ఆది 41

41
ఫరో కలలు
1రెండు సంవత్సరాల ముగిసిన తర్వాత ఫరో కలగన్నాడు: అతడు నైలు నది దగ్గర నిలబడి ఉన్నాడు, 2నదిలో నుండి పుష్టిగా అందంగా ఉన్న ఏడు ఆవులు పైకి వచ్చి జమ్ము మధ్య మేస్తున్నాయి. 3వాటి తర్వాత, చిక్కిపోయి వికారంగా ఉన్న మరో ఏడు ఆవులు వాటి ప్రక్కన నైలు నది ఒడ్డున నిలబడ్డాయి. 4చిక్కిపోయి వికారంగా ఉన్న ఆవులు అందంగా పుష్టిగా ఉన్న ఏడు ఆవులను తినివేశాయి. అప్పుడు ఫరో నిద్రలేచాడు.
5మళ్ళీ అతడు పడుకున్నాడు, రెండవ కలగన్నాడు: పుష్టిగా, మంచిగా ఉన్న ఏడు వెన్నులు ఒకే కొమ్మకు పెరుగుతున్నాయి. 6వాటి తర్వాత పీలగా, తూర్పుగాలికి ఎండిపోయిన మరో ఏడు వెన్నులు పెరిగాయి. 7పీలవెన్నులు పుష్టిగా ఉన్న ఏడు వెన్నులను మ్రింగివేశాయి. అప్పుడు ఫరో నిద్రలేచాడు; అది కల అని గ్రహించాడు.
8ఉదయం అతని మనస్సు కలవరపడింది, కాబట్టి ఈజిప్టులోని మాంత్రికులను, జ్ఞానులను అందరిని పిలిపించాడు. ఫరో తన కలలు వారికి చెప్పాడు, కానీ వాటి భావం ఎవరు చెప్పలేకపోయారు.
9అప్పుడు గిన్నె అందించేవారి నాయకుడు ఫరోతో అన్నాడు, “ఈ రోజు నా తప్పులు నాకు జ్ఞాపకం చేయబడ్డాయి. 10ఫరో ఒకసారి తన సేవకులపై కోప్పడి, నన్ను రొట్టెలు కాల్చేవారి నాయకున్ని అంగరక్షకుల అధిపతి ఇంట్లో నిర్బంధంలో ఉంచారు. 11మా ఇద్దరికి ఒకే రాత్రి కలలు వచ్చాయి, ఒక్కొక్క కలకు ఒక్కొక్క అర్థం ఉంది. 12అక్కడ మాతో పాటు ఒక హెబ్రీ యువకుడు ఉన్నాడు. అతడు అంగరక్షకుల అధికారికి దాసుడు. మా కలలు అతనికి చెప్పాం, అతడు ఎవరి కల భావాన్ని వారికి చెప్పాడు. 13అతడు వాటిని వివరించినట్టే మాకు జరిగింది: నా స్థానం నాకు తిరిగి వచ్చింది, మరో వ్యక్తి వ్రేలాడదీయబడ్డాడు.”
14అప్పుడు ఫరో యోసేపును పిలిపించాడు, వారు అతన్ని చెరసాల నుండి త్వరగా తీసుకువచ్చారు. యోసేపు శుభ్రంగా క్షౌరం చేసుకుని బట్టలు మార్చుకుని ఫరో సమక్షంలో నిలబడ్డాడు.
15ఫరో యోసేపుతో, “నేనొక కలగన్నాను, దాని భావం ఎవరూ చెప్పలేకపోయారు. కానీ నీవు ఒక కల వింటే దాని భావం చెప్తావని నీ గురించి విన్నాను” అని అన్నాడు.
16అందుకు యోసేపు, “నేను చేయలేను, అయితే ఫరోకు క్షేమకరమైన జవాబు దేవుడు ఇస్తారు” అని ఫరోతో అన్నాడు.
17అప్పుడు ఫరో యోసేపుతో అన్నాడు, “నా కలలో నేను నైలు నది తీరాన నిలబడ్డాను, 18నదిలో నుండి పుష్టిగా అందంగా ఉన్న ఏడు ఆవులు పైకి వచ్చి జమ్ము మధ్య మేస్తున్నాయి. 19వాటి తర్వాత చిక్కిపోయి వికారంగా ఉన్న మరో ఏడు ఆవులు పైకి వచ్చాయి. అంత వికారమైన ఆవులను ఈజిప్టులో నేనెప్పుడు చూడలేదు. 20బక్కగా వికారంగా ఉన్న ఆవులు ముందు వచ్చిన పుష్టిగా ఉన్న ఏడు ఆవులను తినివేశాయి. 21కానీ అవి తిన్నా కూడా అవి తిన్నాయని ఎవరు చెప్పలేరు; అవి ముందు ఉన్నట్లే వికారంగా ఉన్నాయి. అప్పుడు నేను నిద్రలేచాను.
22“నా కలలో పుష్టిగా మంచిగా ఉన్న ఏడు వెన్నులు ఒకే కాడకు పెరుగుతున్నాయి. 23వాటి తర్వాత పీలగా తూర్పుగాలికి ఎండిపోయిన మరో పీలవెన్నులు వాటి తర్వాత మొలిచాయి. 24పీలవెన్నులు పుష్టిగా ఉన్న ఏడు వెన్నులను మ్రింగివేశాయి. ఇది మాంత్రికులకు చెప్పాను, కానీ దాని అర్థాన్ని చెప్పేవారు ఎవరూ లేరు.”
25అప్పుడు యోసేపు ఫరోకు చెప్పాడు, “ఫరో కలల భావం ఒక్కటే. దేవుడు ఏమి చేయబోతున్నారో ఫరోకు తెలియజేశారు. 26ఆ ఏడు మంచి ఆవులు ఏడు సంవత్సరాలు, అలాగే ఏడు మంచి వెన్నులు ఏడు సంవత్సరాలు; రెండు కలల భావం ఒకటే. 27వాటి తర్వాత వచ్చిన చిక్కిపోయి వికారంగా ఉన్న ఏడు ఆవులు ఏడు సంవత్సరాలు, పీలగా తూర్పుగాలికి ఎండిపోయిన ఏడు వెన్నులు కూడా అవే ఏడు సంవత్సరాలు; అవి ఏడు సంవత్సరాలు కరువు కాలము.
28“నేను ఫరోకు చెప్పినట్టే జరుగుతుంది. దేవుడు తాను ఏమి చేయబోతున్నారో ఫరోకు చూపించారు. 29ఈజిప్టు దేశమంతటా గొప్ప సమృద్ధిగల ఏడు సంవత్సరాలు రాబోతున్నాయి. 30కానీ వాటి తర్వాత ఏడు సంవత్సరాలు కరువు వస్తుంది. ఆ సమయంలో ఈజిప్టులో ఉండే సమృద్ధి అందరు మరిచిపోతారు, కరువు దేశాన్ని నాశనం చేస్తుంది. 31తర్వాత వచ్చే కరువు ఇంకా తీవ్రంగా ఉంటుంది కాబట్టి దేశంలో ఉండిన సమృద్ధి ఎవరికీ జ్ఞాపకం ఉండదు. 32కల రెండు విధాలుగా ఫరోకు ఇవ్వబడిన కారణం ఏంటంటే ఇది దేవునిచే దృఢంగా నిర్ణయించబడింది, దేవుడు త్వరలో దానిని చేస్తారు.
33“ఇప్పుడు ఫరో జ్ఞాన వివేచనలు కలిగిన ఒక వ్యక్తిని ఈజిప్టు అంతటి మీద అధికారిగా నియమించాలి. 34సమృద్ధిగా పండే ఏడు సంవత్సరాల్లో పంటలో అయిదవ భాగాన్ని సేకరించడానికి ఫరో దేశమంతా పర్యవేక్షకులను నియమించాలి. 35వారు ఈ మంచి సంవత్సరాల్లో పండే ధాన్యం సేకరించి ఫరో ఆధీనంలో పట్టణాల్లో ఆహారం ఉండేలా నిలువచేయాలి. 36ఈ ఆహారం దేశం కోసం నిలువచేయబడి ఈజిప్టు మీదికి వచ్చే ఏడు సంవత్సరాల కరువు కాలంలో ఉపయోగించబడుతుంది, అప్పుడు కరువు ద్వారా దేశం నాశనం కాదు.”
37ఈ మాట ఫరోకు అతని అధికారులకు నచ్చింది. 38కాబట్టి ఫరో వారిని, “ఇతనిలా దేవుని ఆత్మ కలిగిన వారెవరినైనా కనుగొనగలమా?” అని అడిగాడు.
39అప్పుడు ఫరో యోసేపుతో, “దేవుడు నీకు ఇదంతా తెలియజేశారు కాబట్టి, నీలా వివేచన జ్ఞానం కలిగిన వారెవరూ లేరు. 40నా రాజభవన అధికారిగా నీవు ఉంటావు, నా ప్రజలంతా నీ ఆదేశాలకు లోబడతారు. సింహాసనం విషయంలో మాత్రమే నేను నీ పైవాడిగా ఉంటాను” అని అన్నాడు.
యోసేపు ఈజిప్టుకు అధికారి అయ్యాడు
41కాబట్టి ఫరో యోసేపుతో, “నేను నిన్ను ఈజిప్టు దేశమంతటికి అధికారిగా ప్రకటిస్తున్నాను” అని అన్నాడు. 42ఫరో తన రాజముద్ర ఉంగరం తీసి యోసేపు వ్రేలికి పెట్టాడు. సన్నని నారబట్టలు అతనికి తొడిగించాడు, అతని మెడలో బంగారు గొలుసు వేశాడు. 43తన రెండవ రథంలో అతన్ని కూర్చోబెట్టాడు, అప్పుడు ప్రజలు, “నమస్కారం చేయండి!”#41:43 లేదా దారి ఇవ్వండి అని అంటూ అతని ముందు కేకలు వేశారు. ఈ విధంగా అతడు యోసేపును దేశమంతటిమీద అధికారిగా చేశాడు.
44అప్పుడు ఫరో యోసేపుతో, “నేను ఫరోను, కానీ నీ అనుమతి లేకుండా ఈజిప్టు అంతటిలో ఎవరు కూడా తన చేయి కానీ కాలు కానీ ఎత్తరు” అని అన్నాడు. 45ఫరో యోసేపుకు జఫెనత్-ఫనేహు అనే పేరు పెట్టాడు, ఓనులో#41:45 అంటే, హెలియోపొలిస్; 50 వచనంలో కూడా యాజకుడైన పోతీఫెర కుమార్తె, ఆసెనతును అతనికి భార్యగా ఇచ్చాడు. యోసేపు ఈజిప్టు దేశమంతటా పర్యటించాడు.
46యోసేపు ఈజిప్టు రాజైన ఫరో సేవ మొదలుపెట్టినప్పుడు అతని వయస్సు ముప్పై సంవత్సరాలు. యోసేపు ఫరో ఎదుట నుండి వెళ్లి, ఈజిప్టు దేశమంతా సంచరించాడు. 47ఏడు సమృద్ధిగల సంవత్సరాల్లో భూమిపై విస్తారమైన పంట పండింది. 48యోసేపు ఈజిప్టులో ఆ ఏడు సంవత్సరాల పంటనంతా సేకరించి పట్టణాల్లో నిల్వచేశాడు. ప్రతి పట్టణం చుట్టూ ఉన్న పొలాల్లో సేకరించిన ధాన్యాన్ని ఆ పట్టణాల్లోనే నిల్వచేశాడు. 49యోసేపు సముద్రతీరాన ఇసుకంత విస్తారంగా ధాన్యాన్ని నిలువచేశాడు; అది విస్తారంగా ఉంది కాబట్టి దాన్ని కొలవడం ఆపేశాడు.
50కరువు సంవత్సరాలకు ముందు యోసేపుకు ఓనులో యాజకుడైన పోతీఫెర కుమార్తె, ఆసెనతు ద్వారా ఇద్దరు కుమారులు పుట్టారు. 51తన మొదటి కుమారునికి యోసేపు మనష్షే అని పేరు పెట్టి, “దేవుడు నా కష్టాలన్నీ, నా తండ్రి ఇంటివారందరినీ మరచిపోయేలా చేశారు” అని అన్నాడు. 52రెండవ కుమారునికి ఎఫ్రాయిం#41:52 ఎఫ్రాయిం హెబ్రీ పదంలా ఉంది ఫలవంతం అని పేరు పెట్టి, “నాకు శ్రమలు కలిగిన దేశంలో దేవుడు నన్ను అభివృద్ధి చేశారు” అని అన్నాడు.
53ఈజిప్టులో సమృద్ధి కలిగిన ఏడు సంవత్సరాలు ముగిశాయి, 54యోసేపు చెప్పినట్టే ఏడు సంవత్సరాల కరువు ప్రారంభమయ్యింది. ఇతర దేశాల్లో కరువు ఉన్నది కానీ ఈజిప్టు దేశమంతా ఆహారం ఉంది. 55ఈజిప్టు అంతా కరువు అనుభవించడం ప్రారంభమైనప్పుడు, ఆహారం కోసం ప్రజలు ఫరోకు మొరపెట్టారు. అప్పుడు ఫరో ఈజిప్టు వారందరితో, “యోసేపు దగ్గరకు వెళ్లి అతడు చెప్పినట్టు చేయండి” అని చెప్పాడు.
56దేశమంతటా కరువు వ్యాపించినప్పుడు, యోసేపు ధాన్య కొట్లన్నీ తెరిచి, ఈజిప్టువారికి ధాన్యం అమ్మాడు, ఎందుకంటే ఈజిప్టు దేశంలో కరువు చాలా తీవ్రంగా ఉంది. 57లోకమంతా ఈజిప్టుకు వచ్చి యోసేపు దగ్గర ధాన్యం కొనుగోలు చేశారు, ఎందుకంటే కరువు అంతటా తీవ్రంగా ఉంది.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

ఆది 41: TSA

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి