గలతీయులకు 3

3
విశ్వాసం లేక ధర్మశాస్త్ర క్రియలు
1అవివేకులైన గలతీయులారా! మిమ్మల్ని ఎవరు భ్రమపరిచారు? యేసు క్రీస్తు మీ కళ్లముందే సిలువ వేయబడినంత స్పష్టంగా వర్ణించబడింది. 2ఈ ఒక్క విషయాన్ని నేను మీ నుండి తెలుసుకోవాలనుకుంటున్నాను: మీరు ధర్మశాస్త్ర క్రియల వల్ల ఆత్మను పొందారా, లేక మీరు వినిన దానిని విశ్వసించడం వల్లనా? 3మీరు ఇంత అవివేకులా? ఆత్మ ద్వారా ప్రారంభించిన తరువాత, మీరు ఇప్పుడు శరీర ద్వారా పూర్తి చేయడానికి ప్రయత్నిస్తున్నారా? 4మీరు పొందిన శ్రమ వ్యర్థమేనా? అదంతా నిజంగా వ్యర్థమేనా? 5అందుకు నేను మళ్ళీ అడుగుతున్నా, దేవుడు మీకు తన ఆత్మను ఇచ్చి, మీ మధ్య అద్బుతాలు జరిగిస్తూ ఉన్నది ధర్మశాస్త్ర క్రియల వల్లనా, లేక మీరు విన్న దానిని విశ్వసించడం వల్లనా? 6అలాగే మన పూర్వికుడైన అబ్రాహాము గురించి వ్రాయబడినట్లుగా, “దేవుని నమ్మినందుకు దేవుడు అతన్ని నీతిమంతునిగా ఎంచాడు.”#3:6 ఆది 15:6
7కనుక మీరు అర్థం చేసుకోవలసింది ఏంటంటే ఎవరైతే విశ్వాసం కలిగినవారు అబ్రాహాముకు పిల్లలవుతారు. 8దేవుడు యూదేతరులను వారి విశ్వాసం వల్ల నీతిమంతులుగా తీరుస్తారని లేఖనంలో ముందుగానే చెప్పబడింది, “నిన్ను బట్టి జనములన్నీ ఆశీర్వదించబడతాయి”#3:8 ఆది 12:3; 18:18; 22:18 అని చెప్పడం ద్వారా అబ్రాహాముకు ముందుగానే సువార్త ప్రకటించబడింది. 9అందువల్ల విశ్వాసంపై ఆధారపడే ప్రతీ ఒక్కరు విశ్వాస పురుషుడైన అబ్రాహాముతో పాటు ధన్యులవుతారు.
10ధర్మశాస్త్ర క్రియలపై ఆధారపడే వారందరూ శాపగ్రస్తులు, ఎలాగంటే లేఖనాల్లో వ్రాయబడిన ప్రకారం: “ధర్మశాస్త్రంలో వ్రాయబడిన ప్రతీదానిని పాటించనివారు శాపగ్రస్తులు.”#3:10 ద్వితీ 27:26 11ధర్మశాస్త్రం మీద ఆధారపడే ఏ ఒక్కడూ దేవుని ముందు నీతిమంతునిగా తీర్చబడడు, ఎందుకంటే “నీతిమంతుడు విశ్వాసమూలంగా జీవిస్తాడు.”#3:11 హబ 2:4 12ధర్మశాస్త్రం విశ్వాసం మీద ఆధారపడి లేదు గాని; దానికి విరుద్ధంగా, “వీటిని చేసేవాడు వాటి వల్లనే జీవిస్తాడు”#3:12 లేవీ 18:5 అని వ్రాయబడి ఉంది. 13ధర్మశాస్త్రం వల్ల వచ్చే శాపం నుండి మనలను విమోచించడానికి క్రీస్తు మన కొరకు శాపగ్రస్తుడయ్యారు. ఎందుకంటే, లేఖనాల్లో వ్రాయబడిన ప్రకారం “మ్రానుపై వ్రేలాడదీయబడిన ప్రతీ ఒక్కరు శాపగ్రస్తులే.”#3:13 ద్వితీ 21:23 14విశ్వాసం ద్వారా దేవుని ఆత్మను గురించిన వాగ్దానాన్ని మనం పొందుకొనేలా అబ్రాహాముకు ఇవ్వబడిన దీవెన క్రీస్తు యేసు ద్వారా యూదేతరులకు కూడా రావాలని ఆయన మనల్ని విమోచించారు.
ధర్మశాస్త్రం మరియు వాగ్దానం
15సహోదరీ సహోదరులారా, అనుదిన జీవితం నుండి ఒక ఉదాహరణ మీకు చెప్తాను. మనుష్యుల ద్వారా సరిగ్గా స్థాపించబడిన ఒడంబడికను ఎవరూ పెట్టలేరు దానికేమి చేర్చలేరు, ఈ విషయంలో కూడా అంతే. 16అబ్రాహాముకు అతని సంతానానికి వాగ్దానాలు ఇవ్వబడ్డాయి. లేఖనం, అనేకులను ఉద్దేశించి “సంతానాలకు” అని చెప్పడం లేదు, గాని ఒక్క వ్యక్తిని ఉద్దేశించి, “సంతానానికి”#3:16 ఆది 12:7; 13:15; 24:7 అని చెప్తుంది, ఆ సంతానం క్రీస్తే. 17నేను చెప్పేదేంటంటే, 430 సంవత్సరాల తరువాత ఇవ్వబడిన ధర్మశాస్త్రం దేవునిచే ముందుగానే స్థాపించబడిన ఒడంబడికను ప్రక్కన పెట్టివేయదు అలాగే దేవుని వాగ్దానాన్ని నిరర్ధకం చేయదు. 18ఎందుకంటే ఒకవేళ ఆ వారసత్వం ధర్మశాస్త్రం మీద ఆధారపడి వుంటే, ఇక వాగ్దానం మీద ఆధారపడదు, అయితే దేవుడు అబ్రాహాముకు ఆ వారసత్వాన్ని తన కృపలో వాగ్దానం ద్వారా ఇచ్చారు.
19అలాంటప్పుడు, ధర్మశాస్త్రం ఎందుకు ఇవ్వబడింది? వాగ్దానం ఎవరికి వర్తింస్తుందో ఆ సంతానం వచ్చే వరకు అతిక్రమాలను చూపడానికి ధర్మశాస్త్రం ఇవ్వబడింది. ఆ ధర్మశాస్త్రం దూతల ద్వారా ఇవ్వబడి మధ్యవర్తికి అప్పగించబడింది. 20అయినప్పటికి మధ్యవర్తి ఒక్క గుంపు ఒక పక్షం కన్నా ఎక్కువ అని సూచిస్తుంది, కానీ దేవుడు ఒక్కడే.
21అలాగైతే ధర్మశాస్త్రం దేవుని వాగ్దానాలకు వ్యతిరేకమా? ఎన్నటికి కాదు! ఇవ్వబడిన ధర్మశాస్త్రం మనకు జీవాన్ని ఇచ్చివుంటే, తప్పకుండా ధర్మశాస్త్రం వల్లనే మనం నీతిమంతులుగా తీర్చబడి ఉండేవారం. 22అయితే వాగ్దానం చేయబడినది, యేసుక్రీస్తులో విశ్వాసముంచడం ద్వారా, ఆయనను నమ్మేవారికి ఇవ్వబడాలని, పాప వశంలో ఉన్న వాటన్నిటినీ లేఖనం బంధించింది.
దేవుని పిల్లలు
23ఈ విశ్వాసం గురించి తెలియక ముందు, రావలసియుండిన విశ్వాసం బయలుపరచబడే వరకు మనం బంధింపబడి, ధర్మశాస్త్రం అదుపులో ఉంచబడ్డాము. 24అందువల్ల మనం విశ్వాసం వల్ల నీతిమంతులుగా తీర్చబడేలా క్రీస్తు వచ్చేవరకు ధర్మశాస్త్రం మనకు ఒక సంరక్షకునిగా ఉండింది. 25అయితే ఇప్పుడు ఈ విశ్వాసం మనకు బయలుపరచబడింది కనుక మనం సంరక్షకుని ఆధీనంలో ఉండే అవసరం లేదు.
26కనుక మీరందరు యేసుక్రీస్తులో విశ్వాసముంచడం ద్వారా దేవుని కుమారులై యున్నారు. 27క్రీస్తులో బాప్తిస్మం పొందిన మీరందరు క్రీస్తును ధరించుకొని యున్నారు. 28ఇందులో యూదులని గ్రీసు దేశస్థులని, దాసులని స్వతంత్రులని, పురుషుడని స్త్రీ అని ఏ భేదం లేదు, క్రీస్తు యేసులో అందరు ఒక్కటే. 29మీరు క్రీస్తుకు చెందినవారైతే, మీరు అబ్రాహాము సంతానం, మరియు వాగ్దాన ప్రకారం వారసులు.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

గలతీయులకు 3: TCV

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి