నెహెమ్యా 2
2
అర్తహషస్త నెహెమ్యాను యెరూషలేముకు పంపుట
1అర్తహషస్త రాజు పాలనలో ఇరవయ్యవ సంవత్సరం నీసాను నెలలో, రాజు కోసం ద్రాక్షరసం తీసుకువచ్చినప్పుడు నేను ద్రాక్షారసాన్ని తీసుకుని రాజుకు ఇచ్చాను. అంతకుముందు నేను వారి ముందు ఎప్పుడు బాధపడలేదు. 2కాబట్టి రాజు, “నీవు అనారోగ్యంగా లేవు కదా, మరి నీ ముఖం ఎందుకు విచారంగా ఉంది? ఇది హృదయంలో ఉన్న విచారమే తప్ప మరొకటి కాదు” అని అన్నారు.
అప్పుడు నేను చాలా భయపడ్డాను, కాని 3నేను రాజుతో, “రాజు చిరకాలం జీవించును గాక! నా పూర్వికులను పాతిపెట్టిన పట్టణం శిథిలావస్థలో ఉండి, దాని ద్వారాలు అగ్నికి ఆహుతి అయినప్పుడు నా ముఖం ఎందుకు విచారంగా కనిపించకూడదు?” అన్నాను.
4అప్పుడు రాజు, “నీకు ఏమి కావాలి?” అని అడిగాడు.
నేను పరలోకపు దేవునికి ప్రార్థనచేసి, 5రాజుతో, “రాజా, మీకు ఇష్టమైతే మీ సేవకుడనైన నాపై దయ చూపించండి. మా పూర్వికుల సమాధులున్న పట్టణాన్ని తిరిగి కట్టడానికి నన్ను యూదా దేశానికి పంపండి” అని అడిగాను.
6అప్పుడు రాణి తన ప్రక్కన కూర్చుని ఉండగా రాజు, “నీ ప్రయాణానికి ఎన్ని రోజులు పడుతుంది? మళ్ళీ ఎప్పుడు తిరిగి వస్తావు?” అని అడిగాడు. నేను ఎన్ని రోజులో చెప్పినప్పుడు రాజు నన్ను పంపడానికి ఇష్టపడ్డాడు.
7అప్పుడు నేను రాజును, “రాజుకు ఇష్టమైతే నేను యూదా దేశం చేరుకునేవరకు నేను క్షేమంగా ప్రయాణించడానికి యూఫ్రటీసు నది అవతలి అధిపతులకు ఉత్తరాలు ఇవ్వండి. 8పట్టణ గోడకు, ఆలయానికి సంబంధించిన కోట గుమ్మాలకు, నేను ఉండబోయే ఇంటికి దూలాలు, మ్రానులు ఇచ్చేలా రాజు అడవులపై అధికారియైన ఆసాపుకు ఉత్తరం ఇవ్వండి” అని అడిగాను. నా దేవుని కృప హస్తం నాకు తోడుగా ఉంది కాబట్టి రాజు నా అభ్యర్థన విన్నాడు. 9కాబట్టే నేను బయలుదేరి వెళ్లి యూఫ్రటీసు నది అవతలి అధిపతులకు రాజు ఉత్తరాలు ఇచ్చాను. రాజు నాతో పాటు సేనాధిపతులను గుర్రపు సేనను పంపించాడు.
10హోరోనీయుడైన సన్బల్లటు, అమ్మోనీయ అధికారియైన టోబీయా అనేవాడు ఇది విని ఇశ్రాయేలు ప్రజలకు ప్రయోజనం కలిగించడానికి ఎవరో వచ్చారని తెలిసి వారు చాలా కలవరపడ్డారు.
యెరూషలేము గోడలను పరిశీలించిన నెహెమ్యా
11నేను యెరూషలేముకు వచ్చి మూడు రోజులు అక్కడే ఉండి, 12రాత్రివేళ నేను నాతో ఉన్న కొంతమంది పురుషులతో కలిసి బయలుదేరాను. యెరూషలేము గురించి దేవుడు నా హృదయంలో ఉంచిన ఆలోచన ఎవరికి చెప్పలేదు. నేను ఎక్కిన జంతువు తప్ప నా దగ్గర మరో జంతువు లేదు.
13రాత్రివేళలో నేను లోయ ద్వారం#2:13 అంటే పశ్చిమాన ఉన్న ద్వారం యొక్క పేరు గుండా ఘటసర్పం బావి వైపు పెంట ద్వారం దగ్గరకు వెళ్లి కూల్చబడిన యెరూషలేము గోడలు, అగ్నితో కాల్చబడిన దాని గుమ్మాలను పరిశీలించాను. 14అక్కడినుండి నీటి ఊట గుమ్మానికి రాజు కొలను దగ్గరకు వెళ్లాను కాని నేను ఎక్కిన జంతువు వెళ్లడానికి ఆ దారి చాలా ఇరుకుగా ఉంది. 15రాత్రివేళలో నేను లోయ గుండా వెళ్లి గోడను పరిశీలించి తిరిగి లోయ గుమ్మం గుండా వెనుకకు వచ్చాను. 16నేను ఎక్కడ వెళ్లానో ఏమి చేస్తున్నానో అధికారులకు తెలియదు. యూదులకు గాని యాజకులకు గాని సంస్థానాధిపతులకు గాని ఇతర అధికారులకు గాని నేను ఆ విషయం చెప్పలేదు.
17నేను వారితో, “మనకున్న సమస్యను మీరు చూశారు. యెరూషలేము పాడైపోయింది దాని గుమ్మాలు కాలిపోయాయి. రండి, ఇకపై ఈ నింద మనమీద ఉండకుండా యెరూషలేమును తిరిగి కడదాం” అన్నాను. 18అంతే కాకుండా దేవుని కృపాహస్తమే నాకు తోడుగా ఉండడం గురించి రాజు నాతో చెప్పినవన్నీ వారితో చెప్పాను.
అందుకు వారు, “మనం పునర్నిర్మాణం మొదలుపెడదాం” అని చెప్పి ఈ మంచి పనిని ప్రారంభించారు.
19హోరోనీయుడైన సన్బల్లటు, అమ్మోనీయ అధికారియైన సేవకుడు టోబీయా, అరబీయుడైన గెషెము ఈ సంగతి విని మమ్మల్ని వేళాకోళం చేశారు. “మీరేం చేస్తున్నారు? రాజు మీద తిరుగుబాటు చేస్తారా?” అని మమ్మల్ని అడిగారు.
20అందుకు నేను, “పరలోకపు దేవుడే మాకు విజయాన్ని ఇస్తారు కాబట్టి ఆయన సేవకులమైన మేము పునర్నిర్మాణం మొదలుపెడతాము. మీకు యెరూషలేములో భాగం గాని, చారిత్రాత్మకమైన హక్కు గాని లేదు” అని వారితో చెప్పాను.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
నెహెమ్యా 2: TSA
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
Telugu Contemporary Version, Holy Bible
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Used with permission. All rights reserved worldwide.