9
వియ్యము గురించి ఎజ్రా ప్రార్థన
1ఈ విషయాలన్ని జరిగిన తర్వాత నాయకులు నా దగ్గరకు వచ్చి, “ఇశ్రాయేలీయులు, యాజకులు, లేవీయులు, అందరు తమ పొరుగువారైన కనానీయులు, హిత్తీయులు, పెరిజ్జీయులు, యెబూసీయులు, అమ్మోనీయులు, మోయాబీయులు, ఈజిప్టువారు, అమోరీయుల నుండి వేరుగా ఉండకుండా వారితో కలిసిపోయి, వారు చేసే అసహ్యకరమైన ఆచారాలను పాటించారు. 2వారి కుమార్తెలను తమకు, తమ కుమారులకు భార్యలుగా చేసుకుంటూ, పరిశుద్ధజాతిగా ఉండకుండా తమ చుట్టూ ఉన్నవారితో కలిసిపోయారు. నాయకులు అధికారులు ఈ విషయంలో అపనమ్మకంగా ఉన్నారు” అని చెప్పారు.
3ఇది విని నేను నా చొక్కా, పై వస్త్రం చింపుకుని, తలవెంట్రుకలు, గడ్డం పీక్కుని దిగ్భ్రాంతితో కూర్చుండిపోయాను. 4అప్పుడు చెర నుండి వచ్చినవారు చేసిన ఈ నమ్మకద్రోహాన్ని బట్టి ఇశ్రాయేలీయుల దేవుని మాటకు భయపడిన ప్రతిఒక్కరు నా చుట్టూ చేరారు. సాయంత్రపు బలి అర్పించే సమయం వరకు నేను దిగ్భ్రాంతితో అక్కడ కూర్చున్నాను.
5తర్వాత, సాయంత్రపు బలి అర్పించే సమయానికి నేను నా అవమానం నుండి లేచి, చినిగిన చొక్కా పై వస్ర్తంతోనే మోకాళ్లమీద పడి, నా దేవుడైన యెహోవా వైపు చేతులెత్తి 6ఇలా ప్రార్థించాను:
“నా దేవా, నా ముఖాన్ని మీ వైపు ఎత్తడానికి నాకు చాలా సిగ్గుగా, అవమానంగా ఉంది. మా పాపాలు మా తల కన్న ఎత్తుగా ఉన్నాయి, మా అపరాధం ఆకాశాన్ని అంటింది. 7మా పూర్వికుల రోజులనుండి నేటివరకు మేము చాలా ఘోరమైన అపరాధాలు చేశాము. మా పాపం కారణంగా ఈ రోజు ఉన్నట్లు మేము, మా రాజులు, యాజకులు పరాయి రాజుల చేతి అప్పగించబడి ఖడ్గానికి, బానిసత్వానికి, దోపిడికి, అవమానానికి గురైయ్యాము.
8“అయితే ఇప్పుడు, మా దేవుడైన యెహోవా ప్రార్థనకు జవాబుగా మా కళ్ళకు వెలుగిచ్చి మా బానిసత్వం నుండి కొంత ఉపశమనం కలిగేలా మాలో కొందరిని తప్పించి, తన పరిశుద్ధాలయంలో స్థిరమైన స్థలాన్ని ఇచ్చి, మా దేవుడు కొంతమట్టుకు మా పట్ల దయ చూపించారు. 9మేము బానిసలుగా ఉన్నప్పటికీ, మా దేవుడు మా దాస్యంలో మమ్మల్ని విడిచిపెట్టలేదు. ఆయన పర్షియా రాజుల ఎదుట మామీద దయ చూపించారు. దేవుని మందిరాన్ని తిరిగి కట్టడానికి, దానికి మరమ్మత్తు చేయడానికి, ఆయన మాకు నూతన జీవాన్ని ఇచ్చారు. యూదాలో, యెరూషలేములో ఆయన మాకు రక్షణ గోడగా ఉన్నారు.
10-11“అయితే ఇప్పుడు, మా దేవా, ఇంత జరిగిన తర్వాత మేము ఏమి చెప్పగలము? మీ సేవకులైన ప్రవక్తల ద్వారా మీరు ఇచ్చిన ఆజ్ఞలను విడిచిపెట్టాము. వారు, ‘మీరు స్వాధీనం చేసుకోబోయే దేశం అక్కడి ప్రజల అపవిత్రత వలన కలుషితమైపోయింది. తమ అసహ్యకరమైన ఆచారాలతో వారు దేశాన్ని ఆ చివర నుండి ఈ చివర వరకు నింపేశారు. 12కాబట్టి మీ కుమార్తెలకు వారి కుమారులతో గాని, మీ కుమారులకు వారి కుమార్తెలతో గాని పెళ్ళి చేయవద్దు. ఎప్పటికీ వారితో స్నేహ ఒప్పందం కోరవద్దు, అప్పుడు మీరు బలవంతులుగా ఉండి, ఆ దేశంలోని మంచి వాటిని తిని, మీ పిల్లలకు శాశ్వతమైన వారసత్వంగా దానిని అప్పగిస్తారు’ అని చెప్పారు.
13“మేము చేసిన చెడు పనులకు, మా గొప్ప అపరాధానికి ఫలితంగా ఇలా మాకు జరిగింది. అయినప్పటికీ, మా దేవుడవైన మీరు మా దోషాలకు తగిన పూర్తి శిక్షను మాకు విధించకుండా ఈ విధంగా కొంతమందిని దాస్యం నుండి తప్పించారు. 14ఇంత జరిగాక, మేము మరలా మీ ఆజ్ఞలు పాటించకుండా ఇలాంటి అసహ్యకరమైన ఆచారాలు పాటించే ప్రజలతో వియ్యమందుతామా? మాలో ఒక్కరు తప్పించుకుని మిగిలిపోకుండ మీరు మమ్మల్ని నాశనం చేసేంతగా కోప్పడతారు గదా? 15యెహోవా, ఇశ్రాయేలు దేవా, మీరు నీతిమంతులు! ఈ రోజున మేము కొద్ది మందిమి మిగిలాము. మేము మీ ముందు నిలబడడానికి మేమెవరం అర్హులం కాకపోయిన, మీ ఎదుట మా అపరాధంలో నిలబడ్డాము.”