులను తీసుకుని నీ దగ్గరకు వస్తున్నాను” అని యెత్రో మోషేకు కబురు పంపాడు.
7కాబట్టి మోషే తన మామను ఎదుర్కోడానికి వెళ్లి నమస్కరించి అతన్ని ముద్దు పెట్టుకున్నాడు. వారు ఒకరి క్షేమాన్ని ఒకరు తెలుసుకొని గుడారంలోకి వెళ్లారు. 8అప్పుడు యెహోవా ఇశ్రాయేలీయుల కోసం ఫరోకు ఈజిప్టువారికి చేసిన దాని గురించి, దారిలో తమకు ఎదురైన కష్టాల గురించి, యెహోవా తమను కాపాడిన విధానం గురించి మోషే తన మామకు వివరించాడు.
9ఈజిప్టువారి చేతిలో నుండి ఇశ్రాయేలీయులను విడిపించడానికి యెహోవా చేసిన మేలులన్నిటిని విని యెత్రో ఎంతో సంతోషించాడు. 10అప్పుడు యెత్రో, “ఈజిప్టువారి చేతిలో నుండి ఫరో చేతిలో నుండి మిమ్మల్ని విడిపించి ఈజిప్టువారి చేతి క్రిందనుండి ఈ ప్రజలను విడిపించిన యెహోవా స్తుతించబడును గాక. 11ఇశ్రాయేలీయుల పట్ల అహంకారంగా ప్రవర్తించిన వారికి ఆయన చేసిన దానిని బట్టి ఇతర దేవుళ్ళందరికంటే యెహోవాయే గొప్పవాడని నేనిప్పుడు తెలుసుకున్నాను” అన్నాడు. 12అప్పుడు మోషే మామయైన యెత్రో, ఒక దహనబలిని ఇతర బలులను దేవునికి అర్పించగా, దేవుని సన్నిధిలో మోషే మామతో కలిసి భోజనం తినడానికి అహరోను, ఇశ్రాయేలీయుల పెద్దలందరితో కలిసి వచ్చాడు.
13మర్నాడు మోషే ప్రజలకు న్యాయం తీర్చడానికి తన స్థానంలో కూర్చున్నాడు, వారు ఉదయం నుండి సాయంత్రం వరకు అతని చుట్టూ నిలబడ్డారు. 14మోషే ప్రజలకు చేస్తున్న వాటన్నిటిని అతని మామ చూసినప్పుడు, అతడు, “నీవు ఈ ప్రజలకు చేస్తున్నది ఏమిటి? ఉదయం నుండి సాయంత్రం వరకు ఈ ప్రజలందరు నీ చుట్టూ నిలబడి ఉండగా, న్యాయాధిపతిగా నీవు ఒక్కడివే ఎందుకు కూర్చున్నావు?” అని అడిగాడు.
15అందుకు మోషే అతనితో, “ఎందుకంటే దేవుని చిత్తాన్ని తెలుసుకోవడానికి ప్రజలు నా దగ్గరకు వస్తారు. 16వారికెప్పుడు ఏ వివాదం ఉన్నా, అది నా దగ్గరకు తేబడుతుంది, నేను వారి మధ్య నిర్ణయించిన దేవుని శాసనాలను, సూచనలను వారికి తెలియజేస్తాను” అని చెప్పాడు.
17అందుకు మోషే మామ, “నీవు చేస్తున్నది సరియైనది కాదు. 18నీవు, నీ దగ్గరకు వస్తున్న ఈ ప్రజలు అలసిపోతారు. ఈ పని నీకు చాలా భారంగా ఉంది; నీవు ఒక్కడివే దీనిని చేయలేవు. 19ఇప్పుడు నా మాట విను, నేను నీకొక సలహా ఇస్తాను, దేవుడు నీకు తోడుగా ఉండును గాక. నీవు దేవుని ఎదుట ప్రజల ప్రతినిధిగా ఉండి, వారి వివాదాలను ఆయన దగ్గరకు తీసుకురావాలి. 20ఆయన శాసనాలను సూచనలను నీవు వారికి బోధించి, వారు జీవించాల్సిన మార్గాన్ని వారికి చూపించు. 21దేవునికి భయపడే, అన్యాయపు లాభాన్ని అసహ్యించుకునే, నమ్మదగిన సామర్థ్యం కలిగిన పురుషులను ప్రజలందరిలో నుండి ఎంపికచేయాలి. తర్వాత వారిని వేయిమందికి, వందమందికి, యాభైమందికి, పదిమందికి ఒక అధికారి ప్రకారం అధికారులుగా నియమించాలి. 22వారు అన్ని వేళలా ప్రజలకు న్యాయాధిపతులుగా ఉండాలి, కాని ప్రతీ కఠిన సమస్యను నీ దగ్గరకు తీసుకువచ్చేలా చూడు, మామూలు సమస్యల విషయంలో వారే నిర్ణయించవచ్చు. ఈ విధంగా చేస్తే వారు నీతో పాటు నీ భారాన్ని పంచుకుంటారు, కాబట్టి నీకు భారం తగ్గుతుంది. 23ఒకవేళ నీవు ఇలా చేస్తే, దేవుడు అలాగే ఆజ్ఞాపిస్తే, నీవు ఈ ఒత్తిడిని తట్టుకోగలుగుతావు, అలాగే ఈ ప్రజలందరు కూడా సమాధానంగా తమ ఇళ్ళకు వెళ్తారు” అని అన్నాడు.
24మోషే తన మామ చెప్పిన సలహా విని అతడు చెప్పినట్లే చేశాడు. 25అతడు ఇశ్రాయేలీయులందరిలో సమర్థవంతులైన వారిని ఎంపికచేసి వారిని ప్రజల మీద అధికారులుగా, వేయిమందికి, వందమందికి, యాభైమందికి, పదిమందికి ఒక అధికారి ప్రకారం అధికారులుగా నియమించాడు. 26వారు అన్ని వేళలా ప్రజలకు న్యాయాధిపతులుగా సేవ చేశారు. కఠిన సమస్యలను వారు మోషే దగ్గరకు తీసుకువచ్చేవారు, కాని మామూలు వాటి విషయంలో వారే నిర్ణయించేవారు.
27తర్వాత మోషే తన మామను అతని మార్గంలో పంపించాడు, యెత్రో తిరిగి తన స్వదేశానికి వెళ్లాడు.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

నిర్గమ 18: TSA

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి