లూకా 8:1-8

లూకా 8:1-8 TCV

ఆ తర్వాత, యేసు దేవుని రాజ్యసువార్తను ప్రకటిస్తూ, ఒక పట్టణం నుండి మరొక పట్టణానికి, ఒక గ్రామం నుండి మరొక గ్రామానికి ప్రయాణం చేశారు. ఆయనతోపాటు పన్నెండు మంది శిష్యులు ఉన్నారు, మరియు అపవిత్రాత్మల నుండి వ్యాధుల నుండి బాగుపడిన కొందరు స్త్రీలు, అనగా, ఏడు దయ్యాలు వదిలిపోయిన మగ్దలేనే మరియ; హేరోదు గృహనిర్వాహకుడైన కూజా భార్య యోహన్న; సూసన్న మరియు ఇంకా అనేకమంది ఉన్నారు. ఈ స్త్రీలు తమకు కలిగిన వాటితో వారికి సహాయం చేసేవారు. ఒక రోజు ప్రతి పట్టణం నుండి గొప్ప జనసమూహం యేసు దగ్గరకు వస్తుండగా, ఆయన వారికి ఈ ఉపమానం చెప్పారు: “ఒక రైతు విత్తనాలను చల్లడానికి వెళ్లాడు. అతడు విత్తనాలు చల్లేటప్పుడు, కొన్ని దారి ప్రక్కన పడ్డాయి; అవి కాళ్ళతో త్రొక్కబడ్డాయి, పక్షులు వచ్చి వాటిని తినివేసాయి. మరికొన్ని రాతి నేలలో పడ్డాయి, అవి మొలిచినప్పుడు, వాటికి తడి లేదు కనుక మొక్కలు ఎండిపోయాయి. మరికొన్ని విత్తనాలు ముండ్ల పొదలలో పడ్డాయి, వాటితో ఆ ముండ్ల పొదలు పెరిగి వాటిని అణిచివేసాయి. మరికొన్ని విత్తనాలు మంచినేలలో పడ్డాయి. అవి మొలకెత్తి, విత్తబడినవాటి కన్న వందరెట్లు అధికంగా పంటనిచ్చాయి.” ఆయన ఇది చెప్పిన తర్వాత, “వినడానికి చెవులుగలవారు విందురు గాక!” అని బిగ్గరగా అన్నారు.