గలతీయులకు 1

1
1పౌలు, అనే నేను మనుష్యుల నుండి గాని లేక ఒక వ్యక్తి వలన గాని పంపబడలేదు, కాని యేసు క్రీస్తు, ఆయనను మరణం నుండి తిరిగి లేపిన తండ్రియైన దేవుని వలన అపొస్తలునిగా పంపబడ్డాను. 2నేనూ, నాతో ఉన్న సహోదరీ సహోదరులందరం కలిసి,
గలతీ ప్రాంతంలోని సంఘాలకు వ్రాయునది:
3మన తండ్రియైన దేవుని నుండి, ప్రభువైన యేసు క్రీస్తు నుండి మీకు కృపా సమాధానములు కలుగును గాక, 4క్రీస్తు మన తండ్రియైన దేవుని చిత్తానికి లోబడి, దుష్టత్వం ఏలుబడి చేసే ప్రస్తుత యుగం నుండి మనలను విడిపించడానికి, మన పాపాల కొరకు ప్రాయశ్చిత్తంగా తనను తాను అర్పించుకున్నారు. 5ఆయనకే మహిమ నిరంతరం కలుగును గాక. ఆమేన్.
వేరొక సువార్త లేదు
6మీ గురించి నేను ఆశ్చర్యపడుతున్నాను ఎందుకంటే, క్రీస్తు కృపలో బ్రతుకడానికి మిమ్మల్ని పిలిచిన వానిని మీరు ఇంత త్వరగా వదిలివేసి, వేరొక సువార్త వైపుకు తిరుగుతున్నారు. 7నిజానికి అది సువార్త కానే కాదు. అయితే కొందరు సువార్తను తారుమారు చేయాలని ప్రయత్నిస్తూ మిమ్మల్ని గందరగోళంలోనికి నెడుతున్నారు. 8అయితే మేమే గానీ పరలోకం నుండి వచ్చిన దేవదూతే గానీ, మేము మీకు ప్రకటించిన సువార్త కాక వేరొక సువార్త ప్రకటిస్తే, వారి మీదికి దేవుని శాపం వచ్చు గాక! 9మేము ఇప్పటికే చెప్పినట్లుగా, ఇప్పుడు నేను మళ్ళీ చెప్తున్నా: మీరు అంగీకరించింది కాక ఎవరైనా ఒకవేళ సువార్త ప్రకటిస్తున్నట్లయితే, అలాంటివారి మీదికి దేవుని శాపం వచ్చు గాక!
10నేను ఇప్పుడు మనుషుల ఆమోదం పొందటానికి ప్రయత్నిస్తున్నానా, లేదా దేవుని ఆమోదమా? లేక నేను ప్రజలను సంతోషపెట్టడానికి ప్రయత్నిస్తున్నానా? ఒకవేళ నేను ఇంకా ప్రజలను సంతోషపెట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటే, నేను క్రీస్తుకు సేవకునిగా ఉండలేను.
దేవునిచేత పిలువబడిన పౌలు
11సహోదరీ సహోదరులారా, నేను ప్రకటించిన సువార్త మానవుని నుండి వచ్చింది కాదని మీరు తెలుసుకోవాలని నేను కోరుతున్నాను. 12నేను ఏ మానవుని నుండి పొందలేదు, లేదా బోధింపబడలేదు; కాని యేసు క్రీస్తు నాకు ఇచ్చిన ప్రత్యక్షత ద్వారా పొందాను.
13నేను యూదా మతంలో జీవించిన నా గత జీవిత విధానాన్ని గురించి, అలాగే దేవుని సంఘాన్ని నాశనం చేయడానికి దాన్ని ఎంత క్రూరంగా నేను హింసించానో మీరు విన్నారు. 14నా స్వజనులలో నా వయస్సువారనేకుల కంటే యూదా మతవిషయంలో నేను ఎంతో ముందున్నాను, నా పూర్వీకుల ఆచారాలను పాటించడంలో నాకు అత్యాసక్తి ఉండేది. 15కాని తన కృప ద్వారా నన్ను నా తల్లి గర్భం నుండే ప్రత్యేకపరచుకొని నన్ను పిలిచిన దేవుడు, 16తన కుమారుని గురించి యూదేతరుల మధ్య నేను సువార్తను ప్రకటించేలా ఆయన తన కుమారున్ని నాలో బయలుపరచడానికి ఇష్టపడ్డారు, దానికి నా తక్షణ ప్రతిస్పందన ఏ మనుష్యుని సంప్రదించడం కాదు. 17అలాగే నా కంటే ముందు నుండి అపొస్తలులుగా ఉన్న వారిని సంప్రదించడానికి నేను యెరూషలేము వెళ్ళలేదు, కాని నేను అరేబియాకు వెళ్ళాను. తరువాత దమస్కుకు తిరిగి వచ్చాను.
18మూడు సంవత్సరాల తరువాత, కేఫాను#1:18 కేఫాను అనే పేతురును పరిచయం చేసుకోవడానికి యెరూషలేముకు వెళ్ళి అక్కడ పదిహేను రోజులు అతనితో ఉన్నాను. 19ప్రభువు యొక్క సోదరుడైన యాకోబును తప్ప, ఇతర అపొస్తలుల్లో ఎవరిని నేను చూడలేదు. 20నేను మీకు వ్రాసేది అబద్ధం కాదని దేవుని ముందు రూఢిగా చెప్తున్నాను.
21ఆ తరువాత నేను సిరియాకు, కిలికియకు వెళ్ళాను. 22యూదయలోని క్రీస్తులో ఉన్న సంఘాలకు వ్యక్తిగతంగా నేను తెలియదు. 23వారు విన్నదల్లా: “ఇంతకు ముందు మనలను హింసించినవాడు, ఏ విశ్వాసాన్నైతే నాశనం చేయాలని ప్రయత్నించాడో, దానినే ఇప్పుడు ప్రకటిస్తున్నాడు” అని. 24కనుక వారు నన్ను బట్టి దేవుని స్తుతించారు.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

గలతీయులకు 1: TCV

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి