యోవేలు 2
2
మిడతల సైన్యం
1సీయోనులో బూర ఊదండి;
నా పరిశుద్ధ పర్వతం మీద నినాదాలు చేయండి.
యెహోవా దినం రాబోతుంది కాబట్టి,
దేశ నివాసులంతా వణకాలి,
ఆ దినం సమీపంగా ఉంది.
2అది దట్టమైన చీకటి ఉండే దినం,
అది కారు మబ్బులు గాఢాంధకారం ఉండే దినం,
పర్వతాలమీద ఉదయకాంతి ప్రసరించినట్టు,
బలమైన మహా గొప్ప సైన్యం వస్తుంది,
అలాంటివి పూర్వకాలంలో ఎన్నడూ లేవు,
ఇకమీదట రాబోయే తరాలకు ఉండవు.
3వాటి ముందు అగ్ని మండుతూ ఉంది,
వాటి వెనుక మంటలు మండుతూ ఉన్నాయి.
అవి రాకముందు భూమి ఏదెను తోటలా ఉంది,
అవి వచ్చిన తర్వాత ఎండిన ఎడారిలా మారింది
ఏదీ వాటినుండి తప్పించుకోలేదు.
4అవి గుర్రాల్లా కనిపిస్తున్నాయి;
సైనికుల గుర్రాల్లా అవి పరుగెడుతున్నాయి.
5రథాలు కదిలే ధ్వనిలా,
అగ్నిజ్వాలలు కాల్చుతున్న శబ్దంలా,
యుద్ధానికి సిద్ధమైన మహా సైన్యంలా,
అవి పర్వత శిఖరాల మీద దూకుతున్నాయి,
6వాటిని చూసి ప్రజలు వేదన చెందుతున్నారు,
అందరి ముఖాలు పాలిపోతున్నాయి.
7అవి వీరుల్లా ముందుకు వస్తున్నాయి,
సైనికుల్లా అవి గోడలెక్కి వస్తున్నాయి.
అవి అటూ ఇటూ తిరుగకుండా,
తిన్నగా నడుస్తున్నాయి.
8ఒక దానినొకటి త్రోసుకోకుండా,
అన్నీ నేరుగా ముందుకు వస్తున్నాయి.
వాటికి ఆయుధాలు ఎదురుపడినా,
అవి వరుస మాత్రం తప్పవు.
9అవి పట్టణం మీదికి దూసుకు వస్తాయి.
గోడ మీద పరుగెత్తుతూ వస్తాయి.
దొంగలు కిటికీల నుండి చొరబడినట్లు,
అవి ఇళ్ళలోనికి దూరుతున్నాయి.
10వాటికి ముందు భూమి కంపిస్తుంది,
ఆకాశాలు వణకుతాయి,
సూర్యచంద్రులకు చీకటి కమ్ముతుంది.
నక్షత్రాలు ఇక ప్రకాశించవు.
11యెహోవా తన సైన్యాన్ని నడిపిస్తూ
ఉరుములా గర్జిస్తారు;
ఆయన బలగాలు లెక్కకు మించినవి,
ఆయన ఆజ్ఞకు లోబడే సైన్యం గొప్పది,
యెహోవా దినం గొప్పది;
అది భయంకరమైనది,
దాన్ని ఎవరు తట్టుకోగలరు?
మీ హృదయాన్ని చీల్చుకోండి
12యెహోవా ఇలా ప్రకటిస్తున్నారు,
“ఇప్పుడైనా ఉపవాసముండి ఏడుస్తూ దుఃఖిస్తూ
మీ హృదయమంతటితో నా దగ్గరకు రండి.”
13మీ వస్త్రాలను కాదు,
మీ హృదయాలను చీల్చుకుని,
మీ దేవుడైన యెహోవా దగ్గరకు తిరిగి రండి,
ఆయన కృపా కనికరం గలవాడు,
త్వరగా కోప్పడడు, మారని ప్రేమగలవాడు
ఆయన జాలిపడుతూ విపత్తును పంపించకుండా ఉంటారు.
14ఆయన మీ వైపు తిరిగి మనస్సు మార్చుకుంటారేమో,
ఆయన మిమ్మల్ని ఆశీర్వదించవచ్చు,
మళ్ళీ మీరు మీ దేవుడైన యెహోవాకు
భోజనార్పణలు, పానార్పణలు తెస్తారేమో, ఎవరికి తెలుసు?
15సీయోనులో బూర ఊదండి,
పరిశుద్ధ ఉపవాసం ప్రకటించండి,
పరిశుద్ధ సభకు ప్రజలను పిలువండి.
16ప్రజలను సమకూర్చండి,
సమావేశాన్ని ప్రతిష్ఠించండి;
పెద్దలను రప్పించండి,
పిల్లలను సమకూర్చండి,
చంటి పిల్లలను కూడా తీసుకురండి.
పెళ్ళికుమారుడు తన గదిని
పెళ్ళికుమార్తె తన పెద్ద గదిని విడిచి రావాలి.
17యెహోవా ఎదుట సేవచేసే యాజకులు
మంటపానికి బలిపీఠానికి మధ్య నిలబడి ఏడ్వాలి.
వారు, “యెహోవా! మీ ప్రజలను కనికరించండి.
మీ స్వాస్థ్యమైన వారిని అవమాన పడనివ్వకండి
వారు దేశాల మధ్య హేళన చేయబడకూడదు.
‘వీరి దేవుడు ఎక్కడ?’
అని ప్రజలు ఎందుకు అనుకోవాలి?”
యెహోవా సమాధానం
18అప్పుడు యెహోవా తన దేశంపట్ల ఆసక్తి చూపి,
ప్రజలను కనికరించారు.
19యెహోవా వారికి ఇలా జవాబిచ్చారు:
“నేను మిమ్మల్ని పూర్తిగా తృప్తిపరచడానికి,
ధాన్యం, క్రొత్త ద్రాక్షరసం, ఒలీవనూనె పంపుతున్నాను;
ఇక ఎన్నడూ మిమ్మల్ని
దేశాల్లో అవమానానికి గురిచేయను.
20“నేను ఉత్తర దిక్కునుండి వచ్చే సైన్యాన్ని మీకు దూరంగా తరిమివేస్తాను.
ఎండిపోయిన, నిస్సారమైన ప్రాంతానికి దానిని పంపివేస్తాను;
తూర్పు వైపున్న దాని సైన్యం మృత సముద్రంలో మునిగిపోతుంది,
పశ్చిమ వైపున్న దాని సైన్యం మధ్యధరా సముద్రంలో మునిగిపోతుంది.
అది కంపు కొడుతుంది,
దాని దుర్వాసన లేస్తుంది.”
నిజంగా ఆయన గొప్పకార్యాలు చేశారు!
21యూదా దేశమా, భయపడకు;
సంతోషించు, ఆనందించు.
నిజంగా యెహోవా గొప్పకార్యాలు చేశారు!
22అడవి జంతువులారా, భయపడకండి,
ఎందుకంటే అరణ్యంలో పచ్చికబయళ్లు పచ్చగా మారుతున్నాయి.
చెట్లు తమ ఫలాలు ఇస్తాయి.
అంజూర చెట్లు, ద్రాక్షచెట్లు సమృద్ధిగా ఫలిస్తాయి.
23సీయోను ప్రజలారా, సంతోషించండి,
మీ దేవుడైన యెహోవాను బట్టి ఆనందించండి,
ఆయన నమ్మదగినవారు కాబట్టి,
ఆయన మీకు తొలకరి వర్షం ఇచ్చారు.
ఆయన సమృద్ధి వర్షాలు పంపిస్తారు,
ఆయన ముందు పంపినట్లు తొలకరి వర్షం, కడవరి వర్షం పంపిస్తారు.
24నూర్పిడి కళ్ళాలు ధాన్యంతో నిండి ఉంటాయి,
క్రొత్త ద్రాక్షరసం, నూనెతో గానుగ తొట్లు పొర్లిపారుతాయి.
25“నేను మీ మధ్యకు పంపిన నా గొప్ప సైన్యం
పెద్ద మిడతలు, చిన్న మిడతలు,
ఇతర మిడతలు, మిడతల గుంపులు
తినేసిన సంవత్సరాల పంటను నేను తిరిగి మీకు ఇస్తాను.
26మీరు కడుపునిండా తిని తృప్తి పొందేవరకు మీకు సమృద్ధి ఉంటుంది,
మీ కోసం అద్భుతాలు చేసిన
మీ దేవుడైన యెహోవా నామాన్ని మీరు స్తుతిస్తారు;
ఇక మరెన్నడు నా ప్రజలు సిగ్గుపడరు.
27అప్పుడు నేను ఇశ్రాయేలీయుల మధ్యలో ఉన్నానని,
నేను మీ దేవుడైన యెహోవానని,
వేరే దేవుడు ఎవరూ లేరని మీరు తెలుసుకుంటారు;
ఇక మరెన్నడు నా ప్రజలు సిగ్గుపడరు.
యెహోవా దినం
28“ఆ తర్వాత
నేను ప్రజలందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను.
మీ కుమారులు, కుమార్తెలు ప్రవచిస్తారు,
మీ వృద్ధులు కలలు కంటారు,
మీ యువకులు దర్శనాలు చూస్తారు.
29ఆ రోజుల్లో నా సేవకుల మీద, సేవకురాండ్ర మీద కూడా
నా ఆత్మను కుమ్మరిస్తాను.
30నేను ఆకాశంలో అద్భుతాలను,
భూమి మీద
రక్తం, అగ్ని, గొప్ప పొగను చూపిస్తాను.
31యెహోవా భయంకరమైన మహాదినం రాకముందు,
సూర్యుడు చీకటిగా,
చంద్రుడు రక్తంగా మారుతాడు.
32యెహోవా పేరట మొరపెట్టిన
ప్రతి ఒక్కరూ రక్షింపబడతారు;
యెహోవా చెప్పినట్టే, సీయోను పర్వతం మీద,
యెరూషలేములో విడుదల ఉంటుంది,
ఎవరినైతే యెహోవా పిలుచుకుంటారో,
వారు రక్షింపబడతారు.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
యోవేలు 2: TSA
హైలైట్
షేర్ చేయి
కాపీ

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
Telugu Contemporary Version, Holy Bible
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Used with permission. All rights reserved worldwide.