యెహెజ్కేలు 29
29
ఈజిప్టుపై దేవుని తీర్పు
ఫరో మీద తీర్పు
1పదవ సంవత్సరం పదవనెల పన్నెండవ రోజు యెహోవా వాక్కు నాకు వచ్చి: 2“మనుష్యకుమారుడా, నీ ముఖాన్ని ఈజిప్టు రాజైన ఫరోవైపు త్రిప్పి అతని గురించి ఈజిప్టు దేశమంతటి గురించి ప్రవచించి ఇలా చెప్పు: 3‘ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు:
“ ‘ఈజిప్టు రాజైన ఫరో, నైలు నదిలో పడుకుని ఉన్న ఘటసర్పమా,
నేను నీకు విరోధిని.
“నైలు నది నాదే,
నేనే దాన్ని చేశానని నీవు అంటావు.”
4కాని నేను నీ దవడలకు గాలాలు తగిలించి,
నీ నదులలో ఉన్న చేపలు నీ పొలుసులకు అంటుకుపోయేలా చేస్తాను.
నీ పొలుసులకు అంటుకున్న చేపలతో పాటు
నైలు నదిలో నుండి నిన్ను బయటకు లాగుతాను.
5నిన్ను నీ నదులలోని చేపలన్నిటిని
నేను అరణ్యంలో విడిచిపెడతాను.
నీవు నేల మీద పడతావు
నిన్ను ఎత్తేవారు గాని, తీసేవారు గాని ఉండరు.
అడవి మృగాలకు ఆకాశపక్షులకు
నిన్ను ఆహారంగా ఇస్తాను.
6అప్పుడు నేనే యెహోవానని ఈజిప్టు నివాసులందరూ తెలుసుకుంటారు.
“ ‘ఈజిప్టు ఇశ్రాయేలీయులకు రెల్లుపుల్లల్లాంటి చేతికర్ర అయ్యింది. 7వారు నిన్ను చేతితో పట్టుకున్నప్పుడు నీవు విరిగిపోయి వారి భుజాలలో గుచ్చుకున్నావు; వారు నీ మీద ఆనుకున్నప్పుడు నీవు విరిగిపోయి వారి నడుములు విరిగిపోవడానికి కారణమయ్యావు.
8“ ‘ప్రభువైన యెహోవా చెబుతున్న మాట ఇదే: నేను నీ మీదికి కత్తిని రప్పిస్తాను. అది మనుష్యులను పశువులను చంపుతుంది. 9ఈజిప్టు దేశం నిర్మానుష్యమై పాడైపోతుంది. అప్పుడు నేనే యెహోవానని వారు తెలుసుకుంటారు.
“ ‘నైలు నది నాది నేనే దానిని చేశానని నీవు అన్నావు కాబట్టి, 10నేను నీకు నీ నదికి విరోధిని అయ్యాను. ఈజిప్టు దేశాన్ని మిగ్దోలు నుండి సైనే వరకు కూషు#29:10 అంటే, నైలు ఉపరితల ప్రాంతం సరిహద్దు వరకు పూర్తిగా పాడుచేసి ఎడారిగా చేస్తాను. 11దానిలో మనుష్యులు నడవరు పశువులు తిరగరు. నలభై సంవత్సరాలు దానిలో ఎవరూ నివసించరు. 12నిర్మానుష్యమైన దేశాల మధ్య ఈజిప్టు దేశం పాడైపోతుంది. శిథిలమై పోయిన పట్టణాల మధ్య దాని పట్టణాలు నలభై సంవత్సరాలు పాడైపోయి ఉంటాయి. ఈజిప్టువారిని ఇతర ప్రజలమధ్య చెదరగొడతాను. వారిని ఆయా దేశాలకు వెళ్లగొడతాను.
13“ ‘అయినా ప్రభువైన యెహోవా చెబుతున్న మాట ఇదే: నలభై సంవత్సరాలు గడిచిన తర్వాత ఇతర ప్రజలమధ్య చెదరిపోయిన ఈజిప్టువారిని నేను సమకూరుస్తాను. 14బందీ నుండి వారిని తీసుకువచ్చి దక్షిణ ఈజిప్టులోని పత్రూసు అనేవారి పూర్వికుల దేశానికి వారిని రప్పిస్తాను. అక్కడ వారు ఒక అల్పమైన రాజ్యంగా ఏర్పడతారు. 15రాజ్యాలన్నిటిలో అది అల్పమైన రాజ్యంగా ఉంటుంది. వారు ఇకపై ఇతర రాజ్యాల మీద ఆధిపత్యం చెలాయించకుండ నేను వారిని అణచివేస్తాను. 16ఇశ్రాయేలీయులకు ధైర్యం కలిగించేదిగా ఈజిప్టు ఉండదు కాని సహాయం కోసం ఈజిప్టు వైపు తిరిగి తాము చేసిన పాపాన్ని ఇశ్రాయేలీయులు గుర్తుచేసుకుంటారు. అప్పుడు నేనే ప్రభువైన యెహోవానని వారు తెలుసుకుంటారు.’ ”
నెబుకద్నెజరు ప్రతిఫలం
17ఇరవై ఏడవ సంవత్సరం మొదటి నెల మొదటి రోజున యెహోవా వాక్కు నా దగ్గరకు వచ్చింది: 18“మనుష్యకుమారుడా, తూరు పట్టణం మీద బబులోను రాజైన నెబుకద్నెజరు తన సైన్యంతో దండెత్తి చాలా బాధాకరమైన పని చేయించాడు. వారందరి తలలు బోడివయ్యాయి. అందరి భుజాలు కొట్టుకుపోయాయి. అయినా తూరు పట్టణం మీదికి అతడు తెచ్చిన నష్టాన్ని బట్టి అతనికి అతని సైన్యానికి ప్రతిఫలం కూడా దొరకలేదు. 19కాబట్టి ప్రభువైన యెహోవా చెబుతున్న మాట ఇదే: ఈజిప్టు దేశాన్ని బబులోను రాజైన నెబుకద్నెజరుకు నేను అప్పగిస్తున్నాను. అతడు దాని ఆస్తిని తీసుకుని దాని సొమ్మును దోచుకొని కొల్లగొడతాడు. అదే అతని సైన్యానికి జీతం అవుతుంది. 20అతడు అతని సైన్యం నా కోసమే శ్రమించారు కాబట్టి అతడు చేసిన దానికి ప్రతిఫలంగా బహుమానంగా ఈజిప్టు దేశాన్ని అతనికి అప్పగించాను. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.
21“ఆ రోజున నేను ఇశ్రాయేలీయుల కొమ్ము#29:21 కొమ్ము ఇక్కడ బలాన్ని సూచిస్తుంది చిగిర్చేలా చేస్తాను. వారి మధ్య మాట్లాడటానికి నీకు ధైర్యాన్ని ఇస్తాను. అప్పుడు నేనే యెహోవానని వారు తెలుసుకుంటారు.”
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
యెహెజ్కేలు 29: TSA
హైలైట్
షేర్ చేయి
కాపీ
![None](/_next/image?url=https%3A%2F%2Fimageproxy.youversionapistaging.com%2F58%2Fhttps%3A%2F%2Fweb-assets.youversion.com%2Fapp-icons%2Fte.png&w=128&q=75)
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
Telugu Contemporary Version, Holy Bible
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Used with permission. All rights reserved worldwide.