యోబు 21
21
యోబు
1అప్పుడు యోబు ఇలా అన్నాడు:
2“నేను శ్రద్ధగా వినండి;
ఇదే మీరు నాకిచ్చే ఓదార్పు అవనివ్వండి.
3నేను మాట్లాడుతున్నప్పుడు కొంచెం ఓర్చుకోండి,
నేను మాట్లాడిన తర్వాత, మీరు ఎగతాళి చేయవచ్చు.
4“నేను మనుష్యులకు ఫిర్యాదు చేశానా?
అలాంటప్పుడు నేను ఎందుకు ఆతురపడకూడదు?
5నా వైపు చూసి నివ్వెరపోండి;
మీ నోటిమీద చేయి వేసుకోండి.
6దీని గురించి ఆలోచించినప్పుడు, నేను హడలిపోతున్నాను;
నా శరీరంలో వణుకు పుడుతుంది.
7దుష్టులు ఎందుకు బ్రతుకుతూ ఉన్నారు,
పెద్దవారిగా ఎదుగుతూ వారు బలాభివృద్ధి చెందుతున్నారు?
8తమ పిల్లలు స్థిరపడడం వారు చూస్తారు,
వారు మనవళ్ళుమనవరాళ్లతో ఆనందిస్తారు.
9వారి ఇళ్ళు భయం లేకుండ క్షేమంగా ఉన్నాయి;
దేవుని శిక్షాదండం వారి మీదికి రాలేదు.
10వారి ఎద్దులు సంతానోత్పత్తిలో ఎప్పుడూ విఫలం కావు;
వారి ఆవులు దూడలను ఈనుతాయి గర్భస్రావం చేయవు.
11వారు తమ పిల్లలను మందగా పంపిస్తారు;
వారి చిన్నారులు నాట్యమాడతారు.
12కంజర తంతి వాయిద్యాలు మోగిస్తూ పాడతారు;
పిల్లనగ్రోవి ఊదుతూ ఆనందిస్తారు.
13వారు తమ సంవత్సరాలు శ్రేయస్సులో గడుపుతారు
సమాధానంతో#21:13 లేదా ఒక్క క్షణంలో సమాధికి వెళ్తారు.
14అయినప్పటికీ వారు దేవునితో, ‘మమ్మల్ని ఒంటరిగా వదిలేయండి!
మీ మార్గాల గురించి తెలుసుకోవాలని మాకు ఆశ లేదు.
15మేము ఆయనను సేవించడానికి సర్వశక్తిమంతుడు ఎవరు?
మేము ఆయనకు ప్రార్థిస్తే మాకే లాభం కలుగుతుంది?’ అంటారు.
16అయితే వారి వృద్ధి వారి స్వహస్తాలలో లేదు,
కాబట్టి నేను దుష్టుల ప్రణాళికలకు దూరంగా ఉంటాను.
17“అయినా ఎంత తరచుగా దుర్మార్గుల దీపం ఆరిపోతుంది?
దేవుడు తన కోపంలో కేటాయించిన,
విపత్తు ఎంత తరచుగా వారి మీదికి వస్తుంది?
18వారు ఎంత తరచుగా గాలి ముందు ఉనకలా,
తుఫానుకు కొట్టుకుపోయే పొట్టులా ఉంటారు?
19‘దేవుడు దుష్టుల శిక్షను వారి పిల్లల కోసం దాచి ఉంచుతాడు’ అని చెప్పబడింది.
వారు చేసిన దానిని వారే అనుభవించేలా,
దుష్టులకు ఆయనను తిరిగి చెల్లించనివ్వండి.
20వారి కళ్లు వారి నాశనాన్ని చూడాలి;
సర్వశక్తిమంతుని ఉగ్రత పాత్రను వారు త్రాగాలి.
21వారికి నియమించబడిన నెలలు ముగిసిపోయినప్పుడు
వారు విడిచి వెళ్లే తమ కుటుంబాల గురించి వారేమి శ్రద్ధ తీసుకోగలరు?
22“అత్యంత ఉన్నతమైన వారికి ఆయన తీర్పు తీరుస్తారు,
అలాంటి దేవునికి తెలివిని ఎవరైనా బోధించగలరా?
23ఒక వ్యక్తి పూర్ణ శక్తి,
సంపూర్ణ భద్రత, అభివృద్ధి,
24బాగా పోషించబడిన శరీరం,
ఎముకల్లో సమృద్ధి మూలిగ కలిగి ఉండి చస్తాడు.
25మరొకరు ఎన్నడు ఏ మంచిని అనుభవించకుండానే,
మనోవేదనతో చనిపోతారు.
26మట్టిలో వారు ఒకరి ప్రక్కన ఒకరు పడుకుంటారు,
వారిద్దరిని పురుగులు కప్పివేస్తాయి.
27“మీరేమి ఆలోచిస్తున్నారో,
నామీద ఏ కుట్రలు చేస్తున్నారో నాకు తెలుసు.
28‘ఇప్పుడు గొప్పవారి గృహం ఎక్కడ,
దుష్టులు నివసించిన గుడారాలు ఎక్కడ?’ అని మీరంటారు.
29ప్రయాణం చేసేవారిని మీరు ఎప్పుడు అడగలేదా?
వారు చెప్పినవాటిని మీరు గుర్తుపట్టలేదా?
30అవేమంటే, విపత్తు దినం నుండి దుష్టులు వదిలి వేయబడతారు,
ఉగ్రత దినం నుండి ఎలా తప్పించుకుంటారు?
31వారి ముఖం మీదనే వారి ప్రవర్తన గురించి ఎవరు ఖండిస్తారు?
వారు చేసిన వాటికి ఎవరు వారికి తిరిగి చెల్లిస్తారు?
32వారు సమాధికి మోయబడతారు,
వారి సమాధులపై నిఘా పెట్టబడుతుంది.
33లోయలోని మట్టి వారికి తీపి;
మనుష్యులంతా వారిని వెంబడిస్తారు,
అలాగే లెక్కలేనంత జనసమూహం వారికి ముందుగా వెళ్తారు.
34“కాబట్టి మీ అర్థంలేని మాటలతో నన్నెలా ఓదార్చగలరు?
మీ సమాధానాలలో అబద్ధం తప్ప మరేమీ లేదు!”
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
యోబు 21: TSA
హైలైట్
షేర్ చేయి
కాపీ

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
Telugu Contemporary Version, Holy Bible
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Used with permission. All rights reserved worldwide.