హెబ్రీయులకు 5

5
1ప్రతి ప్రధాన యాజకుడు ప్రజల నుండి ఎన్నుకోబడి, దేవునికి సంబంధించిన విషయాల్లో ప్రజల ప్రతినిధిగా పాప పరిహార బలులను కానుకలను అర్పించడానికి నియమించబడ్డాడు. 2తాను కూడా బలహీనతలకు గురైనవానిగా ఉన్నా, అవివేకులైన వారిని దారి తప్పిపోతున్న వారిని దయతో నడిపించగల సమర్ధుడు. 3ఈ కారణంగా, అతడు తన పాపాల కొరకు అలాగే ప్రజల పాపాల కొరకు బలి అర్పించాల్సివుంది. 4ఈ గౌరవాన్ని ఎవరు తమంతట తాము పొందలేరు, కాని అహరోను ఎలా పిలువబడ్డాడో అలాగే దేవుని చేత పిలువబడినప్పుడు వారు దానిని పొందుకుంటారు.
5అదేరీతిగా, క్రీస్తు కూడా ప్రధాన యాజకునిగా అవ్వడానికి తనంతట తానే మహిమను తీసుకోలేదు. అయితే దేవుడే ఆయనతో ఇలా అన్నారు,
“నీవు నా కుమారుడవు;
ఈ రోజు నేను నీకు తండ్రిని అయ్యాను.”#5:5 కీర్తన 2:7
6మరొక చోట ఆయన ఇలా అన్నారు,
“మెల్కీసెదెకు క్రమంలో,
నీవు నిరంతరం యాజకునిగా ఉన్నావు.”#5:6 కీర్తన 110:4
7యేసు భూమి మీద జీవించిన రోజులలో, మరణం నుండి తనను రక్షించడానికి శక్తి కలిగిన దేవునికి తీవ్రమైన రోదనతో, కన్నీళ్లతో ప్రార్థనలు విన్నపాలు అర్పించారు, ఆయనకున్న భక్తి విధేయతల కారణంగా దేవుడు ఆయన ప్రార్థనలు ఆలకించారు. 8ఆయన కుమారుడై ఉండి కూడా, తాను అనుభవించిన శ్రమల ద్వారా విధేయతను నేర్చుకొన్నారు, 9ఆయన పరిపూర్ణుడవ్వగానే తనకు లోబడే వారందరికి శాశ్వతమైన రక్షణకు మూలాధారం అయ్యారు. 10మెల్కీసెదెకు క్రమంలో ప్రధాన యాజకునిగా దేవుని చేత నియమింపబడ్డారు.
పడిపోకుండా ఉండాలని హెచ్చరిక
11దీనిని గురించి మేము చెప్పాల్సింది చాలా ఉంది కాని, గ్రహించడానికి మీరు ఏ మాత్రం ప్రయత్నించడం లేదు కనుక మీకు వివరించడం కష్టం. 12నిజానికి, ఈ సమయానికి మీరు బోధకులై ఉండాల్సింది, కాని ఇప్పటికి మీకు మరొకరు దేవుని వాక్యంలోని ప్రాథమిక సత్యాలను బోధించాల్సిన అవసరం ఉంది. బలమైన ఆహారం కాదు, మీకు పాలు అవసరం. 13పాలు త్రాగుతూ జీవించేవారు ఇంకా శిశువుగానే ఉన్నారు, కనుక నీతిని గురించిన బోధతో పరిచయం లేదు. 14అయితే బలమైన ఆహారం పరిణతి చెందినవారికి, అంటే ఎవరైతే నిరంతరం ఉపయోగించడం ద్వారా తమకు తాముగా మంచి చెడులను వేరు చేసే తర్ఫీదు పొందుకున్నవారికి.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

హెబ్రీయులకు 5: TCV

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి