లూకా సువార్త 15:11-24

లూకా సువార్త 15:11-24 TSA

యేసు ఇంకా మాట్లాడుతూ: “ఒక మనుష్యునికి ఇద్దరు కుమారులున్నారు. వారిలో చిన్నవాడు తన తండ్రితో, ‘నాన్నా, ఆస్తిలో నాకు రావలసిన భాగం నాకు ఇవ్వు’ అని అడిగాడు. కాబట్టి తండ్రి తన ఆస్తిని వారిద్దరికి పంచి ఇచ్చాడు. “కొన్ని రోజుల్లోనే, ఆ చిన్నకుమారుడు తన దగ్గర ఉన్నదంతా పోగుచేసుకుని, సుదూర దేశానికి బయలుదేరాడు అక్కడ తన ఇష్టం వచ్చినట్లు జీవిస్తూ తన సంపదను విచ్చలవిడిగా ఖర్చు చేశాడు. అతడు అంతా ఖర్చు చేసిన సమయంలోనే, ఆ దేశంలో తీవ్రమైన కరువు రావడం వలన అతనికి ఇబ్బందులు మొదలయ్యాయి. కాబట్టి అతడు ఆ దేశస్థులలో ఒకని పొలంలో పందులను మేపే పనిలో చేరాడు. అతనికి బాగా ఆకలివేస్తూ ఉండింది, కాని తినడానికి ఎవరూ ఏమి ఇవ్వలేదు కాబట్టి అతడు పందులు మేస్తున్న పొట్టుతో తన కడుపు నింపుకోవాలని చూశాడు. “అయితే వానికి బుద్ధి వచ్చినప్పుడు వాడు, ‘నా తండ్రి దగ్గర పని చేసే చాలామంది కూలివారికి కూడా సమృద్ధిగా ఆహారం ఉంది, కానీ నేను ఇక్కడ ఆకలితో చస్తున్నాను. నేను నా తండ్రి దగ్గరకు వెళ్లి అతనితో, నాన్నా, నీకు పరలోకానికి విరోధంగా నేను పాపం చేశాను. నీ కుమారుడనని అనిపించుకునే అర్హత కూడా నాకు లేదు, నన్ను నీ పనివారిలో ఒకనిగా పెట్టుకో అని చెప్తాను’ అనే ఆలోచనతో లేచి, అతని తండ్రి దగ్గరకు వెళ్లాడు. “వాడు ఇంకా దూరంగా ఉండగానే, వాని తండ్రి వాన్ని చూసి, వానిపై జాలిపడి, పరుగెత్తుకొని వచ్చి వాని కౌగిలించుకుని వాని మెడ మీద ముద్దు పెట్టుకున్నాడు. “అప్పుడు వాడు తన తండ్రితో, ‘నాన్నా, నీకు పరలోకానికిని విరోధంగా నేను పాపం చేశాను. ఇప్పటినుండి నేను నీ కుమారుడను అని అనిపించుకోడానికి కూడా అర్హున్ని కాను’ అని అన్నాడు. “కాని వాని తండ్రి తన పనివారితో, ‘త్వరగా! విలువైన వస్త్రాలను తెచ్చి ఇతనికి ధరింపచేయండి, వీని చేతికి ఉంగరం పెట్టి, కాళ్లకు చెప్పులను తొడిగించండి. ఒక క్రొవ్విన దూడను తెచ్చి వధించండి. మనం విందు చేసుకుని ఆనందిద్దాము. ఈ నా కుమారుడు చనిపోయి తిరిగి బ్రతికాడు, వీడు తప్పిపోయి దొరికాడు’ అని అన్నాడు. అలా వారందరు అతనితో ఆనందించడం మొదలుపెట్టారు.