హెబ్రీ పత్రిక 4
4
దేవుని ప్రజలకు విశ్రాంతి
1అందువల్ల, ఆయన విశ్రాంతిలోకి ప్రవేశిస్తామన్న వాగ్దానం ఇప్పటికీ ఉంది కాబట్టి, మీలో ఎవరూ దాన్ని పొందలేని పరిస్థితిలో లేకుండా జాగ్రత్తపడదాము. 2ఎందుకంటే సువార్త వారికి ప్రకటించబడిన విధంగానే మనకు ప్రకటించబడింది; అయితే సువార్తకు విధేయత చూపించినవారితో వారు విశ్వాసంతో కలిసి ఉండలేదు కాబట్టి విన్న సువార్త వారికి ప్రయోజనంగా లేదు. 3అయితే విశ్వసించిన మనం ఆ విశ్రాంతిలో ప్రవేశిస్తాము. అయితే దేవుడు ఇలా అన్నారు,
“ ‘కాబట్టి వారు ఎన్నడు నా విశ్రాంతిలో ప్రవేశింపరు’
అని నేను కోపంలో ప్రమాణం చేశాను.”#4:3 కీర్తన 95:11; 5
ఆయన తన కార్యాలన్ని లోకాన్ని సృష్టించినప్పుడే పూర్తి చేశారు. 4దేవుడు ఏడవ దినాన్ని గురించి ఇంకొక చోట ఇలా అన్నారు: “దేవుడు ఏడవ రోజున తన పనులన్నిటిని నుండి విశ్రాంతి తీసుకున్నారు.”#4:4 ఆది 2:2 5పై వచనంలో ఆయన, “వారు ఎన్నడు నా విశ్రాంతిలో ప్రవేశింపరు” అని అన్నారు.
6అయితే కొందరు ఆ విశ్రాంతిని గురించిన సువార్తను విన్నా కూడ తాము విన్నవాటిని వారు నమ్మలేదు కాబట్టి ఆ విశ్రాంతిలోనికి ప్రవేశించలేకపోయారు. 7మరల దేవుడు ఒక దినాన్ని సిద్ధపరచి దాన్ని “నేడు” అని పిలిచారు. వాక్యంలో వ్రాయబడిన ప్రకారం చాలా కాలం తర్వాత ఆయన దావీదు ద్వారా కూడా ఇదే మాటను మాట్లాడారు:
“నేడు, ఆయన స్వరాన్ని మీరు వింటే,
మీ హృదయాలను కఠినం చేసుకోకండి.”#4:7 కీర్తన 95:7,8
8ఒకవేళ యెహోషువ వారికి విశ్రాంతి ఇచ్చి ఉంటే, దేవుడు మరొక దినాన్ని గురించి మాట్లాడి ఉండేవాడు కాడు. 9కాబట్టి దేవుని ప్రజలకు ఏడవ రోజు సబ్బాతు దినం; 10ఎవరైనా దేవుని విశ్రాంతిలోకి ప్రవేశిస్తే, దేవుడు తన పనుల నుండి విశ్రాంతి పొందినట్లే, వారు కూడా తమ పనుల నుండి విశ్రాంతి పొందుతారు. 11కాబట్టి, వారి అవిధేయత మాదిరిని అనుసరించి ఎవరూ నశించిపోకుండా ప్రతి ప్రయత్నాన్ని చేసి దేవుని విశ్రాంతిలో ప్రవేశిద్దాము.
12దేవుని వాక్యం సజీవమైనది చురుకైనది. అది రెండంచులు కలిగిన ఏ ఖడ్గం కన్నా పదును కలిగి, ప్రాణాన్ని, ఆత్మను, కీళ్ళను, మూలుగను వేరు చేస్తూ లోనికి చొచ్చుకొని పోతూ, హృదయం యొక్క ఆలోచనలను, వైఖరిని పరీక్షిస్తుంది. 13సృష్టి అంతటిలో దేవుని దృష్టి నుండి దాచబడింది ఏది లేదు. మనం ఎవరికి లెక్క అప్పగించాల్సి ఉందో ఆయన కళ్లెదుట ప్రతిదీ తెరవబడి స్పష్టంగా ఉంది.
యేసు గొప్ప ప్రధాన యాజకుడు
14కాబట్టి, పరలోకానికి ఎక్కివెళ్లిన#4:14 గ్రీకులో ఆకాశాల గుండా వెళ్లినవాడు దేవుని కుమారుడైన యేసు అనే గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు కాబట్టి మనం అంగీకరించిన విశ్వాసాన్ని గట్టిగా పట్టుకుందాము. 15అయితే మన ప్రధాన యాజకుడు మనలానే అన్ని విధాలుగా శోధించబడినప్పటికి ఆయన పాపం చేయలేదు కాబట్టి మన బలహీనతల గురించి సానుభూతి చూపించేవాడు. 16కాబట్టి మన అవసర సమయంలో సహాయపడేలా కనికరం కృప పొందడానికి మనం ధైర్యంగా దేవుని కృపా సింహాసనాన్ని సమీపిద్దాము.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
హెబ్రీ పత్రిక 4: TSA
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
Telugu Contemporary Version, Holy Bible
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Used with permission. All rights reserved worldwide.