యిర్మీయా 50
50
బబులోను గురించిన సందేశం
1బబులోను గురించి, బబులోనీయుల దేశం గురించి యిర్మీయా ప్రవక్త ద్వారా యెహోవా చెప్పిన వాక్కు ఇది:
2“దేశాల మధ్య ప్రకటన చేసి, చాటించండి,
ఒక జెండాను ఎత్తి దాన్ని చాటించండి;
ఏదీ దాచకుండా ఇలా చెప్పండి,
‘బబులోను స్వాధీనం చేసుకోబడుతుంది;
బేలు దేవుడు సిగ్గుపరచబడతాడు,
మర్దూకు దేవత పడవేయబడుతుంది.
బబులోను ప్రతిమలు సిగ్గుపరచబడతాయి,
దాని విగ్రహాలు పడద్రోయబడతాయి.’
3ఉత్తర దిక్కునుండి ఒక దేశం దానిపై దాడి చేసి
దాని దేశాన్ని పాడుచేస్తుంది.
దానిలో ఎవరూ నివసించరు;
మనుష్యులు పారిపోతారు జంతువులు పారిపోతాయి.
4“ఆ రోజుల్లో, ఆ సమయంలో,
ఇశ్రాయేలు ప్రజలు, యూదా ప్రజలు కలిసి
తమ దేవుడైన యెహోవాను వెదకడానికి కన్నీటితో వెళ్తారు”
అని యెహోవా ప్రకటిస్తున్నారు.
5వారు సీయోనుకు వెళ్లే దారి ఎటు అని అడిగి
ఆ దారిలో ప్రయాణిస్తారు.
వారు వచ్చి మరచిపోలేని
శాశ్వతమైన ఒడంబడికలో
యెహోవాకు కట్టుబడి ఉంటారు.
6“నా ప్రజలు తప్పిపోయిన గొర్రెలు;
వారి కాపరులు వారిని తప్పుత్రోవ పట్టించి
వారిని పర్వతాలమీద తిరిగేలా చేశారు.
వారు పర్వతాలు, కొండలమీద తిరుగుతూ,
తమ సొంత విశ్రాంతి స్థలాన్ని మరచిపోయారు.
7వారిని చూసినవారు వారిని మ్రింగివేశారు;
వారి శత్రువులు, ‘మేము దోషులం కాదు,
ఎందుకంటే వారు తమ నీతి సింహాసనమైన యెహోవాకు,
తమ పూర్వికుల నిరీక్షణయైన యెహోవాకు విరోధంగా పాపం చేశారు’ అని అన్నారు.
8“బబులోను నుండి పారిపోండి;
బబులోనీయుల దేశాన్ని విడిచిపెట్టండి,
మందను నడిపించే మేకపోతుల్లా ప్రజల ముందు నడవండి.
9నేను బబులోనుకు వ్యతిరేకంగా
ఉత్తర దేశం నుండి గొప్ప దేశాల కూటమిని రప్పిస్తాను.
వారు దానికి వ్యతిరేకంగా యుద్ధపంక్తులు తీర్చుతారు,
ఉత్తరం నుండి దాన్ని పట్టుకుంటారు.
వారి బాణాలు వట్టి చేతులతో తిరిగి రాని
నైపుణ్యం కలిగిన యోధుల వలె ఉంటాయి.
10కాబట్టి బబులోను దోచుకోబడుతుంది;
దాన్ని దోచుకునే వారందరూ సంతృప్తి చెందుతారు”
అని యెహోవా ప్రకటించాడు.
11“నా స్వాస్థ్యాన్ని దోచుకునేవారలారా,
అది మీకు సంతోషాన్ని ఆనందాన్ని కలిగించింది
ధాన్యం నూర్పిడి చేస్తున్న దూడలా
బలమైన గుర్రాల్లా మీరు సకిలిస్తున్నారు.
12నీ తల్లి చాలా సిగ్గుపడుతుంది;
నీకు జన్మనిచ్చిన ఆమె పరువు పోతుంది.
అది దేశాలన్నిటిలో నీచమైనదిగా
అరణ్యంగా, ఎండిన భూమిగా, ఎడారిగా ఉంటుంది.
13యెహోవా కోపం వలన అది నివాసయోగ్యంగా ఉండదు.
పూర్తిగా నిర్జనమైపోతుంది.
బబులోను దాటి వెళ్లే వారందరూ నివ్వెరపోతారు;
దాని గాయాలన్నిటిని బట్టి వారు ఎగతాళి చేస్తారు.
14“బబులోను చుట్టూ యుద్ధపంక్తులు తీరండి,
విల్లును వంచగలిగిన ప్రతి ఒక్కరు విల్లు లాగండి.
అది యెహోవాకు వ్యతిరేకంగా పాపం చేసింది,
దానిపై బాణాలు వేయండి! మీ బాణాలు దాచుకోవద్దు.
15అన్ని వైపుల నుండి దానిమీద కేకలు వేయండి!
అది లొంగిపోతుంది, దాని బురుజులు పడిపోయాయి,
దాని గోడలు కూలిపోయాయి.
ఇది యెహోవా ప్రతీకారం కాబట్టి,
దాని మీద ప్రతీకారం తీర్చుకోండి;
అది ఇతరులకు చేసినట్లు దానికి చేయండి.
16బబులోను నుండి విత్తేవారిని,
కొడవలితో కోత కోసేవారిని నిర్మూలం చేయండి.
అణచివేసే వారి ఖడ్గం కారణంగా
ప్రతి ఒక్కరూ తమ ప్రజల దగ్గరకు తిరిగి వెళ్తున్నారు,
ప్రతి ఒక్కరూ తమ సొంత దేశానికి పారిపోతున్నారు.
17“ఇశ్రాయేలు చెదరిపోయిన గొర్రెలు
సింహాలు వాటిని తరిమికొట్టాయి.
మొదట అష్షూరు రాజు
వాటిని మ్రింగివేశాడు;
చివరిగా బబులోను రాజైన నెబుకద్నెజరు
వాటి ఎముకలను విరగ్గొట్టాడు.”
18కాబట్టి ఇశ్రాయేలు దేవుడు, సైన్యాల యెహోవా ఇలా అంటున్నారు:
“నేను అష్షూరు రాజును శిక్షించినట్లే
బబులోను రాజును అతని దేశాన్ని శిక్షిస్తాను.
19అయితే నేను ఇశ్రాయేలీయులను వారి పచ్చిక బయళ్లకు తిరిగి రప్పిస్తాను,
వారు కర్మెలు బాషాను మీద మేస్తారు.
ఎఫ్రాయిం గిలాదు కొండలమీద
వారు తృప్తి చెందుతారు.”
20యెహోవా ప్రకటిస్తున్నదేంటంటే, “ఆ రోజుల్లో, ఆ సమయంలో,
ఇశ్రాయేలీయుల అపరాధాల కోసం వెదకుతారు,
కానీ అవి కనబడవు,
అలాగే యూదా కోసం వెదకుతారు,
కానీ అవి దొరకవు,
మిగిలి ఉన్నవారిని నేను క్షమిస్తాను.
21“మెరతాయీము మీద దాడి చేయండి.
పేకోదులో నివసించేవారి మీద దాడి చేయండి,”
వెంటాడి, వారిని చంపి పూర్తిగా నాశనం#50:21 ఇక్కడ హెబ్రీ పదం వస్తువులను లేదా వ్యక్తులను తిరిగి మార్చుకోలేని విధంగా యెహోవాకు అప్పగించడాన్ని సూచిస్తుంది, తరచుగా వాటిని పూర్తిగా నాశనం చేయడమే. చేయండి,
అని యెహోవా ప్రకటిస్తున్నారు.
“నేను నీకు ఆజ్ఞాపించినదంతా చేయండి.
22దేశంలో యుద్ధధ్వని,
మహా విధ్వంసపు ధ్వని వినబడుతుంది!
23మొత్తం భూమిని కొడుతున్న సుత్తి
ఎలా విరిగి పగిలిపోయిందో!
దేశాల మధ్య బబులోను
ఎలా నిర్జనమైపోయిందో చూడండి!
24బబులోనూ, నీ కోసం ఉచ్చు బిగించాను
అది నీకు తెలియకముందే దానిలో చిక్కుకున్నావు.
నీవు యెహోవాను వ్యతిరేకించావు కాబట్టి
నిన్ను కనుగొని బంధించాను.
25బబులోనీయుల దేశంలో
ప్రభువైన సైన్యాల యెహోవా చేయవలసిన పని ఉంది.
కాబట్టి యెహోవా తన ఆయుధశాలను తెరిచి
తన ఉగ్రతను తీర్చే ఆయుధాలను బయటకు తెచ్చారు.
26దూరం నుండి ఆమెపై దాడి చేయడానికి రండి.
ఆమె ధాన్యాగారాలు తెరవండి;
ధాన్యం కుప్పలా ఆమెను పోగు చేయండి.
దాన్ని పూర్తిగా నాశనం చేయండి
ఆమెలో దేన్ని వదలవద్దు.
27దాని కోడెలన్నిటినీ చంపండి;
వాటిని వధకు పంపండి!
వారికి శ్రమ దినం వచ్చింది,
వారు శిక్షించబడే సమయం వచ్చింది.
28బబులోను నుండి తప్పించుకొని పారిపోయినవారి శబ్దం వినిపిస్తుంది
మన దేవుడైన యెహోవా తన మందిరం కోసం
ఎలా ప్రతీకారం తీర్చుకున్నారో,
సీయోనులో ప్రకటించండి.
29“బబులోను మీదికి రమ్మని,
విలుకాండ్రను బాణాలు విసిరే వారిని పిలువండి.
ఆమె చుట్టూ చేరండి;
ఎవరూ తప్పించుకోకూడదు.
ఆమె చేసిన వాటికి ప్రతిఫలం ఇవ్వండి;
ఆమె చేసినట్లే ఆమెకు చేయండి.
ఇశ్రాయేలు పరిశుద్ధుడైన యెహోవాను
ఆమె ధిక్కరించింది.
30కాబట్టి, ఆమె యువకులు వీధుల్లో కూలిపోతారు;
ఆ రోజున ఆమె సైనికులందరూ మూగబోతారు”
అని యెహోవా ప్రకటిస్తున్నారు.
31సైన్యాల యెహోవా ఇలా ప్రకటిస్తున్నారు,
“అహంకారి, నేను నీకు వ్యతిరేకంగా ఉన్నాను,
నీ శ్రమ దినం వచ్చింది,
నీవు శిక్షించబడే సమయం వచ్చింది.
32గర్విష్ఠులు తడబడి పడిపోతారు
ఆమెను లేపడానికి ఎవరూ సహాయం చేయరు.
నేను ఆమె పట్టణాల్లో అగ్ని రాజేస్తాను
అది ఆమె చుట్టూ ఉన్నవారందరిని కాల్చివేస్తుంది.”
33సైన్యాల యెహోవా ఇలా అంటున్నారు:
“ఇశ్రాయేలు ప్రజలు,
యూదా ప్రజలు కూడా అణచివేయబడ్డారు.
వారిని బంధించినవారు వారిని పట్టుకొని ఉన్నారు
వారిని విడిచిపెట్టడానికి నిరాకరించారు.
34అయినా వారి విమోచకుడు బలవంతుడు;
ఆయన పేరు సైన్యాల యెహోవా.
ఆయన వారి దేశానికి విశ్రాంతిని తెచ్చేలా
వారి పక్షాన వాదిస్తారు,
బబులోనులో నివసించేవారికి అశాంతి కలుగుతుంది.”
35యెహోవా ఇలా ప్రకటిస్తున్నారు,
“బబులోనీయుల మీదికి
బబులోనులో నివసించేవారి మీదికి
దాని అధికారులు జ్ఞానుల మీదికి ఖడ్గం వస్తుంది.
36దాని అబద్ధ ప్రవక్తల మీదికి ఖడ్గం వస్తుంది!
వారు మూర్ఖులు అవుతారు.
దాని యోధుల మీదికి ఖడ్గం వస్తుంది!
వారు భయంతో నిండిపోతారు.
37దాని గుర్రాలు రథాల మీదికి
దానిలో ఉన్న విదేశీయులందరి మీదికి ఖడ్గం వస్తుంది!
వారు స్త్రీలలా బలహీనులవుతారు.
ఆమె సంపద మీదికి ఖడ్గం వస్తుంది!
దాన్ని దోచుకుంటారు.
38దానికి నీళ్ల కరువు వస్తుంది!
నీళ్లు ఎండిపోతాయి.
అది విగ్రహాల దేశం,
భయంకరమైన విగ్రహాల వల్ల ప్రజలు పిచ్చివారవుతారు.
39“కాబట్టి ఎడారి జీవులు, హైనాలు అక్కడ నివసిస్తాయి,
గుడ్లగూబ అక్కడ నివసిస్తుంది.
అది ఇంకెప్పుడు నివాసస్థలంగా ఉండదు
తరతరాల వరకు దానిలో ఎవరూ నివసించరు.
40సొదొమ గొమొర్రాలను వాటి చుట్టూ ఉన్న పట్టణాలతో పాటు
పడగొట్టినట్లు వీటిని కూడా చేసిన తర్వాత,
అక్కడ ఎవరూ నివసించనట్లే,
ఇక్కడ కూడా ఎవరూ నివసించరు”
అని యెహోవా అంటున్నారు.
41“చూడండి! ఉత్తర దిక్కునుండి ఒక సైన్యం వస్తుంది;
ఒక గొప్ప దేశం అనేకమంది రాజులు
భూదిగంతాల నుండి పురికొల్పబడతారు.
42వారు విల్లు, ఈటె పట్టుకుని ఉన్నారు;
వారు క్రూరులు, కనికరం లేనివారు.
వారు తమ గుర్రాలపై స్వారీ చేస్తున్నప్పుడు
వారి స్వరం సముద్ర ఘోషలా ఉంటుంది;
బబులోను కుమార్తె, నీ మీద దాడి చేయడానికి
వారు యుద్ధ వ్యూహంలోని సైనికుల్లాగా వస్తారు.
43బబులోను రాజు వారి గురించిన వార్తలను విన్నాడు,
అతని చేతులు వణికిపోయాయి.
స్త్రీకి కలిగే ప్రసవ వేదనలాంటి
వేదన అతన్ని పట్టుకుంది.
44యొర్దాను పొదల్లో నుండి సింహం
సమృద్ధిగా ఉన్న పచ్చిక బయళ్లకు వస్తున్నట్లుగా,
నేను బబులోనును దాని దేశం నుండి క్షణాల్లో తరిమివేస్తాను.
దీని కోసం నేను నియమించిన వ్యక్తి ఎవరు?
నాలాంటివారు ఎవరున్నారు, ఎవరు నన్ను సవాలు చేయగలరు?
ఏ కాపరి నాకు వ్యతిరేకంగా నిలబడగలడు?”
45కాబట్టి, బబులోనుకు వ్యతిరేకంగా యెహోవా ఏమి ప్రణాళిక వేశారో,
బబులోనీయుల దేశానికి వ్యతిరేకంగా ఏమి ఉద్దేశించారో వినండి:
మందలోని చిన్న పిల్లలు బయటకు ఈడ్చివేయబడతాయి;
వారు చేసిన దానికి వారి పచ్చికబయళ్లు పాడుచేయబడతాయి.
46బబులోను పతనమైనప్పుడు భూమి కంపిస్తుంది;
వారి మొర దేశాల్లో ప్రతిధ్వనిస్తుంది.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
యిర్మీయా 50: TSA
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
Telugu Contemporary Version, Holy Bible
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Used with permission. All rights reserved worldwide.