యోబు 12
12
యోబు
1అప్పుడు యోబు ఇచ్చిన జవాబు:
2నిస్సందేహంగా లోకంలో మీరే జ్ఞానులు,
మీతో పాటే జ్ఞానం అంతరిస్తుంది!
3అయినా మీకున్నట్లే నాకు కూడా గ్రహించే మనస్సు ఉంది,
నేను మీకేమి తీసిపోను.
ఈ విషయాలు తెలియనివారు ఎవరు?
4నేను దేవునికి ప్రార్థించగా ఆయన సమాధానం ఇచ్చినప్పటికీ,
నా స్నేహితుల ముందు నేను నవ్వులపాలయ్యాను,
నీతిగా నిందారహితంగా ఉన్న నేను నవ్వులపాలయ్యాను.
5నిశ్చింతగా ఉన్నవారు అభాగ్యులను తిరస్కరిస్తారు,
పాదాలు జారిపోతున్న వారి విధిని చూసి ఎగతాళి చేస్తారు.
6బందిపోటు దొంగల గుడారాలు ప్రశాంతంగా ఉంటాయి,
దేవునికి కోపం పుట్టించే వారు సురక్షితంగా ఉంటారు,
వారి దేవుడు వారి చేతిలోనే ఉన్నాడు.
7కాని జంతువులను అడగండి అవి మీకు బోధిస్తాయి,
ఆకాశంలోని పక్షులను అడగండి అవి మీకు చెప్తాయి.
8భూమితో మాట్లాడండి అది మీకు బోధిస్తుంది,
సముద్రంలోని చేపలు మీకు తెలియచేస్తాయి.
9వీటన్నిటిని యెహోవా హస్తం చేసిందని
తెలుసుకోలేనివారు ఎవరు?
10ఆయన చేతిలో జీవులన్నిటి ప్రాణం
మానవులందరి ఊపిరి ఉంది.
11నాలుక ఆహారం రుచిని చూసినట్లు
చెవి మాటలను పరిశీలించదా?
12వృద్ధుల దగ్గర జ్ఞానం దొరకదా?
దీర్ఘాయువు గ్రహింపును తీసుకురాదా?
13జ్ఞానం శక్తి దేవునికి చెందినవి;
ఆలోచన గ్రహింపు ఆయనవే.
14దేవుడు పడగొట్టిన దానిని తిరిగి కట్టలేరు;
ఆయన బంధించిన వారిని ఎవరూ విడిపించలేరు.
15ఆయన జలాలను ఆపేస్తే అవి ఎండిపోతాయి;
ఆయన వాటిని వదిలేస్తే అవి భూమిని వరదలతో నాశనం చేస్తాయి.
16బలం వివేకం ఆయనకు చెందినవే;
మోసపోయేవారు మోసగించేవారు ఆయన వారే.
17ఆయన ఆలోచనకర్తలను దిగంబరులుగా నడిపిస్తారు,
న్యాయాధిపతులను బుద్ధిహీనులుగా చేస్తారు.
18ఆయన రాజులు వేసిన సంకెళ్ళు తీసివేస్తారు
వారి నడుము చుట్టూ తాడు కడతాడు.
19యాజకులను దిగంబరులుగా చేసి నడిపిస్తారు,
స్థిరంగా పాతుకుపోయిన అధికారులను పడగొడతారు.
20నమ్మకమైన సలహాదారుల మాటలను నిరర్థకం చేస్తారు,
పెద్దల వివేచనను తీసివేస్తారు.
21ఆయన అధిపతుల మీద అవమానాన్ని కురిపిస్తారు,
బలవంతులను నిరాయుధులనుగా చేస్తారు.
22ఆయన చీకటిలోని లోతైన విషయాలను వెల్లడిస్తారు
చిమ్మ చీకటిని వెలుగులోకి తెస్తారు.
23ఆయన దేశాలను గొప్ప చేస్తారు వాటిని నాశనం చేస్తారు;
దేశాలను విశాలపరుస్తారు వాటిని చెదరగొడతారు.
24ఆయన భూలోక నాయకుల గ్రహింపును తీసివేస్తారు;
వారు దారిలేని ఎడారిలో తిరుగులాడేలా చేస్తారు.
25వారు వెలుగు లేదా చీకటిలో తడబడతారు;
ఆయన వారిని త్రాగుబోతు తూలినట్లు తూలేలా చేస్తారు.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
యోబు 12: TSA
హైలైట్
షేర్ చేయి
కాపీ
![None](/_next/image?url=https%3A%2F%2Fimageproxy.youversionapistaging.com%2F58%2Fhttps%3A%2F%2Fweb-assets.youversion.com%2Fapp-icons%2Fte.png&w=128&q=75)
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
Telugu Contemporary Version, Holy Bible
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Used with permission. All rights reserved worldwide.