6
1అందువల్ల మనం క్రీస్తు గురించిన ప్రాధమిక బోధన అంటే, మరణానికి దారితీసే చర్యల నుండి పశ్చాత్తాపం, దేవుని యందు విశ్వాసముంచడం వంటి వాటితో మళ్ళీ పునాదిని మళ్ళీ వేయక, దానికి మించి, పరిపక్వతకు వైపుకు వెళ్దాం, 2శుద్ధీకరణ ఆచారాలు,#6:2 శుద్ధీకరణ ఆచారాలు బాప్తిస్మం గురించి హస్త నిక్షేపణ, మృతుల పునరుత్థానం, మరియు నిత్య తీర్పు గురించిన మళ్ళీ ఉపదేశం అవసరం లేదు. 3దేవుడు అనుమతిస్తే, మనం అలా చేద్దాం.
4ఒకసారి వెలిగించబడి, పరలోకసంబంధమైన వరాలను అనుభవపూర్వకంగా తెలుసుకొని, పరిశుద్ధాత్మలో పాలిభాగస్థులై, 5దేవుని వాక్యం యొక్క అనుగ్రహాన్ని, భవిష్యత్కాలాల శక్తుల ప్రభావాలను రుచి చూసినప్పటికి, 6తప్పిపోయినవారిని#6:6 తప్పిపోయినవారిని వారు తప్పిపోయినచో తిరిగి పశ్చాత్తాపం వైపుకు నడిపించడం అసాధ్యం. అలాంటివారు తమ నాశనానికే దేవుని కుమారుని మళ్ళీ సిలువవేస్తూ, ఆయనను బహిరంగంగా అవమానానికి గురిచేస్తున్నారు. 7భూమి తనపై తరచుగా కురిసే వర్షపు నీటిని త్రాగి, దానిపై వ్యవసాయం చేసేవారికి ప్రయోజనకరమైన పంటను ఇస్తుండగా పండించినవారు దాన్ని దేవుని దీవెనగా పొందుతున్నారు. 8అయితే ముళ్లపొదలను కలుపు మొక్కలను పండించే భూమి విలువలేనిదై శాపానికి గురి అవుతుంది ఆ తరువాత చివరిలో అది కాల్చి వేయబడుతుంది.
9అయితే ప్రియమైనవారలారా, మేము ఇలా మాట్లాడుతున్నప్పటికి, మీ రక్షణ గురించి మంచి సంగతులు ఉన్నాయని మేము నిశ్చయంగా ఉన్నాం. 10దేవుడు అన్యాయస్థుడు కాడు; ఆయనపై మీరు చూపిస్తున్న ప్రేమను బట్టి ఆయన ప్రజలకు మీరు చేసిన చేస్తున్న సహాయాన్ని మరచిపోయేవాడు కాడు. 11మీలో ప్రతి ఒక్కరు, మీరు కలిగివున్న నిరీక్షణ పరిపూర్ణమయ్యేలా ఇదే ఆసక్తిని చివరి వరకు చూపించాలని మేము కోరుతున్నాం. 12అంతేగాక, మీరు సోమరులుగా ఉండక, విశ్వాసం, ఓర్పు ద్వారా వాగ్దానం చేయబడినదానికి వారసులైన వారిని మీరు అనుకరించాలని మేము కోరుతున్నాం.
దేవుని వాగ్దానం యొక్క నిశ్చయత
13దేవుడు అబ్రాహాముకు వాగ్దానం చేసినపుడు, ఆయన కంటే గొప్పవాడు మరియొకడు లేడు కనుక ఆయన తన మీదనే ప్రమాణం చేసి, 14“నిశ్చయంగా నేను నిన్ను దీవిస్తాను నీ సంతానాన్ని అభివృద్ధి చేస్తాను” అని చెప్పారు. 15ఓర్పుతో వేచివున్న తరువాత, చేయబడిన వాగ్దానఫలాన్ని అబ్రాహాము పొందుకొన్నాడు.
16ప్రజలు ప్రమాణం చేసినప్పుడు తమ కంటె గొప్పవారి తోడని ప్రమాణం చేస్తారు, దాంతో వారి అన్ని వివాదాలు అంతమైపోతాయి. 17తన వాగ్దానానికి వారసులైన వారికి తన మార్పులేని స్వభావంలోని ఉద్దేశాన్ని స్పష్టం చేయడానికి దేవుడు తాను చేసిన వాగ్దానాన్ని ప్రమాణంతో దృఢపరిచారు. 18దేవుడు అబద్ధమాడడం అసాధ్యమైన రెండు మార్పులేని విషయాల ద్వారా, మన ముందు ఉంచిన నిరీక్షణను పట్టుకోవడానికి పరుగెత్తిన మనలను ఎంతో ప్రోత్సహించగలిగేలా, దేవుడు ఇలా చేశారు. 19మనకు ఉన్న ఈ నిరీక్షణ మన ఆత్మకు లంగరులా స్థిరపరచి భద్రపరుస్తుంది. ఇది తెర వెనుక ఉన్న అతి పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశింప చేస్తుంది. 20అక్కడే యేసు మనకంటె ముందుగా మెల్కీసెదెకు క్రమం ప్రకారం నిరంతరం ప్రధాన యాజకునిగా మన పక్షాన దానిలోనికి ప్రవేశించారు.