యిర్మీయా 8
8
1“ ‘ఆ సమయంలో, యూదా రాజుల, అధికారుల ఎముకలు, యాజకుల, ప్రవక్తల ఎముకలు, అలాగే యెరూషలేము ప్రజల ఎముకలు వారి సమాధుల నుండి తీసివేయబడతాయి అని యెహోవా ప్రకటన చేస్తున్నారు. 2వారు ప్రేమించి సేవించిన వారు అనుసరించిన, సంప్రదించిన పూజించిన సూర్యునికి చంద్రునికి ఆకాశమండలం లోని అన్ని నక్షత్రాలకు బహిర్గతమవుతారు. వారు పోగుచేయబడక, పాతిపెట్టబడక, నేలమీద పడి ఉన్న పెంటలా ఉంటారు. 3నేను వారిని ఎక్కడికి బహిష్కరించినా, ఈ దుష్ట జనాంగంలో మిగిలినవారంతా బ్రతకడం కంటే చావునే కోరుకుంటారు, అని సైన్యాల యెహోవా ప్రకటిస్తున్నారు.’
పాపం శిక్ష
4“వారితో ఇలా చెప్పు, ‘యెహోవా ఇలా చెప్తున్నారు:
“ ‘మనుష్యులు పడిపోయినప్పుడు, వారు లేవరా?
ఎవరైనా ప్రక్కకు తొలగిపోతే, వారు వెనుకకు తిరిగి రారా?
5అలాంటప్పుడు ఈ ప్రజలు ఎందుకు దారి తప్పారు?
యెరూషలేము ఎప్పుడూ ఎందుకు వెనుదిరుగుతుంది?
వారు మోసానికి అంటిపెట్టుకుని ఉంటారు;
వారు తిరిగి రావడానికి నిరాకరిస్తారు.
6నేను జాగ్రత్తగా విన్నాను,
కానీ వారు సరియైనది చెప్పరు.
“నేనేం చేశాను?” అని అంటూ,
వారిలో ఎవ్వరూ తమ దుష్టత్వాన్ని బట్టి పశ్చాత్తాపపడరు.
యుద్ధంలోకి గుర్రం దూసుకెళ్లినట్లుగా,
ప్రతి ఒక్కరూ తమ సొంత మార్గాన్ని వెంటే వెళ్తారు.
7ఆకాశంలోని కొంగకు కూడా
తన నిర్ణీత కాలాలు తెలుసు,
అలాగే పావురం, వేగంగా ఎగిరే పక్షి, ఓదె అనే పక్షులు
తమ వలస సమయాన్ని గమనిస్తాయి.
అయితే నా ప్రజలకు
యెహోవా న్యాయవిధులు తెలియవు.
8“ ‘శాస్త్రుల అబద్ధాల కలం,
దాన్ని అబద్ధాలతో మార్చినప్పుడు,
“మేము జ్ఞానులం, ఎందుకంటే
మాకు యెహోవా ధర్మశాస్త్రం ఉంది” అని మీరు ఎలా అనగలరు?
9జ్ఞానులు సిగ్గుపడతారు;
వారు భయపడి చిక్కుల్లో పడతారు.
వారు యెహోవా వాక్యాన్ని తిరస్కరించినప్పుడు,
వారికి ఇక జ్ఞానం ఎక్కడుంది?
10కాబట్టి నేను వారి భార్యలను ఇతర పురుషులకు
వారి పొలాలను క్రొత్త యజమానులకు ఇస్తాను.
అల్పుల నుండి గొప్పవారి వరకు,
అందరు లాభం కోసం అత్యాశతో ఉన్నారు;
ప్రవక్తలు, యాజకులు అంతా ఒకటే,
అందరు మోసం చేసేవారే.
11నా ప్రజల గాయం తీవ్రమైనది కానట్టు
వారు కట్టు కడతారు.
సమాధానం లేనప్పుడు,
“సమాధానం, సమాధానం” అని వారంటారు.
12వారు తమ అసహ్యమైన ప్రవర్తనకు సిగ్గుపడుతున్నారా?
లేదు, వారికి బొత్తిగా సిగ్గు లేదు;
ఎలా సిగ్గుపడాలో కూడా వారికి తెలియదు.
కాబట్టి వారు పతనమైనవారి మధ్య పడతారు;
వారు శిక్షించబడినప్పుడు వారు పడద్రోయబడతారు,
అని యెహోవా చెప్తున్నారు.
13“ ‘నేను వారి పంటకోతను తీసివేస్తాను,
అని యెహోవా ప్రకటిస్తున్నారు.
ద్రాక్షతీగెకు ద్రాక్షపండ్లు ఉండవు.
అంజూర చెట్టు మీద అంజూర పండ్లు ఉండవు,
వాటి ఆకులు వాడిపోతాయి.
నేను వారికి ఇచ్చింది
వారి దగ్గరి నుండి తీసివేయబడుతుంది.’ ”
14మనం ఇక్కడ ఎందుకు కూర్చున్నాం?
మనం ఒక్కచోట చేరి,
కోటగోడలు గల పట్టణాలకు పారిపోయి
అక్కడ నశించుదాం!
మన దేవుడైన యెహోవా మనకు నాశనాన్ని విధించి,
మనకు త్రాగడానికి విషం కలిపిన నీళ్లు ఇచ్చారు,
ఎందుకంటే మనం ఆయనకు వ్యతిరేకంగా పాపం చేశాము.
15మేము సమాధానం కోసం నిరీక్షించాం,
కానీ ఏ మంచి జరగలేదు,
స్వస్థత కోసం ఎదురుచూశాము
కానీ భయమే కలిగింది.
16శత్రువుల గుర్రాల బుసలు కొట్టడం
దాను నుండి వినబడుతుంది;
వారి మగ గుర్రాల సకిలింపుకు
దేశమంతా వణికిపోతుంది.
వారు మ్రింగివేయడానికి
భూమిని, అందులోని సమస్తాన్ని,
పట్టణాన్ని, అందులో నివసించే వారినందరిని మ్రింగివేయడానికి వచ్చారు.
17“చూడండి, నేను మీ మధ్యకు విషసర్పాలను,
అదుపు చేయలేని మిడునాగులను పంపుతాను,
అవి మిమ్మల్ని కాటేస్తాయి”
అని యెహోవా ప్రకటిస్తున్నారు.
18దుఃఖంలో నాకు ఆదరణకర్తవు నీవే,
నా హృదయం నాలో నీరసించి ఉంది.
19సుదూరదేశం నుండి
నా ప్రజల మొరను ఆలకించు:
“యెహోవా సీయోనులో లేడా?
ఆమె రాజు ఇక ఇప్పుడు అక్కడ లేరా?”
“వారు తమ చిత్రాలతో, తమ పనికిమాలిన పరదేశి విగ్రహాలతో
ఎందుకు నాకు కోపం రప్పించారు?”
20“కోత సమయం దాటిపోయింది,
వేసవికాలం ముగిసింది,
అయినా మనం రక్షించబడలేదు.”
21నా ప్రజలు నలిగిపోయారు కాబట్టి, నేనూ నలిగిపోయాను;
నేను దుఃఖిస్తున్నాను, భయం నన్ను పట్టుకుంటుంది.
22గిలాదులో ఔషధతైలం లేదా?
అక్కడ వైద్యుడు లేడా?
ఉంటే నా ప్రజల గాయానికి
స్వస్థత ఎందుకు లేదు?
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
యిర్మీయా 8: TSA
హైలైట్
షేర్ చేయి
కాపీ

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
Telugu Contemporary Version, Holy Bible
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Used with permission. All rights reserved worldwide.