విలాప 2
2
# 2 ఈ అధ్యాయం ఒక అక్రోస్టిక్ పద్యం, ఇందులోని ప్రతి వచనం హెబ్రీ వర్ణమాలకు చెందిన వరుస అక్షరాలతో మొదలవుతాయి 1ప్రభువు తన కోపంతో
సీయోను కుమార్తెను మేఘంతో కప్పివేశారు!
ఆయన ఇశ్రాయేలు వైభవాన్ని
ఆకాశం నుండి భూమి మీదికి పడగొట్టారు;
ఆయన తన కోప్పడిన దినాన
తన పాదపీఠాన్ని జ్ఞాపకం చేసుకోలేదు.
2దయ లేకుండా ప్రభువు
యాకోబు నివాసాలన్నింటినీ నాశనం చేశారు.
తన కోపంలో ఆయన తన కుమార్తెయైన
యూదా కోటలను పడగొట్టారు.
ఆయన ఆమె రాజ్యాన్ని, దాని అధిపతులను
అగౌరపరచి నేలకూల్చారు.
3ఆయన తన కోపాగ్నిలో
ఇశ్రాయేలీయుల ప్రతి కొమ్మును#2:3 కొమ్ము ఇక్కడ బలాన్ని సూచిస్తుంది నరికివేశారు.
శత్రువు దగ్గరికి వచ్చినప్పుడు
ఆయన తన కుడిచేతిని వెనుకకు తీసుకున్నారు.
ఆయన యాకోబులో మండుతున్న అగ్నిలా,
దాని చుట్టూ ఉన్న సమస్తాన్ని దహించే మంటలా ఉన్నారు.
4ఒక శత్రువులా ఆయన తన విల్లు ఎక్కుపెట్టారు;
ఆయన కుడిచేయి సిద్ధంగా ఉంది.
ఆయన ఒక శత్రువులా
కంటికి నచ్చిన వారందరినీ చంపేశారు;
ఆయన తన కోపాన్ని అగ్నిలా
సీయోను కుమార్తె గుడారం మీద కుమ్మరించారు.
5ప్రభువు ఒక శత్రువులా;
ఇశ్రాయేలును నాశనం చేశారు.
ఆమె రాజభవనాలన్నింటిని ఆయన కూల్చివేశారు,
అలాగే ఆమె కోటలను నాశనం చేశారు.
ఆయన యూదా కుమార్తె కోసం
దుఃఖాన్ని, విలాపాన్ని అధికం చేశారు.
6ఆయన తన నివాసాన్ని తోటలో ఉండే ఒక పాకలా కూల్చివేశారు;
ఆయన తన సమావేశ స్థలాన్ని నాశనం చేశారు.
యెహోవా సీయోనును తన
నియమించబడిన పండుగలను, సబ్బాతులను మరచిపోయేలా చేశారు;
ఆయన తన కోపాగ్నిలో
రాజును, యాజకులను తిరస్కరించారు.
7ప్రభువు తన బలిపీఠాన్ని తిరస్కరించి,
తన పరిశుద్ధాలయాన్ని విడిచిపెట్టారు.
ఆయన ఆమె రాజభవనాల గోడలను
శత్రువుల చేతికి అప్పగించారు;
నియామక పండుగ రోజున చేసినట్టుగా వారు
యెహోవా నివాసంలో బిగ్గరగా కేకలు వేశారు.
8సీయోను కుమారి చుట్టూ ఉన్న గోడను
పడగొట్టాలని యెహోవా నిశ్చయించుకున్నారు.
ఆయన కొలమానాన్ని గీసాడు
నాశనం చేయకూడదని తన చేతిని వెనుకకు తీసుకోలేదు.
ఆయన రక్షణ వ్యవస్థ అంతటిని, గోడలను విలపించేలా చేశారు;
అవి శిథిలావస్థలో ఉండిపోయాయి.
9ఆమె ద్వారాలు భూమిలోకి కృంగిపోయాయి;
ఆయన వాటి బంధాలను పగలగొట్టి నాశనం చేశారు.
ఆమె రాజు, ఆమె అధిపతులు దేశాల్లోకి చెరకు కొనిపోబడ్డారు,
ఇక ఉపదేశం లేకుండా పోయింది,
ఆమె ప్రవక్తలు ఇక
యెహోవా నుండి దర్శనాలను పొందుకోలేదు.
10సీయోను కుమార్తె పెద్దలు
మౌనంగా నేలమీద కూర్చున్నారు;
తమ తలలపై ధూళి చల్లుకొని
గోనెపట్ట కట్టుకున్నారు.
యెరూషలేము యువతులు
తమ తలలు నేలకు వంచుకున్నారు.
11ఏడ్వడం వల్ల నా కళ్లు క్షీణిస్తున్నాయి,
నా లోపలి భాగాలు వేదనను అనుభవిస్తున్నాను.
నా హృదయం నేలమీద కుమ్మరించబడింది,
ఎందుకంటే నా ప్రజలు నాశనమయ్యారు,
పిల్లలు, పసిపిల్లలు
నగర వీధుల్లో మూర్ఛపోయారు.
12వారు తమ తల్లులతో,
“తినడానికి, త్రాగడానికి ఏమి లేవా?” అని అడుగుతున్నారు,
వారు గాయపడిన వారిలా
నగర వీధుల్లో మూర్ఛపోతున్నారు,
వారి తల్లుల చేతుల్లో
వారి ప్రాణాలు పోతున్నాయి.
13యెరూషలేము కుమారీ!
నీ గురించి ఏమి చెప్పగలను?
నిన్ను దేనితో పోల్చగలను?
సీయోను కుమారీ,
కన్యకా! నిన్నెలా ఓదార్చడానికి
నిన్ను దేనితో పోల్చగలను
నీకు కలిగిన గాయం సముద్రమంత లోతుగా ఉంది
నిన్నెవరు స్వస్థపరచగలరు?
14నీ ప్రవక్తల దర్శనాలు
అబద్ధం, పనికిరానివి;
చెర నుండి నిన్ను తప్పించడానికి
వారు నీ పాపాన్ని బయటపెట్టలేదు.
వారు నీకు చెప్పిన ప్రవచనాలు
అబద్ధం, తప్పుదారి పట్టించేవి.
15నీ దారిన వెళ్లేవారంతా నిన్ను చూసి,
చప్పట్లు కొడతారు;
వారు యెరూషలేము దిక్కు చూసి
ఎగతాళిగా తలలాడిస్తూ ఇలా అంటారు:
“పరిపూర్ణ సౌందర్య పట్టణమని,
సమస్త భూనివాసులకు ఆనంద కారణమని
ఈ పట్టణాన్ని గురించేనా చెప్పుకున్నారు?”
16నీ శత్రువులందరూ
నీకు వ్యతిరేకంగా నోరు విప్పారు.
వారు ఎగతాళి చేసి పళ్లు కొరుకుతూ,
“మేము ఆమెను నాశనం చేశాము.
ఈ రోజు కోసమే మేము ఎదురు చూసింది;
దీన్ని చూడడానికే మేము బ్రతికి ఉండింది” అని అంటారు.
17యెహోవా తాను సంకల్పించింది చేశారు,
చాలా కాలం క్రితం ఆయన శాసించిన,
తన మాట ఆయన నెరవేర్చారు.
ఆయన దయ లేకుండా నిన్ను పడగొట్టారు,
శత్రువు నీ మీద సంతోషించేలా చేశారు,
ఆయన నీ శత్రువుల కొమ్మును#2:17 కొమ్ము ఇక్కడ బలాన్ని సూచిస్తుంది హెచ్చించారు.
18ప్రజల హృదయాలు
యెహోవాకు మొరపెడుతున్నాయి.
సీయోను కుమారి గోడలారా,
మీ కన్నీటిని నదిలా
పగలు రాత్రి ప్రవహించనివ్వండి;
మీకు మీరే ఉపశమనం కలిగించుకోవద్దు,
మీ కళ్లకు విశ్రాంతి ఇవ్వవద్దు.
19లేచి, రాత్రివేళ కేకలు వేయండి,
రేయి మొదటి జామున కేకలు వేయండి.
నీ హృదయాన్ని నీళ్లలా
ప్రభువు సన్నిధిలో కుమ్మరించండి.
ప్రతి వీధి చివరిలో
ఆకలితో మూర్ఛపోయిన
మీ పిల్లల ప్రాణాల కోసం
ఆయన వైపు మీ చేతులు ఎత్తండి.
20“చూడండి, యెహోవా, ఆలోచించండి:
మీరు ఇంతకుముందు ఎవరితోనైనా ఇలా వ్యవహరించారా?
స్త్రీలు తమ సంతానాన్ని తినాలా,
తాము పెంచిన పిల్లలను తినాలా?
యాజకుడు, ప్రవక్త
ప్రభువు యొక్క పరిశుద్ధాలయంలో చంపబడాలా?
21“చిన్నవారు, పెద్దవారు కలిసి
వీధుల్లోని దుమ్ములో పడుకుంటారు;
నా యువకులు, యువతులు
ఖడ్గం చేత చంపబడ్డారు.
మీరు కోప్పడిన దినాన మీరు వారిని చంపారు;
మీరు జాలి లేకుండా వారిని వధించారు.
22“మీరు ఒక పండుగ దినానికి పిలిచినట్లు,
నాకు వ్యతిరేకంగా ప్రతి వైపు నుండి భయాందోళనలు పిలిచారు.
యెహోవా ఉగ్రత దినాన
ఎవరూ తప్పించుకోలేదు, బ్రతకలేదు;
నేను అపురూపంగా పెంచుకొన్న వారిని
నా శత్రువు నాశనం చేశాడు.”
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
విలాప 2: TSA
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
Telugu Contemporary Version, Holy Bible
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Used with permission. All rights reserved worldwide.