యెహెజ్కేలు 33

33
కావలివానిగా యెహెజ్కేలు పిలుపు పునరుద్ధరణ
1యెహోవా వాక్కు నా వద్దకు వచ్చింది: 2“మనుష్యకుమారుడా, నీ ప్రజలతో మాట్లాడి వారితో ఇలా చెప్పు: ‘నేను ఒక దేశం మీదికి ఖడ్గాన్ని రప్పించగా ఆ ప్రజలు తమలో ఒకరిని ఎంచుకుని అతన్ని తమ కావలివానిగా పెట్టుకుంటారు. 3అతడు దేశం మీదికి ఖడ్గం రావడం చూసి ప్రజలను హెచ్చరించడానికి బూర ఊదుతాడు, 4అప్పుడు ఒకవేళ ఎవరైనా బూర శబ్దం విని కూడా జాగ్రత్త పడకపోతే ఆ ఖడ్గం వచ్చి వారి ప్రాణాన్ని తీస్తుంది, వారి చావుకు వారే బాధ్యులు. 5వారు బూర శబ్దం విని కూడా ఆ హెచ్చరికను పట్టించుకోలేదు, కాబట్టి వారి చావుకు వారే బాధ్యులు. ఒకవేళ వారు ఆ హెచ్చరికకు జాగ్రత్తపడి ఉంటే, వారు తమ ప్రాణాలను కాపాడుకునేవారు. 6అయితే ఒకవేళ కావలివాడు దేశం మీదికి ఖడ్గం రావడం చూసి కూడా ప్రజలను హెచ్చరించడానికి బూర ఊదకపోతే, ఖడ్గం వచ్చి ఎవరినైనా చంపితే, చనిపోయినవారు తమ పాపాల కారణంగా చనిపోయినప్పటికి, నేను ఆ కావలివాన్ని బాధ్యున్ని చేస్తాను.’
7“మనుష్యకుమారుడా, నేను నిన్ను ఇశ్రాయేలీయులకు కావలివానిగా నియమించాను; కాబట్టి నేను చెప్పే మాట విని నా తరపున వారిని హెచ్చరించు. 8నేను దుర్మార్గునితో, ‘దుర్మార్గుడా, నీవు తప్పక చస్తావు’ అని చెప్పినప్పుడు, వారి మార్గాలను విడిచిపెట్టమని నీవు వాన్ని హెచ్చరించకపోతే, ఆ దుర్మార్గుడు వాని పాపాలను బట్టి చనిపోతే వాని చావుకు నిన్ను బాధ్యున్ని చేస్తాను. 9అయితే ఒకవేళ నీవు ఆ దుర్మార్గులను హెచ్చరించినా ఆ దుర్మార్గులు తమ దుష్టత్వాన్ని వదలకపోతే, వారు తమ పాపాలను బట్టి చస్తారు, అయితే నీవు నీ ప్రాణాన్ని కాపాడుకుంటావు.
10“మనుష్యకుమారుడా, ఇశ్రాయేలీయులతో ఇలా చెప్పు, ‘మీరు, “మా పాపాలు దోషాలు మాకు భారంగా ఉన్నాయి, వాటివలన మేము క్షీణించి పోతున్నాము; మేమెలా బ్రతకాలి?” అని అంటున్నారు.’ 11నీవు వారితో ఇలా చెప్పు, ‘నా జీవం తోడు, దుర్మార్గులు చనిపోతే నాకు సంతోషం ఉండదు గాని వారు తమ చెడు మార్గాలు విడిచి బ్రతికితే నాకు సంతోషము. తిరగండి! మీ చెడు మార్గాల నుండి తిరగండి! ఇశ్రాయేలీయులారా, మీరెందుకు చస్తారు?’ అని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు.
12“కాబట్టి మనుష్యకుమారుడా, నీ ప్రజలతో ఇలా చెప్పు, ‘ఒకవేళ నీతిమంతులు పాపం చేస్తే, వారి గతంలోని నీతికి విలువ ఉండదు. అలాగే దుష్టులు పశ్చాత్తాపపడితే, వారి యొక్క గతంలోని దుష్టత్వం శిక్షను తీసుకురాదు. పాపం చేసే నీతిమంతులు గతంలో నీతిమంతులుగా ఉన్నప్పటికీ, వారు జీవించడానికి అనుమతించబడరు.’ 13నీతిమంతులు తప్పక జీవిస్తారని నేను చెప్పినా సరే, వారు తమ నీతిని నమ్ముకొని పాపం చేస్తే, వారు చేసిన ఏ నీతికార్యాలు జ్ఞాపకం చేసుకోబడవు; వారు చేసిన పాపానికి వారు చస్తారు. 14అలాగే ఒకవేళ నేను దుర్మార్గులతో, ‘మీరు తప్పక చస్తారు’ అని చెప్తే, వారు తమ పాపాన్ని విడిచిపెట్టి, న్యాయమైనవి, సరియైనవి చేస్తూ, 15వారు అప్పు ఇచ్చినప్పుడు తాకట్టుగా పెట్టుకున్న వాటిని తిరిగి ఇస్తే, వారు దొంగిలించింది తిరిగి ఇస్తే, జీవితాన్ని ఇచ్చే శాసనాలను అనుసరిస్తూ కీడు చేయనట్లైతే; ఆ వారు ఖచ్చితంగా బ్రతుకుతారు; వారు చనిపోరు. 16వారు చేసిన పాపాల్లో ఏదీ జ్ఞాపకం చేసుకోబడదు. వారు న్యాయమైనవి, సరియైనవి చేశారు; కాబట్టి వారు ఖచ్చితంగా బ్రతుకుతారు.
17“అయినా నీ ప్రజలు, ‘యెహోవా మార్గం న్యాయమైనది కాదు’ అని అంటారు. కాని నిజానికి వారి విధానమే న్యాయమైనది కాదు. 18నీతిమంతులు తమ నీతిని విడిచిపెట్టి చెడు చేస్తే, ఆ పాపాన్ని బట్టి వారు చస్తారు. 19దుర్మార్గులు తమ దుర్మార్గాన్ని విడిచిపెట్టి న్యాయమైనవి, సరియైనవి చేస్తే, వాటిని బట్టి వారు బ్రతుకుతారు. 20అయితే ఇశ్రాయేలీయులారా, మీరు ‘యెహోవా మార్గం న్యాయమైనది కాదు’ అని అంటున్నారు. అయితే నేను మీ ప్రవర్తన బట్టి మీ అందరికి తీర్పు తీరుస్తాను.”
యెరూషలేము పతనం
21మనం బందీలుగా వచ్చిన పన్నెండవ సంవత్సరం పదవనెల అయిదవ రోజున యెరూషలేములో నుండి తప్పించుకున్న ఒక మనుష్యుడు నా దగ్గరికి వచ్చి, “పట్టణం కూలిపోయింది!” అని చెప్పాడు. 22అతడు ఇక్కడకు రావడానికి ముందు సాయంత్రం యెహోవా హస్తం నా మీద ఉంచి, ఉదయం ఆ వ్యక్తి నా దగ్గరికి రాకముందు ఆయన నా నోరు తెరిచారు. కాబట్టి నేను మాట్లాడగలుగుతున్నాను, నేను ఇక మౌనంగా ఉండను.
23అప్పుడు యెహోవా వాక్కు నా వద్దకు వచ్చింది: 24“మనుష్యకుమారుడా, ఇశ్రాయేలు దేశంలో శిథిలాల మధ్య నివసిస్తున్నవారు, ‘అబ్రాహాము ఒంటరిగానే ఈ దేశమంతటిని స్వాధీనపరచుకున్నాడు. కాని మనమైతే చాలామందిమి; ఖచ్చితంగా ఈ దేశం మనకు మన స్వాస్థ్యంగా ఇవ్వబడింది’ అని అంటున్నారు. 25కాబట్టి వారితో ఇలా చెప్పు, ‘ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: మీరు మాంసంలో ఇంకా రక్తం ఉండగానే తింటూ, మీ విగ్రహాలవైపు చూస్తూ రక్తాన్ని చిందిస్తున్నారు, అలాంటి మీరు భూమిని స్వాధీనం చేసుకోగలరని అనుకుంటున్నారా? 26మీరు మీ ఖడ్గం మీద ఆధారపడుతున్నారు, అసహ్యమైన పనులు చేస్తున్నారు, మీలో ప్రతి ఒక్కరూ మీ పొరుగువాని భార్యను అపవిత్రం చేస్తారు; అలాంటి మీరు ఈ దేశాన్ని స్వాధీనం చేసుకోగలరా?’
27“వారితో ఇలా చెప్పు: ‘ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: నా జీవం తోడు, శిథిలాల్లో మిగిలి ఉన్నవారు ఖడ్గం చేత కూలిపోతారు, బయట పొలంలో ఉన్నవారు అడవి మృగాలకు ఆహారమవుతారు, కోటలలో గుహల్లో ఉన్నవారు తెగులుతో చస్తారు. 28నేను ఆ దేశాన్ని నిర్మానుష్యంగా చేస్తాను. దాని బల గర్వం ముగిసిపోతుంది, వాటి గుండా ఎవరూ వెళ్లకుండా ఇశ్రాయేలీయుల పర్వతాలు నిర్జనమవుతాయి. 29వారు చేసిన అసహ్యమైన పనులను బట్టి నేను వారి దేశాన్ని పాడు చేసినప్పుడు నేనే యెహోవానని వారు తెలుసుకుంటారు.’
30“మనుష్యకుమారుడా, నీ ప్రజలు గోడల దగ్గర, ఇళ్ళ గుమ్మాల దగ్గర నిలబడి నీ గురించి మాట్లాడుకుంటూ ఒకరితో ఒకరు, ‘రండి యెహోవా దగ్గర నుండి వచ్చిన సందేశం ఏంటో విందాం’ అని చెప్పుకుంటున్నారు. 31నా ప్రజలు ఎప్పుడూ వచ్చినట్లే నీ దగ్గరకు వచ్చి మీ మాటలు వినడానికి నీ ఎదుట కూర్చుంటారు, కాని వారు వాటిని పాటించరు. వారి నోళ్ళు ప్రేమ గురించి మాట్లాడతాయి, కాని వారి హృదయాలు అన్యాయపు లాభాన్ని ఆశిస్తాయి. 32నిజానికి, వారికి నీవు అందమైన స్వరంతో ప్రేమ పాటలు పాడే వాడివి, వాయిద్యాన్ని చక్కగా వాయించే వాడివి తప్ప మరేమీ కాదు, ఎందుకంటే వారు మీ మాటలు వింటారు కానీ వాటిని పాటించరు.
33“ఇవన్నీ నిజమైతే! ఖచ్చితంగా నిజమవుతాయి. అప్పుడు తమ మధ్య ఒక ప్రవక్త ఉన్నాడని వారు తెలుసుకుంటారు.”

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

యెహెజ్కేలు 33: TSA

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి