యిర్మీయా 44
44
విగ్రహారాధన వలన విపత్తు
1ఈజిప్టులోని మిగ్దోలు, తహ్పన్హేసు, మెంఫిసులో, పత్రూసులో నివసిస్తున్న యూదులందరి గురించి యిర్మీయాకు ఈ వాక్కు వచ్చింది: 2“ఇశ్రాయేలు దేవుడు, సైన్యాల యెహోవా ఇలా చెప్తున్నారు: యెరూషలేము మీదా యూదా పట్టణాలన్నింటి మీదా నేను తెచ్చిన మహా విపత్తును మీరు చూశారు. వారు చేసిన దుర్మార్గం కారణంగా నేడు అవి నిర్జనమై శిథిలావస్థలో ఉన్నాయి. 3వారికి గాని, మీకు గాని, మీ పూర్వికులకు గాని ఎన్నడూ తెలియని ఇతర దేవతలకు వారు ధూపం వేసి, పూజించి వారు నా కోపాన్ని రెచ్చగొట్టారు. 4‘నేను అసహ్యించుకునే ఈ అసహ్యకరమైన పనిని చేయవద్దు!’ అని చెప్పమని మళ్ళీ మళ్ళీ నేను నా సేవకులైన ప్రవక్తలను పంపాను, వారు వెళ్లి చెప్పారు. 5కానీ వారు వినలేదు, అసలు పట్టించుకోలేదు. వారు తమ దుర్మార్గాన్ని విడిచిపెట్టలేదు, ఇతర దేవతలకు ధూపం వేయడం ఆపలేదు. 6కాబట్టి, నా తీవ్రమైన కోపం యూదా పట్టణాల మీదా, యెరూషలేము వీధుల మీదా కుమ్మరించబడి వాటిని నేటి వరకు పాడైపోయిన శిథిలాలుగా మిగిల్చింది.
7“ఇశ్రాయేలు దేవుడు, సైన్యాల యెహోవా దేవుడు ఇలా అంటున్నారు: యూదాలో స్త్రీలూ, పురుషులు, పిల్లలు, పసిపిల్లలు ఎవరూ ఉండకుండా నిర్మూలం అయ్యేలా, మీలో ఎవరూ మిగలకుండా మీ మీదికి మీరే విపత్తు ఎందుకు తెచ్చుకుంటున్నారు? 8మీరు నివసించడానికి వచ్చిన ఈజిప్టులో ఇతర దేవుళ్ళకు ధూపం వేస్తూ, మీ చేతులు చేసిన వాటితో ఎందుకు నా కోపాన్ని రెచ్చగొడుతున్నారు? మిమ్మల్ని మీరు నాశనం చేసుకుంటారు, భూమిపై ఉన్న అన్ని దేశాల మధ్య మిమ్మల్ని మీరు ఒక శాపంగా చేసుకుంటారు, అవమానం పాలవుతారు. 9మీ పూర్వికులు, యూదా రాజులు, రాణులు చేసిన దుర్మార్గాన్ని, యూదా దేశంలో, యెరూషలేము వీధుల్లో మీరు, మీ భార్యలు చేసిన దుర్మార్గాన్ని మీరు మరచిపోయారా? 10ఈ రోజు వరకు వారు తమను తాము తగ్గించుకోలేదు, గౌరవం చూపించలేదు, నేను మీ ముందు, మీ పూర్వికుల ముందు ఉంచిన నా ధర్మశాస్త్రాన్ని శాసనాలను మీరు అనుసరించలేదు.
11“కాబట్టి ఇశ్రాయేలు దేవుడు, సైన్యాల యెహోవా ఇలా అంటున్నారు: నేను మీ మీదికి విపత్తు తెచ్చి యూదా అంతటిని నాశనం చేయాలని నిశ్చయించుకున్నాను. 12ఈజిప్టుకు వెళ్లి అక్కడ స్థిరపడాలని నిశ్చయించుకున్న యూదా వారిలో మిగిలి ఉన్నవారిని నేనే అక్కడికి తీసుకువెళ్తాను. వారంతా ఈజిప్టులో నశిస్తారు; వారు ఖడ్గం వల్ల చనిపోతారు లేదా కరువుతో చనిపోతారు. సామాన్యుల నుండి గొప్పవారి వరకు, వారు ఖడ్గం చేత గాని కరువుచేత గాని చనిపోతారు. వారు శాపంగాను, భయం పుట్టించే వారుగాను; ఒక శాపంగాను నిందకు కారణమైనవారిగాను అవుతారు. 13నేను యెరూషలేమును ఎలా శిక్షించానో ఈజిప్టులో నివసించేవారిని కూడా ఖడ్గంతో, కరువుతో, తెగులుతో అలాగే శిక్షిస్తాను. 14ఈజిప్టులో నివసించడానికి వెళ్లిన యూదా వారిలో మిగిలి ఉన్న వారెవరూ తప్పించుకోలేరు, ఎక్కడికైతే తిరిగివెళ్లి జీవించాలని అనుకుంటున్నారో, ఆ యూదా దేశానికి ప్రాణాలతో తిరిగి వెళ్లరు; పారిపోయిన కొంతమంది తప్ప ఎవరూ తిరిగి వెళ్లరు.”
15అప్పుడు తమ భార్యలు ఇతర దేవుళ్ళకు ధూపం వేస్తున్నారని తెలిసిన పురుషులు, అక్కడ ఉన్న స్త్రీలందరు పెద్ద సమాజంగా చేరి దిగువ ఎగువ ఈజిప్టులో అనగా పత్రూసులో నివసిస్తున్న ప్రజలందరూ యిర్మీయాతో ఇలా అన్నారు, 16“యెహోవా పేరిట నీవు మాతో చెప్పిన సందేశాన్ని మేము వినము. 17ఖచ్చితంగా మాకు ఇష్టం వచ్చినట్లే మేము చేస్తాము: మేము, మా పూర్వికులు, మా రాజులు మా అధికారులు యూదా పట్టణాల్లో, యెరూషలేము వీధుల్లో చేసినట్లుగా మేము కూడా ఆకాశ రాణికి ధూపం వేస్తాము ఆమెకు పానార్పణలు అర్పిస్తాము. ఆ సమయంలో మాకు పుష్కలంగా ఆహారం ఉండింది, మేము బాగున్నాం, ఎలాంటి హాని జరగలేదు. 18ఆకాశ రాణికి ధూపం వేయడం ఆమెకు పానార్పణలు అర్పించడం మానివేసినప్పటి నుండి మా దగ్గర ఏమి లేకుండా పోయింది, మేము ఖడ్గం చేత కరువుచేత నాశనమవుతున్నాము.”
19ఆ స్త్రీలు ఇంకా ఇలా అన్నారు: “మేము ఆకాశ రాణికి ధూపం వేసి, ఆమెకు పానార్పణలు అర్పించినప్పుడు, మేము ఆమె ప్రతిమకు నచ్చిన రొట్టెలు చేసి, ఆమెకు పానార్పణలు అర్పిస్తున్నామని మా భర్తలకు తెలియదా?” అని అన్నారు.
20అప్పుడు యిర్మీయా తనకు జవాబిస్తున్న స్త్రీ పురుషులందరితో ఇలా అన్నాడు: 21“మీరు, మీ పూర్వికులు, మీ రాజులు, మీ అధికారులు దేశ ప్రజలు, యూదా పట్టణాల్లోనూ యెరూషలేము వీధుల్లోనూ ధూపం వేసిన విషయం యెహోవా గుర్తుంచుకుని జ్ఞాపకం తెచ్చుకోలేదా? 22మీ దుష్ట కార్యాలను, మీరు చేసిన అసహ్యకరమైన పనులను యెహోవా ఇక భరించలేనప్పుడు, మీ దేశం నేడు ఉన్నట్లుగా శాపంగా, నివాసులు లేని నిర్జనమైనదిగా మారింది. 23ఎందుకంటే మీరు ధూపం వేసి, యెహోవాకు వ్యతిరేకంగా పాపం చేసి, ఆయనకు విధేయత చూపలేదు, ఆయన ధర్మశాస్త్రాన్ని, ఆయన శాసనాలను, ఆయన నిబంధనలను అనుసరించలేదు కాబట్టి ఇప్పుడు మీరు చూస్తున్నట్లుగా ఈ విపత్తు మీ మీదికి వచ్చింది.”
24అప్పుడు యిర్మీయా స్త్రీలతో సహా ప్రజలందరితో, “ఈజిప్టులోని యూదా ప్రజలారా, యెహోవా మాట వినండి. 25ఇశ్రాయేలు దేవుడైన సైన్యాల యెహోవా ఇలా అంటున్నారు: ‘ఆకాశ రాణికి ధూపం వేస్తాం, ఆమెకు పానార్పణలు అర్పిస్తాం, మేము మ్రొక్కుకున్న మ్రొక్కుబడులను నిశ్చయంగా నెరవేరుస్తాం’ అని మీరు మీ భార్యలు ప్రమాణం చేసినట్టే మీరు చేశారు.
“అయితే సరే అలాగే కానివ్వండి, మీరు వాగ్దానం చేసినట్లు చేయండి! మీ మ్రొక్కుబడులను చెల్లించుకోండి! 26అయితే ఈజిప్టులో నివసిస్తున్న యూదులారా, యెహోవా మాట వినండి: ‘నా గొప్ప నామం తోడు’ అంటూ యెహోవా ఇలా చెప్తున్నారు, ‘ఈజిప్టులో నివసించే యూదా వారెవరూ ఇకపై, “ప్రభువైన యెహోవా జీవం తోడు.” 27ఎందుకంటే నేను వారికి మేలు చేయాలని కాదు వారికి కీడు చేయడం కోసమే ఎదురు చూస్తున్నాను. ఈజిప్టులోని యూదులు పూర్తిగా నాశనమయ్యే వరకు ఖడ్గంతోను కరువుతోను చస్తారు. 28ఖడ్గం నుండి తప్పించుకుని ఈజిప్టు నుండి యూదా దేశానికి తిరిగి వచ్చేవారు చాలా తక్కువ. అప్పుడు ఈజిప్టులో నివసించడానికి వచ్చిన యూదా శేషులంతా ఎవరి మాట నెరవేరుతుందో! నాదో వారిదో అనేది తెలుసుకుంటారు.
29“ ‘నేను ఈ స్థలంలో నిన్ను శిక్షిస్తాను అనడానికి ఇది నీకు సూచనగా ఉంటుంది’ అని యెహోవా ప్రకటిస్తున్నారు, ‘తద్వార నీకు హాని చేస్తాననే నా బెదిరింపులు తప్పక నిజమవుతాయని మీరు తెలుసుకుంటారు.’ 30యెహోవా ఇలా చెప్తున్నారు: ‘నేను ఎలాగైతే యూదా రాజైన సిద్కియాను బబులోను రాజైన నెబుకద్నెజరు చేతికి అప్పగించానో, అలాగే ఈజిప్టు రాజైన ఫరో హోఫ్రాను అతన్ని చంపాలనుకుంటున్న అతని శత్రువుల చేతులకు అప్పగించబోతున్నాను.’ ”
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
యిర్మీయా 44: TSA
హైలైట్
షేర్ చేయి
కాపీ

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
Telugu Contemporary Version, Holy Bible
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Used with permission. All rights reserved worldwide.