లూకా 8:1-8
లూకా 8:1-8 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
ఆ తర్వాత, యేసు దేవుని రాజ్యసువార్తను ప్రకటిస్తూ, ఒక పట్టణం నుండి మరొక పట్టణానికి, ఒక గ్రామం నుండి మరొక గ్రామానికి ప్రయాణం చేశారు. ఆయనతోపాటు పన్నెండు మంది శిష్యులు ఉన్నారు, మరియు అపవిత్రాత్మల నుండి వ్యాధుల నుండి బాగుపడిన కొందరు స్త్రీలు, అనగా, ఏడు దయ్యాలు వదిలిపోయిన మగ్దలేనే మరియ; హేరోదు గృహనిర్వాహకుడైన కూజా భార్య యోహన్న; సూసన్న మరియు ఇంకా అనేకమంది ఉన్నారు. ఈ స్త్రీలు తమకు కలిగిన వాటితో వారికి సహాయం చేసేవారు. ఒక రోజు ప్రతి పట్టణం నుండి గొప్ప జనసమూహం యేసు దగ్గరకు వస్తుండగా, ఆయన వారికి ఈ ఉపమానం చెప్పారు: “ఒక రైతు విత్తనాలను చల్లడానికి వెళ్లాడు. అతడు విత్తనాలు చల్లేటప్పుడు, కొన్ని దారి ప్రక్కన పడ్డాయి; అవి కాళ్ళతో త్రొక్కబడ్డాయి, పక్షులు వచ్చి వాటిని తినివేసాయి. మరికొన్ని రాతి నేలలో పడ్డాయి, అవి మొలిచినప్పుడు, వాటికి తడి లేదు కనుక మొక్కలు ఎండిపోయాయి. మరికొన్ని విత్తనాలు ముండ్ల పొదలలో పడ్డాయి, వాటితో ఆ ముండ్ల పొదలు పెరిగి వాటిని అణిచివేసాయి. మరికొన్ని విత్తనాలు మంచినేలలో పడ్డాయి. అవి మొలకెత్తి, విత్తబడినవాటి కన్న వందరెట్లు అధికంగా పంటనిచ్చాయి.” ఆయన ఇది చెప్పిన తర్వాత, “వినడానికి చెవులుగలవారు విందురు గాక!” అని బిగ్గరగా అన్నారు.
లూకా 8:1-8 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ఆ తరువాత ఆయన ప్రతి పట్టణానికీ ప్రతి గ్రామానికీ దేవుని రాజ్య సువార్త బోధిస్తూ, ప్రకటిస్తూ సంచారం చేస్తున్నాడు. పన్నెండుగురు శిష్యులు, అపవిత్రాత్మలనుంచీ, రోగాలనుంచీ ఆయన బాగుచేసిన కొందరు స్త్రీలూ, అంటే ఏడు దయ్యాలు వదిలిపోయిన మగ్దలేనే మరియ, హేరోదు గృహ నిర్వాహకుడైన కూజా అనే అతని భార్య యోహన్నా, సూసన్నా ఇంకా అనేకమంది ఇతర స్త్రీలూ ఆయనతో కూడా ఉన్నారు. వారంతా తమ స్వంత ధనం, సామగ్రిని వెచ్చించి ఆయనకు, ఆయన శిష్యులకు సహాయం చేసేవారు. ఒకసారి ప్రతి పట్టణం నుండీ ప్రజలు పెద్ద గుంపులుగా యేసు దగ్గరికి వస్తున్నారు. అప్పుడు ఆయన వారికి ఒక ఉపమానం చెప్పాడు. “విత్తనాలు చల్లేవాడు చల్లడానికి బయలుదేరాడు. అతడు చల్లుతూ ఉండగా కొన్ని విత్తనాలు దారి పక్కన పడి మనుషుల కాళ్ళ కింద నలిగిపోయాయి. కాబట్టి గాలిలో ఎగిరే పక్షులు వాటిని మింగివేశాయి. మరి కొన్ని రాతి నేల మీద పడ్డాయి. అవి మొలిచాయి కానీ లోపల తడి లేకపోవడంతో ఎండిపోయాయి. మరి కొన్ని ముళ్ళపొదల మధ్యలో పడ్డాయి. ముళ్ళపొదలు వాటితో కూడా మొలిచి వాటిని అణచి వేశాయి. మరి కొన్ని మంచి నేలపై పడ్డాయి. అవి మొలిచి నూరు రెట్లుగా ఫలించాయి.” ఆయన ఇలా చెప్పి, “వినడానికి చెవులున్నవాడు విను గాక” అని బిగ్గరగా అన్నాడు.
లూకా 8:1-8 పవిత్ర బైబిల్ (TERV)
ఆ తర్వాత యేసు పట్టణాలు, పల్లెలు పర్యటించి దేవుని రాజ్యం యొక్క సువార్త ప్రజలకు ప్రకటించాడు. పన్నెండుమంది అపొస్తలులు ఆయన వెంటే ఉన్నారు. దయ్యాలు విడిపించబడిన కొందరు స్త్రీలు, రోగాలు నయం చేయబడిన కొందరు స్త్రీలు కూడా ఆయన వెంట ఉన్నారు. వీళ్ళలో మగ్దలేనే అని పిలవబడే మరియ ఒకతె. ఈమె నుండి ఏడు దయ్యాలు విడిపించబడ్డాయి. హేరోదు రాజుకు కుడిభుజంగా ఉన్న కూజా భార్య యోహన్న, సూసన్న, మొదలగు చాలా మంది స్త్రీలు ఆయన వెంట ఉన్నారు. వీళ్ళు తమ స్వంత డబ్బుతో యేసుకు, ఆయన అపొస్తలులకు సహాయం చేస్తూ ఉండేవాళ్ళు. అనేక గ్రామాల నుండి ప్రజలు యేసు దగ్గరకు వచ్చారు. ఒక పెద్ద గుంపు సమావేశమైంది. యేసు వాళ్ళకీ ఉపమానం చెప్పడం మొదలు పెట్టాడు: “ఒక రైతు విత్తనాలు చల్లడానికి పొలానికి వెళ్ళాడు. అతడు విత్తనాలు చల్లుతుండగా కొన్ని విత్తనాలు దారిపై పడ్డాయి. వాటిని ప్రజలు త్రొక్కి వేసారు. పక్షులు వచ్చి వాటిని తిని వేసాయి. మరికొన్ని విత్తనాలు మట్టి కొద్దిగా ఉన్న రాతి నేలపై పడ్డాయి. అవి మొలకెత్తాయి, కాని వాటికి తేమ దొరకనందువలన అవి వాడిపొయ్యాయి. మరికొన్ని విత్తనాలు ముళ్ళ మొక్కల స్థలంలో పడ్డాయి. ఈ విత్తనాలతో పాటు ముళ్ళ మొక్కలు కూడా పెరిగి వాటిని పెరగనివ్వలేదు. మరి కొన్ని విత్తనాలు సారవంతమైన భూమ్మీద పడ్డాయి. అవి మొలకెత్తి, పెరిగి పెద్దవై నూరు రెట్లు ఫలాన్నిచ్చాయి.” ఈ విధంగా చెప్పి, “వినే వాళ్ళు జాగ్రత్తగా వినాలి” అని బిగ్గరగా అన్నాడు.
లూకా 8:1-8 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
వెంటనే ఆయన దేవుని రాజ్యసువార్తను తెలుపుచు, ప్రకటించుచు, ప్రతి పట్టణములోను ప్రతి గ్రామములోను సంచారము చేయుచుండగా పండ్రెండుమంది శిష్యులును, అపవిత్రాత్మలును వ్యాధులును పోగొట్టబడిన కొందరు స్ర్తీలును, అనగా ఏడు దయ్యములు వదలి పోయిన మగ్దలేనే అనబడిన మరియయు, హేరోదుయొక్క గృహనిర్వాహకుడగు కూజా భార్యయగు యోహన్నయు, సూసన్నయు ఆయనతోకూడ ఉండిరి. వీరును ఇతరు లనేకులును, తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయుచు వచ్చిరి. బహుజనసమూహము కూడి ప్రతి పట్టణమునుండి ఆయనయొద్దకు వచ్చుచుండగా ఆయన ఉపమానరీతిగా ఇట్లనెను –విత్తువాడు తన విత్తనములు విత్తుటకు బయలు దేరెను. అతడు విత్తుచుండగా, కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కను పడి త్రొక్కబడెను గనుక, ఆకాశపక్షులు వాటిని మ్రింగివేసెను. మరి కొన్ని రాతినేలను పడి, మొలిచి, చెమ్మలేనందున ఎండిపోయెను. మరి కొన్ని ముండ్లపొదల నడుమ పడెను; ముండ్లపొదలు వాటితో మొలిచి వాటి నణచివేసెను. మరికొన్ని మంచినేలను పడెను; అవి మొలిచి నూరంతలుగా ఫలించెననెను. ఈ మాటలు పలుకుచు–వినుటకు చెవులు గలవాడు వినును గాక అని బిగ్గరగా చెప్పెను.