గలతీ పత్రిక 1
1
1పౌలు అనే నేను మనుష్యుల ద్వారా గాని ఒక వ్యక్తి వలన గాని పంపబడలేదు, కాని యేసు క్రీస్తు, ఆయనను మరణం నుండి తిరిగి లేపిన తండ్రియైన దేవుని వలన అపొస్తలునిగా పంపబడ్డాను. 2నేనూ, నాతో ఉన్న సహోదరీ సహోదరులందరం కలిసి,
గలతీ ప్రాంతంలోని సంఘాలకు వ్రాయునది:
3మన తండ్రియైన దేవుని నుండి, ప్రభువైన యేసు క్రీస్తు నుండి మీకు కృపా సమాధానాలు కలుగును గాక. 4క్రీస్తు మన తండ్రియైన దేవుని చిత్తానికి లోబడి, దుష్టత్వం ఏలుబడి చేసే ప్రస్తుత యుగం నుండి మనల్ని విడిపించడానికి మన పాపాల కోసం ప్రాయశ్చిత్తంగా తనను తాను అర్పించుకున్నారు. 5ఆయనకే నిరంతరం మహిమ కలుగును గాక ఆమేన్.
వేరొక సువార్త లేదు
6మీ గురించి నేను ఆశ్చర్యపడుతున్నాను ఎందుకంటే, క్రీస్తు కృపలో బ్రతకడానికి మిమ్మల్ని పిలిచిన వానిని మీరు ఇంత త్వరగా వదిలేసి, వేరొక సువార్త వైపుకు తిరుగుతున్నారు. 7నిజానికి అది సువార్త కానే కాదు. అయితే కొందరు సువార్తను తారుమారు చేయాలని ప్రయత్నిస్తూ మిమ్మల్ని గందరగోళంలోనికి నెడుతున్నారు. 8అయితే మేమే గాని పరలోకం నుండి వచ్చిన దేవదూతే గాని, మేము మీకు ప్రకటించిన సువార్త కాక వేరొక సువార్త ప్రకటిస్తే, వారి మీదికి దేవుని శాపం వచ్చును గాక! 9మేము ఇప్పటికే చెప్పినట్లుగా, ఇప్పుడు నేను మళ్ళీ చెప్తున్నాను: మీరు అంగీకరించిన సువార్త కాక ఎవరైనా వేరే సువార్త ప్రకటిస్తే వారి మీదికి దేవుని శాపం వచ్చును గాక!
10నేను ఇప్పుడు మనుష్యుల ఆమోదం పొందటానికి ప్రయత్నిస్తున్నానా, లేక దేవుని ఆమోదమా? నేను ప్రజలను సంతోషపెట్టడానికి ప్రయత్నిస్తున్నానా? ఒకవేళ నేను ప్రజలను సంతోషపెట్టేవాడనైతే నేను క్రీస్తుకు సేవకునిగా ఉండలేను.
దేవునిచేత పిలువబడిన పౌలు
11సహోదరీ సహోదరులారా నేను ప్రకటించిన సువార్త మానవుని నుండి వచ్చింది కాదని మీరు తెలుసుకోవాలి. 12నేను ఏ మానవుని నుండి దాన్ని పొందలేదు, నాకెవరూ బోధించలేదు; యేసు క్రీస్తు నాకు ఇచ్చిన ప్రత్యక్షత ద్వారానే నేను పొందాను.
13నేను యూదా మతంలో జీవించిన నా గత జీవిత విధానాన్ని గురించి, అలాగే దేవుని సంఘాన్ని నాశనం చేయడానికి దాన్ని ఎంత క్రూరంగా నేను హింసించానో మీరు విన్నారు. 14నా స్వజనులలో నా వయస్సుగల అనేకుల కంటే యూదా మతవిషయంలో నేను ఎంతో ముందున్నాను, నా పూర్వికుల ఆచారాలను పాటించడంలో నాకు అత్యాసక్తి ఉండేది. 15కాని తన కృప ద్వారా నన్ను నా తల్లి గర్భం నుండే ప్రత్యేకపరచుకొని నన్ను పిలిచిన దేవుడు, 16తన కుమారుని గురించి యూదేతరుల మధ్య నేను సువార్తను ప్రకటించేలా ఆయన తన కుమారున్ని నాలో బయలుపరచడానికి ఇష్టపడ్డారు. దానికి నేను వెంటనే మనుష్యులను సంప్రదించలేదు. 17అలాగే నా కంటే ముందు నుండి అపొస్తలులుగా ఉన్నవారిని సంప్రదించడానికి నేను యెరూషలేము వెళ్లలేదు, కాని నేను అరేబియాకు వెళ్లాను. తర్వాత దమస్కుకు తిరిగి వచ్చాను.
18మూడు సంవత్సరాల తర్వాత, కేఫాను#1:18 అంటే, పేతురు పరిచయం చేసుకోవడానికి యెరూషలేముకు వెళ్లి అక్కడ పదిహేను రోజులు అతనితో ఉన్నాను. 19ప్రభువు సోదరుడైన యాకోబును తప్ప ఇతర అపొస్తలుల్లో ఎవరిని నేను చూడలేదు. 20నేను మీకు వ్రాసేది అబద్ధం కాదని దేవుని ముందు రూఢిగా చెప్తున్నాను.
21ఆ తర్వాత నేను సిరియాకు, కిలికియకు వెళ్లాను. 22యూదయలోని క్రీస్తులో ఉన్న సంఘాలకు వ్యక్తిగతంగా నేను తెలియదు. 23వారు, “ఇంతకుముందు మనల్ని హింసించినవాడు, ఏ విశ్వాసాన్నైతే నాశనం చేయాలని ప్రయత్నించాడో దానినే ఇప్పుడు ప్రకటిస్తున్నాడు” అని మాత్రమే విన్నారు. 24కాబట్టి వారు నన్ను బట్టి దేవుని స్తుతించారు.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
గలతీ పత్రిక 1: TSA
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
Telugu Contemporary Version, Holy Bible
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Used with permission. All rights reserved worldwide.