యెహెజ్కేలు 9

9
విగ్రహారాధికులకు తీర్పు
1ఆయన గట్టిగా ఇలా మాట్లాడడం నేను విన్నాను, “మీలో ప్రతి ఒక్కరు తమ చేతిలో ఆయుధం పట్టుకుని పట్టణం మీద తీర్పును అమలుచేయడానికి నియమించబడిన వారిని దగ్గరకు తీసుకురండి.” 2ఉత్తరాన ఉన్న పై ద్వారం వైపు నుండి ఆరుగురు వ్యక్తులు తమ చేతుల్లో మారణాయుధాలు పట్టుకుని రావడం నేను చూశాను. వారితో పాటు నారబట్టలు వేసుకుని తన నడుముకు లేఖికుని సిరాబుడ్డి కట్టుకున్న ఒక వ్యక్తి ఉన్నాడు. వారు లోపలికి వచ్చి ఇత్తడి బలిపీఠం ప్రక్కన నిలబడ్డారు.
3ఇశ్రాయేలీయుల దేవుని మహిమ అది ఉన్న కెరూబు మీది నుండి పైకి వెళ్లి ఆలయ గడప దగ్గరకు వచ్చి నిలిచింది. అప్పుడు యెహోవా నారబట్టలు వేసుకుని తన నడుముకు లేఖికుని సిరాబుడ్డి కట్టుకుని ఉన్న వానిని పిలిచి, 4యెహోవా అతనితో, “నీవు వెళ్లి యెరూషలేము పట్టణమంతా తిరిగి అక్కడ జరుగుతున్న అసహ్యకరమైన పనులన్నిటిని బట్టి దుఃఖించి విలపించే వారి నుదిటిపై ఒక గుర్తు పెట్టు” అన్నారు.
5నేను వింటుండగా ఆయన మిగిలిన వారితో, “మీరు అతని వెంట పట్టణంలోనికి వెళ్లి దయా కనికరం లేకుండా అందరిని చంపండి. 6ఎవరినీ విడిచిపెట్టకండి. వృద్ధులను, యువకులను, స్త్రీలను, తల్లులను పిల్లలను అందరిని చంపండి కాని ఆ గుర్తు ఉన్నవారిని మాత్రం ముట్టుకోవద్దు. నా పరిశుద్ధాలయం నుండి మొదలుపెట్టండి” అన్నారు. వెంటనే వారు మందిరం ముందున్న వృద్ధులతో మొదలుపెట్టారు.
7ఆయన వారితో, “మందిరాన్ని అపవిత్రం చేయండి. ఆవరణాలను శవాలతో నింపండి. మొదలుపెట్టండి” అన్నారు. వారు బయలుదేరి వెళ్లి పట్టణంలో అందరిని చంపడం మొదలుపెట్టారు. 8వారు చంపుతూ ఉన్నప్పుడు నేను ఒక్కడినే మిగిలి పోయాను, అప్పుడు నేను నేలపై పడి గట్టిగా ఏడుస్తూ, “అయ్యో! ప్రభువైన యెహోవా! యెరూషలేముపై నీ ఉగ్రతను కుమ్మరించి ఇశ్రాయేలీయులలో మిగిలి ఉన్నవారందరిని నాశనం చేస్తావా?” అని మొరపెట్టాను.
9అందుకు ఆయన నాతో, “ఇశ్రాయేలు ప్రజల పాపాలు, యూదా ప్రజల పాపాలు చాలా ఘోరంగా ఉన్నాయి. ఈ దేశమంతా రక్తపాతంతో పట్టణమంతా అన్యాయంతో నిండిపోయింది. యెహోవా మమ్మల్ని చూడడు; యెహోవా దేశాన్ని విడిచిపెట్టాడని వారు అనుకుంటున్నారు. 10కాబట్టి వారి మీద ఏమాత్రం దయ చూపించను వారిని కనికరించను కాని వారు చేసిన దానికి తగిన ప్రతిఫలాన్ని నేను వారికి ఇస్తాను” అన్నారు.
11నారబట్టలు వేసుకుని తన నడుముకు వ్రాత సామాన్లు కట్టుకుని ఉన్నవాడు తిరిగివచ్చి, “నీవు ఆజ్ఞాపించినట్లే నేను చేశాను” అని చెప్పాడు.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

యెహెజ్కేలు 9: TSA

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి