హెబ్రీ పత్రిక 12
12
1కాబట్టి, ఇంత గొప్ప సాక్షిసమూహం మన చుట్టూ ఆవరించి ఉంది కాబట్టి, మనకు ఆటంకం కలిగించే సమస్తాన్ని, సుళువుగా చిక్కులు పెట్టే పాపాలను విడిచిపెడదాము. విశ్వాసానికి కర్తయైన దాన్ని పరిపూర్ణం చేసేవాడైన యేసువైపు చూస్తూ, 2మన ముందు ఉన్న పరుగు పందెంలో ఓపికతో పరుగెడదాము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కోసం సిలువను భరించి దానివల్ల కలిగే అవమానాలను లక్ష్యపెట్టక, ఇప్పుడు దేవుని సింహాసనానికి కుడి వైపున కూర్చుని ఉన్నారు. 3పాపుల నుండి అలాంటి వ్యతిరేకతను భరించిన వ్యక్తిని గురించి ఆలోచించండి, తద్వారా మీరు అలసట చెందరు, మీ హృదయాలు క్రుంగిపోవు.
దేవుడు తన పిల్లలకు క్రమశిక్షణ ఇస్తారు
4మీరు పాపంతో పోరాడటంలో మీ రక్తం చిందేంతగా ప్రతిఘటించలేదు. 5తండ్రి తన కుమారునితో మాట్లాడినట్లుగా ఆయన మీతో ప్రోత్సాహకరంగా మాట్లాడిన మాటలను పూర్తిగా మరచిపోయారా? అవి ఇలా చెప్తున్నాయి,
“నా కుమారుడా, ప్రభువు క్రమశిక్షణను చులకనగా చూడకు,
ఆయన నిన్ను గద్దించినపుడు నీవు నిరాశ చెందకు,
6ఎందుకంటే, ప్రభువు తాను ప్రేమించేవారిని క్రమశిక్షణలో ఉంచుతారు,
తన కుమారునిగా అంగీకరించిన ప్రతివారికి ఆయన శిక్షణనిస్తారు.”#12:6 సామెత 3:11,12
7మీరు పొందే బాధలన్నిటిని క్రమశిక్షణగా సహించండి; ఎందుకంటే దేవుడు మిమ్మల్ని తన కుమారులుగా భావిస్తున్నాడు. తమ తండ్రిచేత క్రమశిక్షణ పొందని కుమారుడెవడు? 8అందరు క్రమశిక్షణ పొందినట్లు మీరు క్రమశిక్షణ పొందకపోతే చట్టబద్ధమైన సంతానం అవ్వరు మీరు నిజమైన కుమారులు కుమార్తెలు కారు. 9మనల్ని క్రమశిక్షణలో పెంచిన మానవ తండ్రులను మనమందరం కలిగి ఉన్నాం, ఈ విషయంలో వారిని గౌరవిస్తాము. అలాగే ఆత్మలకు తండ్రియైన దేవునికి మనం ఇంకా ఎంత అధికంగా లోబడి జీవించాలి! 10తాము మంచిదని తలంచిన విధంగా మన తండ్రులు కొంతకాలం మనల్ని క్రమశిక్షణలో పెంచారు కాని దేవుడు తన పరిశుద్ధతలో మనం పాలుపంచుకోవడానికి మన మేలు కొరకే ఆ క్రమశిక్షణలో ఉంచాడు. 11ఆ సమయంలో ఏ క్రమశిక్షణా ఆనందంగా అనిపించదు కాని బాధగా అనిపిస్తుంది. కాని దాని ద్వారా శిక్షణ పొందినవారు నీతి సమాధానం అనే పంట కోస్తారు.
12కాబట్టి, దుర్బలమైన మీ చేతులను బలహీనమైన మీ మోకాళ్లను బలపరచండి. 13కుంటివారు పడిపోకుండా వారు స్వస్థత పొందేలా, “మీ పాదాల కోసం సమమైన మార్గాలను తయారుచేయండి.”#12:13 సామెత 4:26
హెచ్చరిక ప్రోత్సాహం
14అందరితో సమాధానం కలిగి జీవించడానికి, పరిశుద్ధులుగా ఉండడానికి ప్రతి ప్రయత్నం చేయండి; పరిశుద్ధత లేకుండ ఎవరు ప్రభువును చూడలేరు. 15దేవుని కృపను పొందడంలో ఎవరు తప్పిపోకుండా, చేదైన వేరు మొలిచి మిమ్మల్ని కలవరపరచి అనేకమందిని అపవిత్రులుగా చేయకుండా జాగ్రత్తపడండి. 16లైంగిక అనైతికతను సాగించేవారు గాని ఒక్కపూట తిండి కోసం జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్న ఏశావులాంటి దైవభక్తిలేని వారు గాని మీలో లేకుండ జాగ్రత్తపడండి. 17ఆ తర్వాత ఏశావు ఆ ఆశీర్వాదాన్ని పొందాలని అనుకున్నప్పుడు అతడు పొందలేక పోయాడని మీకు తెలుసు. ఎందుకంటే అతడు పశ్చాత్తాపపడేప్పటికి చాలా ఆలస్యమైంది. అతడు కన్నీటితో వెదకినా, తాను చేసిన దాన్ని మార్చలేకపోయాడు.
భయం కలిగించే పర్వతం ఆనందం కలిగించే పర్వతం
18తాకగల పర్వతం దగ్గరకు మీరు రాలేదు అది అగ్నితో మండుతుంది; చీకటి, కారు మబ్బు, తుఫాను; 19ఒక బూర శబ్దం లేదా అలాంటి గంభీరస్వరంతో మాట్లాడే చోటుకు మీరు రాలేదు. ఆ స్వరం యొక్క మాటలు విన్న వారు తమతో ఇంకొక్క మాట మాట్లాడకూడదని బ్రతిమాలుకొన్నారు, 20“ఒకవేళ ఒక జంతువైనా ఆ పర్వతాన్ని తాకితే, రాళ్లతో కొట్టబడి చంపబడాలి”#12:20 నిర్గమ 19:12,13 అని ఇవ్వబడిన ఆజ్ఞను వారు భరించలేకపోయారు. 21ఆ దృశ్యం చాలా భయానకం కాబట్టి మోషే, “నేను భయంతో వణుకుతున్నాను”#12:21 ద్వితీ 9:19 అన్నాడు.
22అయితే మీరు సీయోను పర్వతానికి, సజీవ దేవుని పట్టణమైన పరలోకపు యెరూషలేముకు వచ్చారు. మీరు సంతోషకరమైన సభలో వేలాదిమంది దేవదూతల దగ్గరకు వచ్చారు. 23పరలోకంలో పేర్లు వ్రాయబడి ఉన్న దేవుని జ్యేష్ఠ సంతానమనే సంఘానికి మీరు వచ్చారు. మనుష్యులందరికి న్యాయాధిపతియైన దేవుని దగ్గరకు, నిర్దోషులుగా తీర్చబడిన నీతిమంతుల్లా పరిపూర్ణత పొందిన ఆత్మల దగ్గరకు మీరు వచ్చారు. 24క్రొత్త నిబంధనకు మధ్యవర్తియైన యేసు దగ్గరకు, హేబెలు రక్తంకంటే ఉత్తమంగా మాట్లాడే చిందించబడిన రక్తం దగ్గరకు మీరు వచ్చారు.
25మాట్లాడుతున్నవానిని మీరు తిరస్కరించకుండా చూసుకోండి. భూమి మీద హెచ్చరించిన వానిని తిరస్కరించినవారు తప్పించుకోలేకపోతే, ఇక పరలోకం నుండి మనల్ని హెచ్చరించే వానిని మనం తిరస్కరిస్తే, మనమెలా తప్పించుకోగలం? 26ఆ సమయంలో ఆయన స్వరానికి భూమి కంపించింది, కాని ఆయన ఇప్పుడు, “మరోసారి నేను భూమిని మాత్రమే కాక పరలోకాన్ని కూడ కంపింపజేస్తాను”#12:26 హగ్గయి 2:6 అని వాగ్దానం చేశాడు. 27“ఇంకొకసారి” అనే మాట కదలనివి నిలిచి ఉండేలా కదిలింపబడేవి అంటే సృష్టింపబడినవి తీసివేయబడతాయి అని అర్థాన్నిస్తుంది.
28మనం నిశ్చలమైన రాజ్యాన్ని పొందుకొంటున్నాం కాబట్టి, కృతజ్ఞతగలవారమై, భయభక్తులతో ఆమోదయోగ్యమైన రీతిలో దేవుని ఆరాధిద్దాం, 29ఎందుకంటే మన “దేవుడు దహించు అగ్ని.”#12:29 ద్వితీ 4:24
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
హెబ్రీ పత్రిక 12: TSA
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
Telugu Contemporary Version, Holy Bible
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Used with permission. All rights reserved worldwide.