యోబు 3

3
యోబు మాటలు
1ఆ తర్వాత, యోబు మాట్లాడడం మొదలుపెట్టి తాను పుట్టిన రోజును శపించాడు. 2యోబు ఇలా అన్నాడు:
3“నేను పుట్టిన రోజు,
‘మగ శిశువు పుట్టాడని!’ చెప్పిన ఆ రాత్రి లేకపోవును గాక.
4ఆ రోజు చీకటి అగును గాక;
పైనున్న దేవుడు దాన్ని లెక్కచేయకుండును గాక;
దాని మీద వెలుగు ప్రకాశించకూడదు.
5చీకటి, గాఢాంధకారం మళ్ళీ దాన్ని తమ దగ్గరకు తీసుకొనును గాక;
మేఘం దాన్ని కమ్మును గాక;
పగటిని కమ్మే అంధకారం దాన్ని భయపెట్టును గాక.
6కటిక చీకటి ఆ రాత్రిని పట్టుకొనును గాక;
సంవత్సరపు రోజుల్లో ఒకరోజుగా అది లెక్కించబడకపోవును గాక,
ఏ నెలలోను అది చేర్చబడకపోవును గాక.
7ఆ రాత్రి గొడ్రాలిగా ఉండును గాక;
దానిలో సంతోష ధ్వని వినిపించకపోవును గాక.
8రోజులను శపించేవారు, లెవియాథన్#3:8 లెవియాథన్ ఎలాంటి జంతువో అనేది చర్చించబడే విషయము. ఇది భూమిలో ఉన్న జీవియై ఉండవచ్చు ప్రాచీన సాహిత్యంలో ఒక భయంకరమైన ఊహాత్మక సముద్రపు రాక్షసి అని చెప్పబడింది. రెచ్చగొట్టే అనుభవం గలవారు
ఆ రోజును శపించుదురు గాక.
9దాని అరుణోదయ నక్షత్రాలు చీకటిమయం అగును గాక;
వెలుగు కోసం అది ఎదురుచూడడం వృధా అవ్వాలి,
ఉదయ కిరణాలు దానికి కనపడకూడదు.
10ఎందుకంటే అది నా కళ్ళ నుండి బాధను దాచిపెట్టడానికి
నా తల్లి గర్భద్వారాలను మూయలేదు.
11“పుట్టగానే నేనెందుకు చావలేదు?
గర్భం నుండి రాగానే నేనెందుకు మరణించలేదు?
12నన్నెందుకు మోకాళ్లమీద పడుకోబెట్టుకున్నారు
నేనెందుకు తల్లిపాలు త్రాగాను?
13నేను పుట్టినప్పుడే చనిపోయి ఉంటే;
నేను ఈపాటికి నిద్రించి నాకు విశ్రాంతి కలిగియుండేవాన్ని,
14తమ కోసం భవనాలు కట్టుకున్న
భూరాజులతో పాలకులతో,
15బంగారం సంపాదించుకుని వెండితో తమ ఇళ్ళు నింపుకొన్న
అధిపతులతో నేనూ ప్రశాంతంగా నిద్రించి ఉండేవాన్ని.
16లేదా చనిపోయి పుట్టిన పిండంవలె
ఎప్పుడు వెలుగు చూడని శిశువు వలె నేను ఎందుకు నేలలో దాచబడలేదు?
17అక్కడ దుర్మార్గులు ఇక శ్రమపెట్టరు,
బలహీనులై అలసిన వారు విశ్రాంతి పొందుతారు.
18చెరలో ఉన్నవారు కూడా అక్కడ నెమ్మది అనుభవిస్తారు,
యాజమానుల స్వరాలు వారికిక వినబడవు.
19పేదవారు గొప్పవారు అక్కడ ఉన్నారు,
దాసులు తమ యాజమానుల నుండి విముక్తి పొందుతారు.
20“దురవస్థలో ఉన్నవారికి వెలుగెందుకు?
ఆత్మలో చేదుననుభవిస్తున్న వారికి జీవమెందుకు?
21వారు రాని మరణం కోసం ఆశతో ఎదురుచూస్తారు,
దాచబడిన ధననిధి కంటే ఎక్కువగా దాని కోసం వెదకుతారు, కాని అది రాదు.
22వారు సమాధిని చేరినప్పుడు
ఆనందంతో నింపబడి సంతోషిస్తారు.
23మరుగుచేయబడిన మార్గంగలవానికి
దేవుడు చుట్టూ కంచెవేసినవానికి
జీవం ఎందుకు ఇవ్వబడింది?
24నిట్టూర్పే నా అనుదిన భోజనంగా మారింది.
నా మూలుగులు నీళ్లలా పారుతున్నాయి.
25దేనికి భయపడ్డానో అదే నా మీదికి వచ్చింది;
దేని గురించి దిగులుపడ్డానో అదే నాకు కలిగింది.
26నాకు నెమ్మది లేదు సుఖం లేదు;
విశ్రాంతి లేదు, ఉన్నది ఆందోళన మాత్రమే.”

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

యోబు 3: TSA

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి