యెషయా 46
46
బబులోను దేవుళ్ళు
1బేలు మోకరిస్తుంది, నెబో క్రిందికి వంగుతుంది.
వాటి విగ్రహాలను బరువులు మోసే జంతువులు#46:1 లేదా జంతువులు, పశువులు మోస్తాయి.
ఆ బరువైన ప్రతిమలను మోయడం కష్టం,
అలసిపోయిన పశువులకు భారము.
2అవన్నీ కలిసి వంగి మోకరిస్తాయి;
ఆ బరువును తప్పించుకోలేక
అవి కూడా బందీలుగా పట్టుబడతాయి.
3“యాకోబు వారసులారా, నా మాట వినండి,
ఇశ్రాయేలు ప్రజల్లో మిగిలిన వారలారా, నా మాట వినండి,
మీ పుట్టుక నుండి నేను మిమ్మల్ని నిలబెట్టాను,
మీరు పుట్టినప్పటి నుండి నేను మిమ్మల్ని మోసాను.
4మీ వృద్ధాప్యం వరకు, వెంట్రుకలు తెల్లగా అయ్యేవరకు
నేను, నేనే మిమ్మల్ని నిలబెడతాను.
నేనే మిమ్మల్ని చేశాను, నేనే మిమ్మల్ని మోస్తాను.
నేనే మిమ్మల్ని నిలబెడతాను, నేనే మిమ్మల్ని రక్షిస్తాను.
5“మీరు నన్ను ఎవరితో పోలుస్తారు, ఎవరితో సమానంగా ఎంచుతారు?
నాతో సమానమని ఎవరిని మీరు నాకు పోటీగా ఉంచుతారు?
6కొంతమంది తమ సంచుల నుండి బంగారం కుమ్మరించి
వెండిని తీసుకువచ్చి బరువు తూచి,
తమకు దేవున్ని తయారుచేయడానికి కంసాలిని నియమిస్తారు,
తర్వాత దానికి నమస్కరించి పూజిస్తారు.
7వారు దానిని తమ భుజాలపై ఎత్తుకుని మోస్తారు;
దాని చోటులో దానిని నిలబెడతారు,
ఆ చోటు నుండి అది కదల్లేదు.
ఎవరైనా దానికి మొరపెట్టినా, అది జవాబివ్వలేదు;
వారి కష్టాల నుండి వారిని రక్షించలేదు.
8“దీనిని జ్ఞాపకం ఉంచుకోండి, మనస్సులో పెట్టుకోండి,
తిరుగుబాటు చేసే మీరు మీ హృదయంలో పెట్టుకోండి,
9చాలా కాలం క్రితం జరిగిన వాటిని జ్ఞాపకం చేసుకోండి;
నేనే దేవుడను, వేరే ఎవరూ లేరు;
నేను దేవుడును, నాలా ఎవరూ లేరు.
10నేనే మొదటి నుండి చివర కలుగబోయే వాటిని ప్రకటిస్తాను.
పూర్వకాలం నుండి రాబోయే వాటిని తెలియజేస్తాను.
‘నా ఉద్దేశం నిలబడుతుంది
నాకు ఏది ఇష్టమో, అదంతా చేస్తాను’ అని నేను చెప్తున్నాను.
11తూర్పు నుండి క్రూరపక్షిని రప్పిస్తాను;
దూరదేశం నుండి నా ఉద్దేశాన్ని నెరవేర్చే వానిని పిలుస్తాను.
నేను చెప్పిన దానిని నెరవేరుస్తాను;
నా ప్రణాళిక ప్రకారం నేను చేస్తాను.
12మొండి హృదయంతో నా నీతికి దూరంగా ఉన్నవారలారా,
నా మాట వినండి.
13నా నీతిని దగ్గరకు తెస్తున్నాను.
అది దూరంగా లేదు;
నా రక్షణ ఆలస్యం కాదు.
నేను సీయోనుకు రక్షణను
ఇశ్రాయేలుకు నా వైభవాన్ని ఇస్తున్నాను.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
యెషయా 46: TSA
హైలైట్
షేర్ చేయి
కాపీ
![None](/_next/image?url=https%3A%2F%2Fimageproxy.youversionapistaging.com%2F58%2Fhttps%3A%2F%2Fweb-assets.youversion.com%2Fapp-icons%2Fte.png&w=128&q=75)
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
Telugu Contemporary Version, Holy Bible
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Used with permission. All rights reserved worldwide.